Land Sale on Moon: చంద్రుడిపై భూమిని కొన్న తెలంగాణ మహిళ.. ఎకరం ఎంతో తెలుసా?

ABN , First Publish Date - 2023-08-26T17:56:42+05:30 IST

చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లూనా సొసైటీ ఇంటర్‌నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ కంపెనీలు చంద్రుడిపై భూమిని విక్రయిస్తున్నాయి. అయితే చంద్రుడిపై భూమి కొనుగోలు విషయంలో కొన్ని షరతులు వర్తిస్తాయి. తాజాగా తెలంగాణకు చెందిన మహిళ కూడా స్థలం కొనుగోలు చేసింది.

Land Sale on Moon: చంద్రుడిపై భూమిని కొన్న తెలంగాణ మహిళ.. ఎకరం ఎంతో తెలుసా?

భారత్ చేపట్టిన చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ కావడంతో యావత్ ప్రపంచం చూపు ఇప్పుడు చంద్రుడిపై పడింది. చంద్ర మండలంపై స్థితిగతులపై ప్రజ్ఞాన్ రోవర్ ఎలాంటి విషయాలను అందిస్తుందోనని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాల కోసం చంద్రుడిపై భూమి కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. చంద్రుడిపై నివాసయోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు చంద్రుడిపై భూమి కొనుగోలు కోసం లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్‌సైట్‌ను కూడా అమెరికా అందుబాటులోకి తెచ్చింది. దీంతో చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లూనా సొసైటీ ఇంటర్‌నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ కంపెనీలు చంద్రుడిపై భూమిని విక్రయిస్తున్నాయి.

అయితే చంద్రుడిపై భూమి కొనుగోలు విషయంలో కొన్ని షరతులు వర్తిస్తాయి. సాధారణంగా చంద్రుడిపై భూమి సమతలంగా ఉండదు. ఎన్నో బిలాలు, రాళ్లతో కూడి ఉంటుంది. భూమిపై మాదిరిగానే చంద్రుడిపై కూడా కొన్ని ఏరియాలు ఉంటాయి. వాటికి కూడా కొన్ని పేర్లను కేటాయించారు. అయితే ఈ భూమిపై కొనుగోలుదారులు యాజమాన్య హక్కులు పొందలేరు. కేవలం పేరుపై భూమి రిజిస్ట్రర్ అయ్యి ఉంటుంది. అంతరిక్షాన్ని ఎవరి స్వప్రయోజనాలకు వాడుకోకుండా 1967లో ఇండియా సహా 110 దేశాలు సంతకం చేశాయి. దీంతో ఏ దేశానికి చంద్రుడిపై యాజమాన్య హక్కులు ఉండవు. కానీ నివాసయోగ్యంగా ఉంటే నివసించవచ్చు. జాబిల్లిపై స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేకమంది ప్రతిష్టగా భావిస్తుండడంతో నివాస యోగ్యాలతో పని లేకుండా అక్కడ భూమి విక్రయాలు జరిగిపోతున్నాయి. చంద్రుడిపై భూమి కొనుగోలు చేయాలంటే లూనార్ రిజిస్ట్రీ కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకుని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కేవలం డాలర్ల రూపంలోనే లావాదేవీలు పూర్తి చేయాలి. కొనుగోలు చేయాలని భావించే వారు కరెన్సీని మార్చుకోవాలి. క్రెడిట్, డెబిట్ కార్డులతో లావాదేవీలు చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్‌ని డిజైన్ చేశానన్నాడు.. పెద్ద చిక్కుల్లో చిక్కుకున్నాడు.. చివరికి ఏమైందంటే?

గతంలోనే చాలా మంది సెలబ్రిటీలు చంద్రుడిపై భూమిని కొనుగోలు చేయగా తాజాగా తెలంగాణకు చెందిన మహిళ కూడా స్థలం కొనుగోలు చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 అడుగుపెట్టిన రోజే సాయి విజ్ఞత అనే మహిళ భూమి కొనుగోలు కోసం పెట్టుకున్న రిజిస్ట్రేషన్ పూర్తి కావడం విశేషం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రామచంద్ర, వకుళాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవాలో నివసిస్తోంది. ఆమె గవర్నర్ కిమ్ రెనాల్డ్స్‌కు ప్రాజెక్ట్ మేనేజర్‌గా, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది 2022లో లూనార్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో చంద్ర మండలంపై స్థలం కోసం ఆమె దరఖాస్తు చేసుకోగా మొన్నటివరకు పెండింగ్‌లో ఉంది. ఈనెల 23న సాయి విజ్ఞత తన తల్లి వకుళాదేవి, తన కూతురు ఆర్త సుద్దాల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు డాక్యుమెంట్లు అందాయి. మొత్తంగా చంద్రుడిపై ఎకరం స్థలం సాయి విజ్ఞత కొనుగోలు చేసింది. చంద్ర మండలంలో ఎకరం స్థలం ఇప్పుడు రూ.35 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2023-08-26T17:56:42+05:30 IST