ఆ పల్లెలు.. మట్టి దిబ్బలై!
ABN , First Publish Date - 2023-07-30T02:06:35+05:30 IST
వర్షం లేదు.. వరదా లేదు.. ఇవి మిగిల్చిన పెను విషాదం మాత్రం కలిచివేస్తున్నాయి! ఆ రెండు గ్రామాల్లో నేలమట్టమైన ఇళ్లు కొన్ని.. మోకాలిలోతు బురద, చెత్తా చెదారం పేరుకుపోయిన ఇళ్లు ఇంకొన్ని! బాధితులది నిలువ నీడలేని దైన్యం! పిల్లలు, ముసలివాళ్లకు బుక్కెడు బువ్వ వండి ..
కొండాయి, మోరంచపల్లిలో దారుణ పరిస్థితులు.. కూలిన ఇళ్లు.. నిండిన బురద
మూగ జీవాల కళేబరాలు.. అంతటా కంపు.. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులు
మోరంచపల్లిలో 2మృతదేహాలు లభ్యం.. ఇంకా తెలియని మరో ఇద్దరి ఆచూకీ
దొడ్ల గ్రామానికి ములుగు కలెక్టర్.. కొండాయి వాసుల దుస్థితికి చలించి కన్నీరు
భద్రాద్రిలో 56 అడుగులకు గోదారి.. కొత్తగూడెంలో 82 గ్రామాలు ముంపులో..
13,506 మంది పునరావాస కేంద్రాలకు.. నిరుడు ఇదే నెలలో భద్రాద్రికి సీఎం
ముంపు సమస్యకు పరిష్కారం దిశగా హామీ.. ఏడాదైనా మొదలవ్వని పనులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
వర్షం లేదు.. వరదా లేదు.. ఇవి మిగిల్చిన పెను విషాదం మాత్రం కలిచివేస్తున్నాయి! ఆ రెండు గ్రామాల్లో నేలమట్టమైన ఇళ్లు కొన్ని.. మోకాలిలోతు బురద, చెత్తా చెదారం పేరుకుపోయిన ఇళ్లు ఇంకొన్ని! బాధితులది నిలువ నీడలేని దైన్యం! పిల్లలు, ముసలివాళ్లకు బుక్కెడు బువ్వ వండి పెడదామన్నా పొయ్యి వెలిగించే పరిస్థితే లేదు. బియ్యం, పప్పులు తదితర దినుసులన్నీ తడిసిపోసి పనికిరాకుండా పోవడంతో జనం ఆకలితో అలమటస్తున్నారు. ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు ఇతర ఎలకా్ట్రనిక్ ఉపకరణాలు, బీరువాలు, మంచాలు, భూమి పత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్లు ఇలా అన్నీ కూడా వరదల్లో కొట్టుకుపోయాయి. వరదలు సృష్టించిన బీభత్సం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొండాయి, మోరంచపల్లి గ్రామాలు తేరుకోలేకపోతున్నాయి! వరద తెచ్చిన బురద, మురికి, చెత్తాచెదారంతో పాటు మూగజీవాల కళేబరాలతో పరిసరాలన్నీ కంపుకొడుతున్నాయి. విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తం కావడంతో ప్రజలు చీకట్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మిద్దెల మీదికి ఎక్కి వరద పోటు నుంచి ఎలాగో అలా ప్రాణాలు కాపాడుకున్నా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. దిక్కుతోచని స్థితిలో రోదిస్తూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈనెల 27న ఎగువన చెరువులు తెగి.. ఆ నీరంతా జంపన్నవాగులోకి ప్రవహించడం.. ఆ వాగు కొండాయి గ్రామంలోకి పోటెత్తింది. దంపతులు సహా ఎనిమిది గల్లంతై మంది మృతిచెందగా వందలమంది నిరాశ్రయులయ్యారు. గ్రామ పరిధిలోని సుమారు 300 ఎకరాల్లో ఇసుక మేటలు వేయడంతో వ్యవసాయానికి పనికిరాకుండా పోయింది. జంపన్నవాగు ఉధృతితో మల్యాల, దొడ్ల గ్రామాలూ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ రెండు గ్రామాల్లోనూ మోకాలిలోతు బురద, చెత్త పేరుకుపోయి దుర్గంధం నెలకొంది. మోరంచపల్లిలో 27న గల్లంతైన నలుగురిలో శనివారం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను గొర్రె ఓదిరెడ్డి (70), గంగిడి సరోజన (60)గా గుర్తించారు. గడ్డం మహాలక్ష్మి, గొర్రె వజ్రమ్మ ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం డ్రోన్ కెమెరాలతోనూ గాలిస్తున్నారు. మోరంచపల్లిలో 153 బర్లు, 753 కోళ్లు, 3 కాడెడ్లు, 5 బాతులు మృతిచెందినట్లు పశుసంవర్థకశాఖ అధికారులు గుర్తించారు.
ఇళ్లలోకి నీరొచ్చేదాకా ఎందుకు తెలియలేదు?
మల్యాల, దొడ్ల గ్రామాలూ కొండాయి పంచాయతీ పరిధిలోకే వస్తాయి. 3 గ్రామాల్లో కలిపి 1860 మంది నివసిస్తున్నారు. ఎగువన చెరువులకు గండ్లు పడిన విషయం తెలియకపోవడం.. ఆ ప్రవాహంతో జంపన్నవాగు తీవ్రతను అంచనా వేయకపోవడంతో ఈ మూడు గ్రామాల ప్రజలు ఇళ్లలోకి నీరొచ్చేదాకా ‘ముప్పు’ను పసిగట్టలేకపోయారు. ఈ మూడు ఊర్లలోనూ సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడతో అధికారులకు బాధితులు వెంటనే సమాచారమివ్వలేకపోయారు. ఫలితంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వరంగల్‌కు తప్పిన గండం
వరంగల్‌కు నగరానికి నీటి గండం వీడట్లేదు. భారీ వర్షాలతో పదుల సంఖ్యలో కాలనీలు వరద ముంపులో ఉక్కిరిబిక్కిరవుతుంటే తాజాగా నగరం నడి బొడ్డున ఉన్న భద్రకాళి చెరువుకు గండిపడింది. పోతననగర్ ఉన్న మత్తడికి 50 అడుగుల దూరంలో గండి పడింది. మూడు రోజుల కిందట చిన్నగా మొదలైన గండి.. శనివారం ఉదయం వరకు భారీగా ఏర్పడింది. పెద్ద ఎత్తున పోతననగర్ కాలనీల్లోకి నీరు చేరుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అధికారులు ఇసుక, సిమెంట్ బస్తాలను తెప్పించి గండికి అడ్డంగా వేసి.. బండరాళ్లను పెట్టడంతో ప్రవాహం నిలిచిపోయింది. ముందుజాగ్రత్తగా దిగువ ప్రాంతాలైన రంగంపేట, కాపువాడ, కాకతీయ కాలనీ, 12 మోరీల, స్మార్ట్ రోడ్డు తదితర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు.
అంతా 2గంటల్లోనే..
మా ఊర్లోకి జంపన్నవాగు నీళ్లొచ్చిన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు. రెండు గంటల్లో వరద గ్రామాన్ని ముంచెత్తింది. మా ఇల్లు కూలిపోయింది. కట్టుబట్టలతో మిగిలాం. ప్రభుత్వమే ఆదుకోవాలి -పోడెం ఉమ, దొడ్ల గ్రామం
పొలాల్లో ఇసుక మేటలు
నాకు 68 ఏళ్లు. ఇప్పటిదాకా ఇలాంటి వరదలు నేను చూడలేదు. పంట పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేశాయి. -చందా నర్సింగరావు, కొండాయి
కన్నీరు పెట్టిన కలెక్టర్
ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం వరద ప్రభావిత గ్రామమైన దొడ్లకు వచ్చారు. కలెక్టర్ తమ ఊరును సందర్శించరేమోనని భావించి కొండాయి సర్పంచ్ కాక వెంకన్న బోటు ద్వారా అక్కడికి వచ్చారు. వరద వల్ల తమ ఊర్లో 8 మంది చనిపోయారని, జనమంతా సర్వం కోల్పోయి రోడ్డు మీద పడ్డారని చెప్పుకొంటూ భోరుమన్నారు. కొండాయి గ్రామస్థుల పరిస్థితికి చలించిపోయిన ఇలా త్రిపాఠి కన్నీరు పెట్టుకున్నారు. ఇక వరద ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మరోవైపు.. తడ్వాయి మండలం మేడారం సమీపంలోని జంపన్నవాగు వద్ద విద్యుత్తు తీగలకు వేలాడుతూ కనిపించిన మృతదేహం ఓ యాచకుడిదని తెలిసింది. మృతదేహాన్ని మేడారంలోని వైకుంఠధామంలో సిబ్బంది ఖననం చేయించారు.
అమలుకు నోచుకోని కేసీఆర్ హామీ
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి ఇంకా పెరిగింది. శనివారం రాత్రి 11 గంటల సమయానికి 56 అడుగుల ఎత్తులో ప్రవాహం కొనసాగుతోంది. పలితంగా భద్రాద్రి రెవెన్యూ డివిజన్‌లోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక సహా మొత్తం 11 మండలాల పరిధిలోని 82 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఈ గ్రామాల్లో 4,121 కుటుంబాలకు చెందిన 13,056 మందిని 41 పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే మార్గంలో యాటపాక వద్ద, భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే మార్గంలో వరద నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా ముంపు ముప్పును నివారించేందుకు గానూ నిరుడు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూలైలో భారీ వర్షాలు పడటంతో భద్రాచలంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. అదేనెల 17న కేసీఆర్, భద్రాచలానికి వచ్చారు. ముంపు బాధితులను పరామర్శించారు. భద్రాచలానికి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. కరకట్ట ఎత్తును పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ బాధితుల కోసం మరోచోట 2016 డబుల్ బెడ్‌రూం ఇళ్లు అవసరం అని గుర్తించారు. ఈ మేరకు కరకట్ట ఎత్తు పెంచేందుకు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి రూ.1000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇది క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది. అయితే ముంపు బాధిత ప్రజల్లో కొందరు. తాము రూ.25 లక్షల నుంచి రూ.30లక్షల మేర వెచ్చించి ఇళ్లు కట్టుకున్నామని.. ఆ ఇళ్లను వదులుకొని ప్రభుత్వం నిర్మించి ఇచ్చే డబుల్ బెడ్‌రూం ఇళ్లలోకి రాలేమని స్పష్టం చేశారు. వరద నివారణ కోసం కరకట్ట ఎత్తు పెంచితే సరిపోతుందని చెప్పారు. ఫలితంగా మొత్తంగా ప్రక్రియే నిలిచిపోయింది.