Road Accident : పొగమంచు మృత్యువై కమ్మేసి..
ABN , Publish Date - Dec 26 , 2023 | 01:40 AM
పొగమంచు నిండు ప్రాణాలను బలిగొంది. బంధువుల్లో ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని రాత్రిపూట ఫోనొస్తే తెల్లవారుజామునే లేచి ఏడుగురు ఓ ఆటో మాట్లాడుకొని ప్రయాణం కట్టారు! బయలుదేరిన
ఆటో, లారీ ఢీ.. నలుగురి దుర్మరణం.. అంతకుముందే ప్రమాదంలో బంధువు మృతి
అక్కడికి వెళుతూ మృత్యువాత.. నల్లగొండ జిల్లా నిడమనూరులో విషాదం
వికారాబాద్ జిల్లాలో చెరువులోకి కారు.. ఒకరి మృతి.. నలుగురు క్షేమం
కాపాడాలంటూ బాధితుల వేడుకోలు.. వీడియో తీస్తూ కాలక్షేపం చేసిన జనం
శంషాబాద్‌ను కమ్మేసిన పొగమంచు!.. పలు విమాన సర్వీసుల దారి మళ్లింపు
గన్నవరం, బెంగళూరుకు తరలింపు.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు
నిడమనూరు, వికారాబాద్, మూడుచింతలపల్లి, నందిగామ, డిసెంబరు 25: పొగమంచు నిండు ప్రాణాలను బలిగొంది. బంధువుల్లో ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని రాత్రిపూట ఫోనొస్తే తెల్లవారుజామునే లేచి ఏడుగురు ఓ ఆటో మాట్లాడుకొని ప్రయాణం కట్టారు! బయలుదేరిన కొద్దిసేపటికే వారు ప్రయాణిస్తున్న ఆటో ఘోరరోడ్డు ప్రమాదానికి గురైంది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడ్ శివారులో కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. నిడమనూరు ఎస్‌ఐ గోపాల్‌రావు వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నీమానాయక్‌తండా శివారు మల్లెవానికుంటతండాకు చెందిన రమావత్ కేశవులు అలియాస్ శివ (19) ఆదివారం రాత్రి గుంటూరు నుంచి తండాకు వెళ్లేందుకు బైక్‌పై బయలుదేరాడు. రాత్రి 10:30కు నిడమనూరు మండలం వేంపాడ్ స్టేజీ వద్ద రోడ్డు దాటుతున్న వేంపాడ్ గ్రామానికి చెందిన బలుగూరి సైదులు(60)ను శివ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శివ, సైదులు మృతిచెందారు. శివ మృతిచెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు అతడిని చూసేందుకు తెల్లవారుజామున 4గంటలకు ఆటోలో పెద్దవూర మండలం నీమానాయక్‌తండా నుంచి మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి బయలుదేరారు. వారు ప్రయణిస్తున్న వాహనం నిడమనూరు మండలం వేంపాడ్ శివారు సాయిబాబా విగ్రహం సమీపంలో ప్రమాదానికి గురైంది. ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. వాహనంలో ప్రయాణిస్తున్న శివ పెదనాన్న రమావత్ గన్యా(40), మేనత్త మూడావత్ బుజ్జి(38), బావ దూపావత్ నాగరాజు(28), డ్రైవర్ రమావత్ పాండు(29) అక్కడికక్కడే మృతిచెందారు. శివ తండ్రి ప్రభాకర్, పాలక్‌నాయక్, వినోద్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా రంగారెడ్డి జిల్లాలో పొంగమంచు కారణంగా జరిగిన ప్రమాదంలో ఓ అయ్యప్ప భక్తుడు మృతిచెందాడు. నందిగామ మండలం తాటిగడ్డతండాకు చెందిన సురేందర్ నాయక్ (40) అయ్యప్ప మాల ధారణ చేశాడు. సోమవారం ఉదయం బైక్‌పై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద పొగమంచు కారణంగా దారి కనిపించక రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
సెలవులని సరదాగా కారులో వస్తే..
పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరు మృతిచెందగా మిగతావారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. ఏపీలోని అనకాపల్లి జిల్లా, దేవరంపల్లి మండలం మామిడిపల్లికి చెందిన గుణశేఖర్(24), వైజాగ్ భీమిలికి చెందిన కె. సాగర్, రఘుపతి, చిత్తూరు జిల్లా నగరికి చెందిన పూజిత, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు, సింగవరానికి చెందిన మోహన్ స్నేహితులు... వీరంతా హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వరుస సెలవులు ఉండటంతో వికారాబాద్‌కు వెళ్లి గడుపుదామనుకున్నారు. ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటలకు మోహన్ కారులో బయలుదేరారు. వికారాబాద్ సమీపంలోకి రాగానే విపరీతంగా మంచు కురుస్తుడటంతో రోడ్డు కన్పించలేదు. శివారెడ్డిపేట సమీపంలో తెల్లవారు జామున 5.30కు పక్కనే ఉన్న చెన్న శివసాగర్ అనే చెరువులోకి కారు దూసుకుపోయింది. డ్రైవింగ్ చేస్తున్న మోహన్, పూజిత, రఘుపతి, సాగర్ అతికష్టమ్మీద కారులోంచి బయటపడి ఒడ్డుకు చేరుకున్నారు. గుణశేఖర్ నీట మునిగి గల్లంతయ్యాడు. ప్రమాద ఘటన తెలిసి ఆవైపు వెళ్లే వాహనదారులు తమ వాహనాలను ఆపి.. చోద్యం చూశారే తప్ప ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేయలేదు. తమ స్నేహితుడు గుణశేఖర్‌ను రక్షించాలంటూ మిగతా నలుగురు ఆర్తనాదాలు చేసినా ఏమీ పట్టనట్లుగా చూస్తూ ఉండి పోయారు. గుణశేఖర్ తనను కాపాడాలంటూ వేడుకుంటున్న వీడియో ఒడ్డున ఉండి వీడియో తీసే వారి ఫోన్‌లో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా ఘటనాస్థలానికి పోలీసులొచ్చి గుణశేఖర్ మృతదేహాన్ని గత ఈతగాళ్లతో బయటకు తీయించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళుతున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఘటనాస్థలి వద్ద ఆగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన యువకుడి ఆచూకీ కనుక్కునేందుకు గజ ఈతగాళ్లతో గాలింపు ముమ్మరం చేయాలని పోలీసులను ఆదేశించారు.