Onion Farmer: తల్లడిల్లుతున్న ఉల్లి రైతు
ABN , First Publish Date - 2023-03-13T03:05:36+05:30 IST
ఉల్లి రైతుకు కన్నీళ్లే మిగులుతున్నాయి. నాలుగు నెలలు కష్టించి పండించిన పంటకు.. పెట్టుబడి మాట అటుంచితే కనీసం పంట తీసేందుకయ్యే కూలి డబ్బులు కూడా రాకపోతుండటంతో రైతులు తల్లడిల్లుతున్నారు.
మార్కెట్లో ధర లేక పంటను దున్నేస్తున్న వైనం
క్వింటాల్‌కు ప్రస్తుతం రూ.600-700 మాత్రమే..
మర్పల్లి మండలంలో 2 వేల ఎకరాల్లో సాగు
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు..
మర్పల్లి, మార్చి 12: ఉల్లి రైతుకు కన్నీళ్లే మిగులుతున్నాయి. నాలుగు నెలలు కష్టించి పండించిన పంటకు.. పెట్టుబడి మాట అటుంచితే కనీసం పంట తీసేందుకయ్యే కూలి డబ్బులు కూడా రాకపోతుండటంతో రైతులు తల్లడిల్లుతున్నారు. దీంతో కొందరు రైతులు పొలంలోనే పంటను వదిలేస్తుండగా, మరికొందరు చేతికొచ్చిన పంటను తీయకుండానే దున్నేస్తున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని సుమారుగా 20 గ్రామాల్లో రైతులు 2 వేల ఎకరాల వరకు ఉల్లి పంటను సాగు చేశారు. పంట చేతికి రావడంతో పొలంలో నుంచి తీసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. అయితే మార్కెట్‌లో ప్రస్తుతం ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.600 నుంచి 700 మాత్రమే పలుకుతోంది. పొలం నుంచి క్వింటాల్ ఉల్లి తీసేందుకు కూలీకి రూ.400 చొప్పున నలుగురికి మొత్తం 1,600.. మార్కెట్‌కు తరలించేందుకు కనీస వాహన కిరాయి రూ.500 పోగా.. వారికి తీవ్ర నష్టం జరుగుతోంది. దీంతో చేతికొచ్చిన పంటను తీయకుండా కొంతమంది రైతులు వదిలేస్తున్నారు. మరికొందరు రైతులు ధర పెరుగుతుందేమోనన్న ఆశతో పొలాల నుంచి ఉల్లి పంటను తీసి చెట్ల కిందే నిల్వ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేళ్లుగా మార్కెట్‌లో ఉల్లి పంటకు మంచి ధర లభించగా ఈ ఏడాది కూడా అదే ధర లభిస్తుందనే ఆశతో ఉల్లి పంట సాగు చేస్తే తమకు నష్టాలే మిగిలాయని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉల్లి పంటను ఎక్కువగా సాగు చేసే మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉల్లి రైతులు అక్కడ నిరసనలు చేస్తున్నారు.
రూ.100కు 6 నుంచి 8 కిలోలు..
రాష్ట్ర అవసరాలకు సరిపడా ఉల్లి దిగుబడులు లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి ఎక్కువగా పంట దిగుమతి చేసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లలో ఉల్లి సైజును బట్టి రూ.100కు 6 నుంచి 8 కిలోల వరకు వ్యాపారులు అమ్ముతున్నారు. అదే వివిధ యాప్‌లలో కిలో రూ.22 వరకు ధర ఉంది. కాగా, మార్కెట్లో ప్రస్తుతం ఉల్లి పంటకు ఇప్పటికిప్పుడు అమ్ముకోకుండా పండిన పంటను నిల్వ చేసి రాబోయే రోజుల్లో అమ్ముకుంటే లాభం ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని రైతుల పంటను గిడ్డంగుల్లో నిల్వ చేసే అవకాశం కల్పిస్తే వారిని కొంతవరకు ఆదుకోవచ్చని సూచిస్తున్నారు.
ఉల్లి రైతులను ఆదుకోవాలి..
మర్పల్లి మండల పరిధిలోని పంచలింగాల్ గ్రామానికి చెందిన ఉల్లి రైతు మొహినుద్దీన్ తన 3 ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశాడు. పంట చేతికొచ్చేసరికి మార్కెట్‌లో ధర లేకపోవడంతో 2 ఎకరాల ఉల్లి పంటను తీయకుండానే దున్నేశాడు. అదే పొలంలో టమాటా పంట సాగు చేస్తున్నానని మొహినుద్దీన్ చెప్పాడు. ఉల్లి పంటను సాగు చేయగా సుమారు రూ.2 లక్షల వరకు నష్టం జరిగిందని కన్నీరుమున్నీరయ్యాడు. ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవాలని కోరాడు.