Etala Rajender : వాళ్లే నాకు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్రు
ABN , First Publish Date - 2023-05-30T04:10:23+05:30 IST
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీలో చేర్చుకుందామనుకుంటే.. వాళ్లే తనకు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నరని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, పార్టీ
పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరకుండా మూణ్నెల్లు ఆపాను
● ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల బలంగా ఉంది: ఈటల
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీలో చేర్చుకుందామనుకుంటే.. వాళ్లే తనకు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నరని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, పార్టీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ చెప్పారు. వారు కాంగ్రెస్‌లో చేరకుండా మూడు నెలలపాటు నిలువరించినట్లు తెలిపారు. బీజేపీలో వారి చేరికల అంశం తమ పార్టీ అధినాయకత్వం చూసుకుంటుందన్నారు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు భావజాలానికి అడ్డా అని.. ఆ జిల్లాలో కాంగ్రెస్ కూడా కొన్నిచోట్ల బలంగానే ఉందని ఈటల తెలిపారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా.. సోమవారం, మాదాపూర్‌లోని ఒక హోటల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో కొద్దిసేపు చిట్‌చాట్ చేశారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నది తెలంగాణ ప్రజలేనని ఆయన పేర్కొన్నారు. ‘‘కర్ణాటకలో ఏం జరిగిందో అందరం చూశాం. ప్రజలు తలుచుకుంటే కేసీఆర్‌ను ఓడించడం లెక్కకాదు.. ఇప్పుడున్న ప్రత్యర్థి పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కొత్త వేదిక అవసరమేమో?’’ అని వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్ ట్రిక్కులు నాకు చాలా తెలుసు. ఆయన ప్రతి అవకాశాన్నీ తనవైపు తిప్పుకొంటరు. నాలుకకు అంటకుండా కాంగ్రెస్‌ను మింగేయగలడు. కేసీఆర్‌పై ఫైట్ చేస్తున్నది రేవంత్ కాదు.. తెలంగాణ ప్రజలు.. కాంగ్రెస్‌లో ఎవరు ఏమిటో నాకు బాగా తెలుసు. కేసీఆర్‌కు అన్ని పార్టీల్లోనూ కోవర్టులున్నరని ఎప్పుడో చెప్పిన. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు గోల్కొండ హోటల్‌లో మహాకూటమి నేతల ప్రతి కదలికపైనా కేసీఆర్‌కు క్షణక్షణం రిపోర్టు వచ్చేది.. టీ కప్పులు అందించినవాళ్లు.. చివరకు మరుగుదొడ్లు శుభ్రం చేసేవాళ్లు కూడా అప్పటి సమాచారం బీఆర్‌ఎస్ నాయకత్వానికి అందించారు. అంతేకాదు.. కొన్ని సెగ్మెంట్లలో తన ప్రత్యర్థి పార్టీ తరపున ఏ అభ్యర్థి ఉండాలో కూడా ఆయన నిర్దేశించిండు. కొంతమందికి ఎన్నికల ఖర్చు కూడా సమకూర్చిండు’’ అని ఈటల వివరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడంతో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.