క్యాన్సర్‌ కాదు.. కుంగుబాటే చంపింది!

ABN , First Publish Date - 2023-06-24T00:55:42+05:30 IST

ఇంట్లో ఒకరికి ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌ సోకిందని తెలిసి తీవ్ర కుంగుబాటుకులోనైన కుటుంబసభ్యుల్లో ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు!

క్యాన్సర్‌ కాదు.. కుంగుబాటే చంపింది!

భార్యకు వైద్య పరీక్షల్లో ప్రాణాంతక వ్యాధి నిర్ధారణ

ఆందోళనకు గురై ఆమె, భర్త, కూతురు ఆత్మహత్య

ఖమ్మం జిల్లా కొత్తకారాయిగూడెంలో విషాదం

పెనుబల్లి, జూన్‌ 23: ఇంట్లో ఒకరికి ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌ సోకిందని తెలిసి తీవ్ర కుంగుబాటుకులోనైన కుటుంబసభ్యుల్లో ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు! ఖమ్మంజిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెంలో ఈ ఘటన జరిగింది. మృతులు కొత్తకారాయిగూడెం గ్రామానికి చెందిన పోట్రు వెంకట కృష్ణారావు (42), ఆయన భార్య సుహాసిని (35) దంపతులు, వీరి కుమార్తె అమృత (16). ముగ్గురి మృతితో వెంకటకృష్ణారావు దంపతుల కుమారుడు కార్తీక్‌ ఒంటరయ్యాడు. వెంకట కృష్ణారావు రైతు. సుహాసిని గృహిణి! కుమారుడు కార్తీక్‌ బెంగళూరులో డిప్లొమా చదువుతూ ఉద్యోగం చేస్తున్నాడు. అమృత ఇంటర్‌ పాసై ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించింది. గతనెలలో సుహాసిని తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది. మనోధైర్యం కోల్పోయిన వెంకట కృష్ణారావు, సుహాసిని దంపతులు కుంగుబాటుకు గురయ్యారు. కుమారుడు కార్తీక్‌కు ఫోన్‌ చేసి చూడాలని ఉందంటూ బెంగళూరు నుంచి గురువారం ఇంటికి రప్పించారు.

కొడుకుతో కాసేపు ముచ్చటించారు. అనంతరం తాము ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులోని ఆస్పత్రికి వెళ్లివస్తామని కార్తీక్‌కు చెప్పి కుమార్తె అమృతను కూడా వెంటబెట్టుకొని బైక్‌ వెళ్లారు. రాత్రి 8గంటల సమయంలో కార్తీక్‌కు ఫోన్‌ చేసి రాత్రికి ఆస్పత్రిలో ఉండాల్సి వస్తోందని చెప్పారు. కాగా తిరువూరులో వెంకటకృష్ణారావు మూడు తాళ్లు, మూడు ప్లాస్టిక్‌ స్టూళ్లు కొన్నాడు. ముగ్గురూ ఇంటికి తిరుగుముఖం పట్టి తమ గ్రామం చేరువలోని నాగార్జునసాగర్‌ కాలువ పక్కనున్న సొంత మామిడితోటకు చేరుకున్నాడు. అక్కడ ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు, సోదరి రాకకోసం శుక్రవారం ఉదయం ఎనిమిదిగంటల వరకు వేచిచూసిన కార్తీక్‌, తర్వాత వారికి ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో విషయాన్ని తమ గ్రామస్థులు, బంధువులకు చెప్పాడు. వారంతా ఆయాప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు. ఆ మామిడితోటకు పక్కనే అదే గ్రామానికి చెందిన కొందరు భూమి సర్వే చేస్తుండగా తోట సమీపంలో వెంకటకృష్ణారావు బైక్‌ కన్పించింది. అనుమానంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. అందరూ కలిసి మామిడితోటలో వెతగ్గా ఓ చెట్టుకు ఆ ముగ్గురూ ఉరేసుకున్న స్థితిలో కన్పించారు. ఎస్‌ఐ సూరజ్‌, సత్తుపల్లి రూరల్‌ సీఐ హనూక్‌ ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2023-06-24T04:21:31+05:30 IST