ఆకునూరి మురళి ఎటువైపు?

ABN , First Publish Date - 2023-02-03T03:28:41+05:30 IST

మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఆకునూరి మురళి ఎటువైపు?

రాజకీయాల్లోకి వస్తానంటూ ఇటీవలే ప్రకటన..

కేసీఆర్‌ వైఖరిపై మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత

కాంగ్రెస్‌, బీజేపీ నుంచీ మాజీ ఐఏఎ్‌సకు ఆఫర్లు

ఇప్పటికే బీఎస్పీలోకి ఆహ్వానించిన ప్రవీణ్‌కుమార్‌

భూపాలపల్లి లేదా కొత్తగూడెంలో పోటీకి ఆసక్తి

భూపాలపల్లి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునకతో పాటు సింగరేణి సమస్యలు, నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలన్న డిమాండ్లతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరుబాట పట్టిన ఆయన.. ఏ పార్టీలో చేరుతారన్నది ఆసక్తికరంగా మారింది. సింగరేణి కుటుంబ నేపథ్యం ఉన్న ఆకునూరి మురళి మంచిర్యాల జిల్లాకు చెందిన వారు. సింగరేణి ఏరియాలో ఆయన కుటుంబానికి మంచి పట్టు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి లేదా కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం పేరిట ప్రజాసమస్యలపై ఉద్యమిస్తున్న మురళి చేర్చుకునేందుకు పలు పార్టీలు విస్తృతంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బహిరంగగానే మురళిని బీఎస్పీలోకి రావాలని కోరారు.

కలిసి పని చేద్దామని ఆహ్వానించగా.. దానిపై మురళి స్పందించలేదు. ఆమ్‌ ఆద్మీ వంటి జాతీయ పార్టీలో చేరి రాష్ట్ర పగ్గాలు చేపట్టాలని మొదట్లో భావించినా.. కేజ్రీవాల్‌, కేసీఆర్‌ దోస్తీ దృష్ట్యా ఆ ఆ ఆలోచనను విరమించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ నుంచి కూడా మురళికి ఆఫర్‌ వచ్చినట్టు సమాచారం. పెద్దపల్లి ఎంపీ సీటు, లేదంటే చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ సీట్లలో ఒక దాన్ని ఇచ్చేందుకు ఆ పార్టీ ఓకే చెప్పినట్లు తెలిసింది. మంచిర్యాల జిల్లాలో ఏదో ఒక సీటు ఇచ్చేందుకు బీజేపీ ముందుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ఓ కీలక నేత మురళితో చర్చించినట్టు సమాచారం. అయితే, భూపాలపల్లి, కొత్తగూడెం సీట్లను ఇచ్చేందుకు మాత్రం ప్రధాన పార్టీలు ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఈ రెండు స్థానాలు కూడా జనరల్‌ సీట్లు కావటంతో అధికార పార్టీ అభ్యర్థులను ఆయన ఆర్థికంగా తట్టుకోవడం కష్టమేనన్న వాదన ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆకునూరి మురళి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. ఏ పార్టీలో చేరకుంటే కొత్తగా పార్టీని స్థాపించే ఆలోచనలో మురళి ఉన్నట్లు చర్చ సాగుతోంది.

Updated Date - 2023-02-03T03:28:42+05:30 IST