BRS Meeting:సభ జరుగుతుండగానే వాహనాలు వెనక్కి!

ABN , First Publish Date - 2023-01-19T03:12:35+05:30 IST

బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నేపథ్యంలో వి.వెంకటాయపాలెంలో చేసిన ఏర్పాట్లు డొల్లగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

BRS Meeting:సభ జరుగుతుండగానే వాహనాలు వెనక్కి!

సభకు వచ్చి కొందరు.. వచ్చేదారిలో మరికొందరు..

సభకు 150 ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జగన్‌ పరోక్ష సాయం!

ఆంధ్రప్రదేశ్‌లో విపక్షాలకు మాత్రం ఆర్టీసీ నై

ఖమ్మం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నేపథ్యంలో వి.వెంకటాయపాలెంలో చేసిన ఏర్పాట్లు డొల్లగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు లక్షల మంది సభకు వస్తారని అంచనా వేసినా, ఆ మేరకు ఏర్పాట్లు చేయలేకపోయారు. దీంతో సభకు వచ్చేవారు, వచ్చినవారు ఇక్కట్లపాలయ్యారు. సీఎం కేసీఆర్‌, ఇతర అతిథులు గంట ఆలస్యంగా వచ్చారు. మరోవైపు సభకు వచ్చే వాహనాలతో ఖమ్మం బైపాస్‌ రోడ్డు, వైరా రోడ్డులో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సభ జరుగుతుండగానే వైరా, సూర్యాపేట, మహబూబాబాద్‌ రూట్ల నుంచి వచ్చే చాలా వాహనాలు వెనుదిరిగాయి. జనాన్ని తీసుకొచ్చిన ఏపీఎ్‌సఆర్టీసీ బస్సులు.. వారిని దించేసి, వెనక్కి వెళ్లిపోయాయి. కొత్త కలెక్టరేట్‌ను పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో కొందరినే లోపలికి అనుమతించారు. దీంతో చాలామంది ప్రజాప్రతినిధులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తాతా మధు లోపలికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులు అందరికీ భోజనాలు అందించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపించాయి. సరిగ్గా భోజనం సమయానికే సీఎంలు రావడం, బందోబస్తులో నిమగ్నం కావడంతో సమస్య జటిలమైనట్టు తెలుస్తోంది. దీంతో చాలామంది పస్తుంలుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలాచోట్ల భోజనాలు అందించే కానిస్టేబుళ్లకు, బందోబస్తుకు వచ్చేవారికి మధ్య వాగ్వాదం జరిగింది.

ఆ గ్రామానికి మూడు రోజుల వ్యథ!

బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లు.. చింతకాని మండలం వందనం గ్రామానికి మూడు రోజుల వ్యథను మిగిల్చాయి. సభ సమీపంలో మంచినీటిని సరఫరా చేసే బోరు విద్యుత్తును సభ జరిగే ప్రాంతానికి మరల్చారు. దీంతో 4 రోజులుగా గ్రామస్థులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సభతో ప్రయాణికులకు ఇబ్బందులు

ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌ పరిధిలోని ఆరు డిపోల నుంచి సుమారు 550 బస్సులను సభకే కేటాయించారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆర్టీసీ అధికారులు ఉదయం 6 గంటల నుంచే బస్సు సర్వీసులను నిలిపేసి.. సభకు పంపడంతో ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షించారు. వృద్ధులు, చంటిపిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం నుంచి హైదరాబాద్‌, సూర్యాపేట, కోదాడ, ఇల్లెందు, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, మహబూబాబాద్‌, తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట మండలంలోని సోలిపేట నుంచి ఖమ్మం సభకు కార్యకర్తలతో కలిసి లారీలో బయలుదేరారు. ఖమ్మం సమీపంలో తన కాన్వాయ్‌లో సభా ప్రాంగణానికి వెళ్లారు.

Updated Date - 2023-01-19T03:12:49+05:30 IST