మటన్ ఖీమా పొట్లకాయ
ABN , First Publish Date - 2023-04-29T00:28:49+05:30 IST
మటన్ ఖీమా- అరకేజీ, నూనె- 7 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లిపేస్ట్- ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు- టీస్పూన్, కారం పొడి- 2 టీస్పూన్లు..
కావాల్సిన పదార్థాలు
మటన్ ఖీమా- అరకేజీ, నూనె- 7 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లిపేస్ట్- ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు- టీస్పూన్, కారం పొడి- 2 టీస్పూన్లు, ఉప్పు- తగినంత, ధనియాల పొడి- టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి- అర టేబుల్ స్పూన్, గరం మసాలా- పావు టీస్పూన్, ఉల్లిపాయ ముక్కలు- కప్పు, కరివేపాకు- 10 ఆకులు, పచ్చిమిర్చి- 2 (సన్నగా తరగాలి)
తయారీ విధానం
కుక్కర్లో మటన్ ఖీమా వేశాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేశాక ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు వేసి కలపాలి. ఆ తర్వాత కుక్కర్ మూతను క్లోజ్ చేసి కనీసం పధ్నాలుగు విజిల్స్ వచ్చేంతవరకూ స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఆ తర్వాత కుక్కర్‌ను ఓపెన్ చేసి మటన్ ఖీమాను ఓ పాత్రలో వేసి ఉంచుకోవాలి.
ఈ లోపు పెద్ద పొట్లకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిలోని మిశ్రమాన్ని చిన్నస్పూన్తో తీసేస్తే రెండు వైపులా ఓపెన్ అయినట్లుంటాయి పొట్లకాయ ముక్కలు. ఆ తర్వాత ఉడికించిన మటన్ ఖీమాను ఈ పొట్లకాయ ముక్కల్లోకి కూరాలి. రెండు వైపులా వేళ్లు ఉంచి ముక్కల్లోకి ఖీమాను వీలైనంత ఎక్కువగా కూరాలి.
ప్యాన్‌లో నూనెవేసి అందులో ఉల్లిపాయలు వేసి గరిటెతో కదుపుతూ ఐదు నిముషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి. ఉల్లిపాయల రంగు మారిన తర్వాత కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం వేసుకుని అందులో ఖీమాతో స్టఫ్ చేసి పక్కన ఉంచుకున్న పొట్లకాయ ముక్కలను ఉంచాలి. మిగిలిన ఖీమా ఉంటే ఆ ముక్కలపై వేసి కనీసం ఇరవై నిముషాల పాటు మూత పెట్టి కుక్ చేయాలి. మధ్యలో మూడు నిముషాలకోసారి పొట్లకాయను అన్నివైపులా ఉడికేట్లు కదుపుతూ ఉండాలి. చివర్లో కరివేపాకు వేసి కొద్దిసేపటి తర్వాత దించేసుకోవాలి. మటన్ ఖీమా తురిమిన ఈ పొట్లకాయ కూరను చపాతీలో లేదా అన్నంతో తినొచ్చు.