Share News

Ap Power Shock : 10 వేల కోట్ల.. పవర్‌ షాక్‌!

ABN , Publish Date - May 29 , 2024 | 04:31 AM

విద్యుత్తు వినియోగదారులకు రూ.పది వేల కోట్ల మేర ‘పవర్‌షాక్‌’ తగలనుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసి, ఫలితాలకోసం ఎదురుచూస్తున్న వేళ ట్రూఅప్‌ చార్జీల కింద ఇంత భారం జనంపై వేసేందుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి.

Ap Power Shock : 10 వేల కోట్ల.. పవర్‌ షాక్‌!

ఈఆర్‌సీకి ప్రతిపాదించనున్న డిస్కమ్‌లు

ఫలితాలకు ముందు మరో బాదుడుకు రెడీ.. నాలుగేళ్లలో జనం నెత్తిన భారం 72,988 కోట్లు

ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని ఎన్నికల సమయంలో జగన్‌ బీద అరుపులు అరిచారు. పోలింగ్‌ పూర్తికాగానే అదే పేదలకు షాక్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు మోయలేనంతగా రూ.10,000 కోట్ల మేర ట్రూఅప్‌ భారం మోపేందుకు వేగంగా ప్రతిపాదనలు తయారవుతున్నాయి. వీటికి ఈఆర్‌సీ ఆమోదం లభిస్తే జనంపై జగన్‌ బాదుడు ఐదేళ్లలో ఏకంగా రూ.72,988 కోట్లకు చేరుతుంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విద్యుత్తు వినియోగదారులకు రూ.పది వేల కోట్ల మేర ‘పవర్‌షాక్‌’ తగలనుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసి, ఫలితాలకోసం ఎదురుచూస్తున్న వేళ ట్రూఅప్‌ చార్జీల కింద ఇంత భారం జనంపై వేసేందుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే 2022-23లో రూ.7,200 కోట్ల ట్రూఅప్‌ చార్జీలను వసూలుచేసుకునేలా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలికి (ఏపీఈఆర్‌సీ) డిస్కమ్‌లు ప్రతిపాదనలు పంపాయి. తాజాగా 2023-24 సంవత్సరానికి రూ.10,000 కోట్ల మేర ట్రూఅప్‌ చార్జీలను వసూలు చేసుకునేలా ఒకటి రెండు రోజుల్లో ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమయ్యాయి. గత ఏడాది ప్రతిపాదించిన రూ.7200 కోట్లకు.. తాజాగా ప్రతిపాదించనున్న రూ.10,000 కోట్లకు ఈఆర్‌సీ ఆమోద ముద్ర వేస్తే.. మొత్తంగా ప్రజలపై రూ.17,200 కోట్ల ట్రూఅప్‌ భారం పడబోతోంది. నిజానికి, గత ప్రభుత్వ హయాంలోని 2014-15 నుంచి 2018-19 వరకు గల ట్రూ అప్‌ చార్జీలను కూడా గత నాలుగేళ్లలో జగన్‌ వసూలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిందో లేదో డిస్కమ్‌లు... ఏపీఆర్‌సీపై ఒత్తిడిని పెంచేలా చేయడంద్వారా విపరీతమైన చార్జీల భారాన్ని వేసేందుకు జగన్‌ సిద్ధమయ్యారు. ఇప్పటికే డిస్కమ్‌లు దాదాపు రూ.60,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. దాదాపు 80, 000 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. వీటితోపాటు విద్యుత్తు కొనుగోళ్లు.. నిర్వహణ వ్యయాల భారాన్ని మోయలేకపోతున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.30,000 కోట్లు వరకు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు వెలువడేలోగానే ట్రూఅప్‌ చార్జీల రూపంలో విద్యుత్తు భారాన్ని వినియోగదారులపై వేసే యోచనలో డిస్కమ్‌లు ఉన్నాయి. ట్రూఅప్‌ చార్జీలను ఏనెలకు ఆ నెల వసూలు చేయాలని కేంద్ర ఇంధనశాఖ, కేంద్ర ఇంధన నియంత్రణ సంస్థ ఆదేశాలు జారీచేశాయి. ఈ ఆదేశాలను పరిగణనలోనికి తీసుకుని, రూ.10,000 కోట్లకు పైగా ట్రూఅప్‌ చార్జీలను వసూలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఈఆర్‌సీని డిస్కమ్‌లు కోరేందుకు సన్నద్ధమయ్యాయి.


బాదుడే బాదుడు

ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్తు చార్జీలు భరించలేనంతగా ఉన్నాయంటూ చంద్రబాబు సర్కారుపై జగన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను అధికారంలోకి వస్తే విద్యుత్తు చార్జీలు పూర్తిగా తగ్గించేస్తానంటూ జగన్‌ హామీ ఇచ్చారు. కానీ, అధికారపగ్గాలు చేపట్టినవెంటనే 2014-15 నుంచి 2018-19 సంవత్సరాలకు గాను రూ.3669 కోట్ల ట్రూఅప్‌ భారాన్ని రాష్ట్ర ప్రజలపై జగన్‌ వేశారు. 2020 ఫిబ్రవరిలో నెలకు 500 యూనిట్లపైబడి విద్యుత్తును వినియోగించేవారిపై యూనిట్‌కు 90 పైసలు చొప్పున రూ.1,300 కోట్లు వసూలుచేశారు. 2020 మే నెలలో కరోనా శ్లాబులు పేరిట రూ.1,500 కోట్లను వసూలుచేశారు. 2021 ఏప్రిల్‌లో కిలోవాట్‌కు పది రూపాయలు పెంచడం ద్వారా రూ.3,542 కోట్లు వసూలు చేశారు. 2022 ఏప్రిల్‌ నెలలో శ్లాబులు కుదింపు పేరిట రూ.3,900 కొట్ల మేర భారాన్ని వేశారు. ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్ఛేజీ కాస్ట్‌ పేరుతో రూ.700 కోట్లను వసూలు చేశారు. 2021-22లో విద్యుత్తు కొనుగోళ్ల సర్దుబాటు పేరిట రూ.3,082 కోట్ల భారాన్ని వేశారు. 2023 మేనెల నుంచి ఫ్యూయల్‌ అండ్‌ పర్ఛేజీ కాస్ట్‌ అడ్జ్‌స్టమెంట్‌ పేరిట రూ.400 కోట్లు వసూలుచేశారు. 2022-23లో ట్రూఅప్‌ పేరిట రూ.7,200 కోట్లు వసూలు చేసుకునేందుకు ఈఆర్‌సీకి ప్రతిపాదనలు పంపాను. దీనిపై ఈఆర్‌సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా.. 2023-24 సంవత్సరంలో మరో రూ.10000 కోట్లను ట్రూఅప్‌ చార్జీలుగా వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలపాలని ఈఆర్‌సీని కోరేందుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి. మొత్తంగా దాదాపు రూ.33,893 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై జగన్‌ భారాన్ని వేశారు. ఇదికాకుండా .. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా తెచ్చిన అప్పులు రూ,36,261 కోట్లు , హిందూజాకు చెల్లించేందుకు తెచ్చిన అప్పు రూ.2,834 కోట్లను కలిపితే మొత్తం భారం దాదాపు రూ.72,988 కోట్లకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - May 29 , 2024 | 06:17 AM