Share News

23 లక్షల కార్డులు కట్‌!

ABN , Publish Date - May 03 , 2024 | 04:46 AM

మరొక్క చాన్స్‌ ఇస్తే జగన్‌ ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది! మళ్లీ అధికారం అప్పగిస్తే... వాతలతోపాటు పథకాల్లో భారీగా కోతలూ తథ్యం! సిద్ధం...

23 లక్షల కార్డులు కట్‌!

‘మరొక్క చాన్స్‌’ ఇస్తే జరిగేది ఇదే..!

ఒక్క చాన్స్‌ అంటూ వచ్చారు! జనాన్ని బటన్‌ నొక్కుడు

మాయలో ముంచి... వాతలు పెట్టారు!

మరొక్క చాన్స్‌ ఇస్తే జగన్‌ ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది! మళ్లీ అధికారం అప్పగిస్తే... వాతలతోపాటు పథకాల్లో భారీగా కోతలూ తథ్యం! సిద్ధం... సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్మోహన్‌ రెడ్డి, తాను రెండోసారి అధికారంలోకి వస్తే రేషన్‌ కార్డులు, వాటితో ముడిపడిన పథకాల లబ్ధిదారులకు కోత పెట్టేందుకు ఇప్పటికే రంగం ‘సిద్ధం’ చేసుకున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మేధో, పరిశోధన సంస్థ సెంటర్‌ ఫర్‌ పాలసీ రిసెర్చ్‌ (సీపీఆర్‌) నివేదిక సాక్షిగా బయటపడిన విషయమిది!

ఏడాదిన్నర కిందటే మొదలైన ఏరివేత కసరత్తు

బియ్యం కార్డులపై సీపీఆర్‌తో అధ్యయనం

కుటుంబాలు-కార్డుల మధ్య మిస్‌ మ్యాచ్‌

77 శాతం మాత్రమే సరిపోలాయన్న సంస్థ

మిగిలిన 23 లక్షల కార్డులు ‘తేడా’ అని నిర్ధారణ

ఈ ఏడాది జనవరిలోనే సర్కారుకు నివేదిక

ఎన్నికలున్నందునే గప్‌చు్‌పగా జగన్‌ ప్రభుత్వం

మళ్లీ అధికారంలోకి వస్తే కోతలు ఖాయం

బియ్యం కార్డుతో ముడిపడిన పథకాలూ దూరం

కలకలం రేపుతున్న సీపీఆర్‌ నివేదిక

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

2009లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కాగానే పథకాలపై ‘సమీక్ష’కు శ్రీకారం చుట్టారు. సంతృప్త స్థాయిలో ఇచ్చిన పథకాల్లో కోతలు పెట్టేందుకు సిద్ధమయ్యారు! ఇప్పుడు... వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కూడా అచ్చం ఇలాగే ఆలోచిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి రాకముందే, ‘కోతల’కు రంగం సిద్ధం చేశారు. ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఏకంగా 23 లక్షల రేషన్‌ కార్డులు రద్దయినట్లే! వాటితోపాటు... కార్డులతో ముడిపడిన పథకాలూ దూరమైనట్లే!

అసలేం జరిగింది?... ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య పెంచాలని చూస్తుంది. జనాభా, కుటుంబాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి... లబ్ధిదారుల సంఖ్య కూడా పెరగాలి. కానీ, జగన్‌ ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో వీలైనంత మందికి కోత పెట్టాలని ఆలోచిస్తోంది. ఇప్పటికే ‘ఆరు షరతుల’ చట్రంలో అనేకమందికి పథకాలు దూరం చేశారు. బటన్‌ నొక్కే ప్రతిసారీ ఆయా పథకాలకు వీరు అర్హులు కాదంటూ అర్థంలేని కారణాలు చూపించి పక్కన పెట్టేశారు. ఎవరెవరికి ఎందుకు రద్దు చేస్తున్నారో గ్రామ సచివాలయాల నోటీసు బోర్డుల్లో రాసేవారు. ఇలా పదుల్లో, వందల్లో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడం వల్ల పెద్ద ఉపయోగం లేదని జగన్‌ భావించినట్లుంది! అందుకే... ‘స్కీముల్లో లీకేజ్‌ అరికట్టడం’ అనే బాధ్యతను సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌ (సీపీఆర్‌) అనే సంస్థకు అప్పగించారు. అదికూడా... ఏడాదిన్నర కిందటే! ఈ సంస్థ జనవరిలోనే నివేదిక అందించింది. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఈ పని చేసి ఉంటే దీనికి ప్రాధాన్యం ఉండేది కాదేమో! కానీ... ఎన్నికల ముందు ‘లీకేజీ’పై దృష్టి పెట్టడం గమనార్హం. అంటే... రెండోసారి అధికారంలోకి వస్తే, ఆ వెంటనే పథకాలకు కోతలు పెట్టాలన్నదే జగన్‌ ఉద్దేశమని ఇట్టే అర్థమవుతుంది.


‘రేషన్‌’కు కోత... సీపీఆర్‌ సంస్థ రాష్ట్రంలోని రేషన్‌కార్డులపై ముందుగా దృష్టి సారించింది. ఏకంగా 23లక్షల బియ్యం కార్డులు అదనంగా/అనవసరంగా/అనర్హుల వద్ద ఉన్నాయని తేల్చింది. అంటే... ఆ మేరకు కార్డులకు కోత పెట్టాలని సిఫారసు చేయడమే! చేయూత, అమ్మఒడి పథకాలను కూడా అధ్యయనం చేసి వీటిలోనూ లీకేజీలు ఉన్నాయని వెల్లడించింది. గ్రామవార్డు సచివాలయాల వద్ద ఉన్న డేటాబేస్‌ ఆధారంగా ఈ అధ్యయనం చేసినట్టు ఆ సంస్థ పేర్కొంది. అంటే, జగన్‌ అధికారంలోకి వచ్చాక కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన ఉద్యోగులు సేకరించి, రూపొందించిన డేటాబేస్‌ ఇది. ‘‘మొత్తం తెల్ల రేషన్‌ కార్డుల డేటాను రాష్ట్రంలోని 1.65 కోట్ల కుటుంబాలతో పోల్చి చూశాం. ఇందులో 15లక్షల కుటుంబాలకు బియ్యం కార్డులు లేవు. మిగిలిన కార్డులు-కుటుంబాల డేటాలో 77శాతం మ్యాచ్‌ అయ్యాయి. ఒక కుటుంబానికి ఒకటికి మించి కార్డులు జారీచేయడం, ఒక కుటుంబం మరో కార్డు ఐడీతో ఉండటం, లేదా ఈ రెండూ మిస్‌మ్యాచ్‌లూ చోటుచేసుకోవడం జరిగింది’’ అని సీపీఆర్‌ నిర్ధారించింది. సీపీఆర్‌ అధ్యయనం ప్రకారం... రాష్ట్రంలో బియ్యం కార్డులు లేని కుటుంబాల సంఖ్యను మినహాయిస్తే, 23 లక్షల కార్డులు- కుటుంబాలు మిస్‌ మ్యాచ్‌ అయ్యాయి. వెరసి... 23 లక్షల కుటుంబాలకు ఇప్పుడున్న కార్డులను తీసేయాలని సూటిగా సిఫారసు చేయడమే. ఒకవేళ తిరిగి అధికారంలోకి వస్తే జగన్‌ చేసే మొదటి పని ఈ రేషన్‌ కార్డులను తొలగించడమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటికే కష్టంగా పథకాల అమలు

ఈ ఐదేళ్లలో జగన్‌ చెప్పుకోడానికి ఏమైనా ఉందంటే... ‘బటన్‌ నొక్కుడు’ ఒక్కటే! పాత పథకాల పేర్లు, అమలు తీరు మార్చడమే ఆయన చేసింది. ఆ పథకాలూ కష్టంగానే అమలవుతున్నాయి. బటన్‌ నొక్కి రోజులు, వారాలు గడుస్తున్నా ఖాతాల్లో డబ్బు పడని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక... ఉద్యోగుల జీతాలు, పింఛన్ల సంగతి సరేసరి! అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో... ఈసారే 1న జీతాలు పడ్డాయి. ఆదాయం ఆశించినంతగా పెరగ లేదు. పన్నులు, చార్జీలు, సెస్సులతో బాదుతున్నా పరిస్థితి మారడంలేదు. ఏటా రూ.లక్ష కోట్లకు పైగా అప్పులు తెస్తూ నెట్టుకొస్తున్నారు. కొంతకాలం నుంచి అవీ పుట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే పథకాలకు ‘కోత’పెట్టి, ఖర్చు తగ్గించుకోవాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే... సీపీఆర్‌ సంస్థను ఆశ్రయించారు. ఈ సంస్థ ఏడాదిన్నర నుంచి అధ్యయనం చేసి మూడు నెలల క్రితమే ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. అనేక పథకాలకు మౌలిక అర్హతగా భావించే తెల్ల రేషన్‌ కార్డులు 23 లక్షలు ‘మిస్‌మ్యాచ్‌’ అయినట్లు సీపీఆర్‌ సంస్థ తేల్చింది. వీటిని రద్దు చేస్తే సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులు లక్షల్లో తగ్గిపోతారు. జగన్‌ ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదే. కానీ, ఇంతలో ఎన్నికలొచ్చాయి. దీంతో ఆ నివేదికను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఎన్నికల్లో జగన్‌ మళ్లీ గెలవడమంటూ జరిగితే 23 లక్షల రేషన్‌ కార్డులు రద్దుకావడం ఖాయం. లబ్ధిదారులు లబోదిబోమనడం ఖాయం.


మన్మోహన్‌ పని చేసిన సంస్థ...

రాష్ట్రంలోని కుటుంబాలకు - రేషన్‌ కార్డులకు మధ్య తేడా ఉందని తేల్చిన సీపీఆర్‌ ఆషామాషీ సంస్థ కాదు. ప్రభుత్వ విధానాలపై పరిశోధన, విశ్లేషణ, సూచనలు చేయడంలో సీపీఆర్‌కు జాతీయ స్థాయిలో పేరుంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, నిపుణులు ఇందులో భాగస్వాములు! మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా సీపీఆర్‌లో సేవలు అందించారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు అధ్యయన బాధ్యతలు అప్పగించారంటే... తేలిగ్గా తీసిపడేయలేం. సంస్థ సిఫారసులను ‘సీరియ్‌స’గా తీసుకుని అమలు చేసేందుకు సిద్ధమైనట్లే!

Updated Date - May 03 , 2024 | 04:46 AM