తొలిరోజే 4.3 లక్షల బుకింగ్‌లు: మంత్రి మనోహర్
ABN , Publish Date - Oct 31 , 2024 | 04:09 AM
రాష్ట్రంలో దీపం-2 పథకాన్ని సీఎం చంద్రబాబు నవంబరు 1న ప్రారంభించనున్నారని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దీపం-2 పథకాన్ని సీఎం చంద్రబాబు నవంబరు 1న ప్రారంభించనున్నారని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సూపర్ సిక్స్‌లో అమలవుతున్న మొదటి పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అన్నారు. మంగళవారం ఉదయం నుంచే ఉచిత గ్యాస్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని తొలిరోజే 4.3 లక్షల బుకింగ్‌లు జరిగాయన్నారు. లబ్ధిదారుల నుంచి భారీ స్పందన వస్తోందని చెప్పారు. రోజుకు రెండున్నర లక్షల బుకింగ్‌లకు డెలివరీ చేయగలమని గ్యాస్ కంపెనీలు చెప్పాయన్నారు. కొత్త రేషన్ కార్డుల డిజైన్ జరుగుతోందని, త్వరలోనే కొత్త కార్డులు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాలు ఎక్కడా ఇంటింటికీ వెళ్లలేదని, మూడు షాపులకు ఒక వ్యాన్ చొప్పున రూ.1500 కోట్లు గత ప్రభుత్వం దీనిపై ఖర్చు చేసిందని, అంతిమంగా వినియోదారుడికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు.