Chandrababu : 84 వేల కోట్ల పెట్టుబడులు 5 లక్షల ఉద్యోగాలు
ABN , Publish Date - Nov 04 , 2024 | 05:02 AM
ఎలకా్ట్రనిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఐదేళ్లలో రూ.84,000 కోట్ల పెట్టుబడుల సమీకరణ... ఐదు లక్షల మందికి ఉద్యోగాల కల్పన...
ఇంటికో వ్యాపారవేత్త ఉండాలన్నదే ధ్యేయం
ఐదేళ్లలో ఎలకా్ట్రనిక్స్, ఐటీ రంగంలో కల్పనే లక్ష్యం
పెట్టుబడి సంస్థలకు ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు
సింగిల్ విండో విధానంలో 21 రోజుల్లో అనుమతులు
2024-29 ఎలకా్ట్రనిక్స్ పాలసీ రూపకల్పన
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఎలకా్ట్రనిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఐదేళ్లలో రూ.84,000 కోట్ల పెట్టుబడుల సమీకరణ... ఐదు లక్షల మందికి ఉద్యోగాల కల్పన... ప్రతి ఇంటా ఒక వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2024-29 ఎలకా్ట్రనిక్స్ పాలసీని రూపొందించింది. ఐటీ, ఎలకా్ట్రనిక్స్ సేవలను విస్తృతం చేసేలా ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు బ్లూ ప్రింట్‌తో ముందుకు వచ్చే పరిశ్రమలకు సామర్థ్యాలను బట్టి భూ కేటాయింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 20 క్లస్టర్లతో పాటు కొత్తగా మరో 29 ఐటీ క్లస్టర్ల కోసం 1.32 లక్షల ఎకరాలను గుర్తించినట్లు తెలిపింది. ఐటీ పార్కులకు సరిపడేంత విద్యుత్, నీరు సరఫరా చేస్తామని పేర్కొంది. ప్రాజెక్టుల ప్రారంభానికి ఎలాంటి అవరోధాలు లేకుండా, సత్వర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఎలకా్ట్రనిక్స్ పాలసీ అమలుపై ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాలసీ ప్రకారం.. ఐటీ, ఎలకా్ట్రనిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు సింగిల్ విండో విధానం ద్వారా 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తారు. ఎకనామిక్ డెవల్‌పమెంట్ బోర్డు (ఈడీబీ)తో సమన్వయం చేస్తూ పెట్టుబడులకు సానుకూల వాతావరణం కల్పిస్తారు. విదేశీ పెట్టుబడిదారులకు ప్రత్యేక చేయూతనిస్తూ సహకారం అందిస్తారు. ఇంటిగ్రేటెడ్ డేటా మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అమలు చేస్తారు. రూ.50 కోట్ల నుంచి 200 కోట్ల దాకా సబ్‌లార్జ్ ప్రాజెక్టులుగా, రూ.200 కోట్ల నుంచి 1000 కోట్ల దాకా లార్జ్ ప్రాజెక్టులు, రూ.1000 కోట్ల నుంచి 5,000 కోట్ల దాకా మేజర్ ప్రాజెక్టులు, రూ.5,000 కోట్లు దాటితే అల్ర్టా మెగా ప్రాజెక్టులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఈ మేరకు ప్రోత్సాహకాలు కూడా నిర్దేశిస్తుంది. ఐదు సమాన వాయిదాల్లో 25 శాతం క్యాపిటల్ ఇన్వె్‌స్టమెంట్ సబ్సిడీని అందిస్తుంది. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సబ్సిడీలు ఉంటాయి. ఐదేళ్ల పాటు యూనిట్ రూపాయికే విద్యుత్తును అందిస్తారు. స్టాంపు డ్యూటీలో మినహాయింపు ఉంటుంది. ఉద్యోగుల ప్రోత్సాకాల్లో భాగంగా ప్రతినెలా ప్రతి పురుష ఉద్యోగికి రూ.4,000, ప్రతి మహిళా ఉద్యోగికి రూ.6,000 చొప్పున ఆరు నెలలపాటు చెల్లిస్తారు.
ఇండస్ట్రియల్ నోడ్‌లు
ఐటీ, ఎలకా్ట్రనిక్స్ పార్కుల్లో సమర్థ యాజమాన్య నిర్వహణను కల్పిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రవాణా వ్యయాలు తగ్గేలా పోర్టులు, విమానాశ్రయాలు, రహదారుల సదుపాయాలు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నాయని పేర్కొంది. విశాలమైన భూములు, మౌలిక సదుపాయాలతో కూడిన ఇండస్ర్టియల్ నోడ్‌లను అందుబాటులోకి తెస్తున్నామని పాలసీలో పేర్కొంది. ఉత్పత్తి రంగానికి చెందిన క్లస్టర్లకు అత్యుత్తమ లాజిస్టిక్ ఇన్‌ఫ్రా అందుబాటులో ఉందని వెల్లడించింది. విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.