ట్రిపుల్‌ఐటీలో సీట్లకు 50,106 దరఖాస్తులు
ABN , Publish Date - Jun 18 , 2024 | 11:37 PM
రాష్ట్రంలో ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సమీకృత ఇంజనీరింగ్ కోర్సులకు ఇప్పటి వరకు 50,106 దరఖాస్తులు వచ్చాయి. ఈ యేడాది 10వ తరగతి పాసైన విద్యార్థులు దర ఖాస్తుకు అర్హులు.
దరఖాస్తుకు 25 వరకు గడువు
11న ఎంపిక జాబితా విడుదల
వేంపల్లె, జూన్ 18: రాష్ట్రంలో ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సమీకృత ఇంజనీరింగ్ కోర్సులకు ఇప్పటి వరకు 50,106 దరఖాస్తులు వచ్చాయి. ఈ యేడాది 10వ తరగతి పాసైన విద్యార్థులు దర ఖాస్తుకు అర్హులు. గత నెల చివరి వారంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆర్జీయూ కేటీ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇడుపుల పాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల్లో చేరేందుకు ఇప్పటికి 50,106 దరఖాస్తులు వచ్చాయి. ఇక వారం రోజులే గడువు ఉంది. ఈనెల 25వ తేదీ సాయంత్రం 5గంటలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. 4,400 సీట్లకు గాను గత ఏడాది 40వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే అదనంగా 10వేల దరఖాస్తులు వచ్చాయని ఆర్జీయూకేటీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మెరిట్ ఆధారంగా జూలై 11న ఎంపిక జాబితా విడుదల చేయనున్నారు.