Share News

ఫొటోల పిచ్చి ఖరీదు 700 కోట్లు

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:59 AM

వైసీపీ అధినేత జగన్‌కు ఉన్న ప్రచారపిచ్చి రాష్ట్ర ఖజానాను గుల్లచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ‘‘కోటి రూపాయలో, పది కోట్లో కాదు...

ఫొటోల పిచ్చి ఖరీదు 700 కోట్లు

గ్రానైట్‌ రాళ్లపై జగన్‌ ఫొటోల ఖర్చు ఇది

తుడిపేయాలంటే మరో రూ.15 కోట్ల ఖర్చు.. పాస్‌ బుక్‌పై బొమ్మకోసం 15 కోట్లు

వైసీపీ చేష్టలకు అధికారులూ దాసోహం.. నాడు అడ్డుచెప్పకుండా నిధుల ఖర్చు

నిగ్గుతేల్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్ష

భూ ఆక్రమణలే పెద్ద సమస్య.. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చర్యలుండాలి.. సీఎం దిశానిర్దేశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ అధినేత జగన్‌కు ఉన్న ప్రచారపిచ్చి రాష్ట్ర ఖజానాను గుల్లచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ‘‘కోటి రూపాయలో, పది కోట్లో కాదు...700 కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని జగన్‌ తన పేరు, ఫొటోల పిచ్చికోసం తగలేశారు. భూముల సమగ్ర సర్వే పేరిట కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా సర్వేకోసం గ్రానైట్‌ రాళ్లను తీసుకొచ్చి వాటిపై తన తండ్రిపేరు, తనపేరు చెక్కించుకున్నారు. ఈ సరదా తీర్చుకునేందుకు ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు’’ అని నిగ్గు తేల్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూశాఖ కార్యకలాపాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సర్వేరాళ్లు, పాసుపుస్తకాలు తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది. ఎలాగైనా రీ సర్వే కొనసాగించాలని కొందరు అధికారులు.. రెవెన్యూశాఖ పెద్దలను భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేశారు. అందులోభాగంగా రీ సర్వేను కొనసాగిద్దామనే తరహాలో సీఎం వద్ద ప్రతిపాదనలు ఉంచారు. వాటిని చూసిన ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘భూములను రీ సర్వే చేయాలని కేంద్రం నిధులు ఇస్తే జగన్‌ ఏం చేశారు? సరిహద్దులను నిర్దేశించేందుకు సాధారణ రాళ్లను వాడతారు. కానీ జగ న్‌ కేంద్ర మార్గదర్శకాలకు విరుద్దంగా 77 లక్షల ఖరీదైన గ్రానైట్‌ రాళ్లను కొన్నారు. వాటిపై తన పేరును ముద్రించుకున్నారు. పాసుపుస్తకాలపై తనపేరు, ఫొటోలు అచ్చు వేయించుకున్నారు. కేంద్రం చెప్పినదానికి భిన్నంగా రీ సర్వేను తన ప్రచార పిచ్చికోసం వాడుకున్నారు.

ఆయన పిచ్చిపనులకు రూ. 700 కోట్ల ప్రజాధనం వృఽథా అయింది. పాసుపుస్తకాలపై జగన్‌ ఫొటోల ముద్రణ కోసం 15 కోట్లపైనే ఖర్చుపెట్టారు. ఆయన ఫొటోలున్న భూమి పత్రాలను రైతులు చించివేస్తున్నారు. జగన్‌ పేరున్న గ్రానైట్‌ రాళ్లను తమ గ్రామానికి తీసుకురావొద్దని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? రాళ్లపై జగన్‌ పేరు తొలగించాలంటే మరో 15 కోట్లు ఖర్చుపెట్టాలి. ఇంతాచేసి రైతులకు వివాదాలతో కూడిన సర్వే ఫలితాలు ఇచ్చారు’’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జగన్‌ ప్రచారపిచ్చికి అధికారులు సహకరించారని, నిధుల ఖర్చు విషయంలో ఏమాత్రం అడ్డుచెప్పలేకపోయారని ఆయన తీవ్ర ంగా స్పందించినట్లు సమాచారం. కేంద్ర మార్గదర్శకాలను ఆచరించాల్సిన వారే, ఫొటోల పిచ్చికి సహకరిస్తే ఎలా? వృఽథా అయిన ప్రజాధనానికి ఎవరిని బాధ్యులను చేయాలని ప్రశ్నించినట్లు తెలిసింది. ‘‘సరిహద్దులను నిర్దేశించేందుకు ఎవరైనా ఖరీదైన గ్రానైట్‌ రాళ్లు వినియోగిస్తారా? దీన్ని ఎలా అనుమతించారు? ఎలా సమర్ధించారు? ఆ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు....వాటిని ఏం చేయవచ్చో ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి’’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వైసీసీ భూ దందాలపై విచారణ

దళితులు, బీసీలు, పేద వర్గాల నుంచి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు లాక్కున్నారని మదనపల్లె ఉదంతం నిరూపిస్తోందని సీఎం పేర్కొన్నారు. ఈ నేపఽథ్యంలో విశాఖ, విజయవాడ, గుంటూరుతోపాటు ఉమ్మడి జిల్లాల ప్రధాన కేంద్రాల్లో బాధిత ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించి విచారణ చేయాలని ఆదేశించారు. అయితే, కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారన్న సంకేతాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, సీసీఎల్‌ఏ జయలక్ష్మి తదితర అధికారులు జిల్లాల్లో పర్యటించి ప్రజల విన్నపాలు స్వీకరించాలని సీఎం ఆదేశించారు.

భరోసా కల్పించాలి

భూములు కోల్పోయిన ప్రజల నుంచి విజ్ఞాపనలు తీసుకోవడమే కాదు, ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందన్న భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ’’ప్రభుత్వం....ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకొని హడావుడి చేసి, ఆ తర్వాత చేతులెత్తేస్తుందన్న అపనమ్మకం కలిగించొద్దు. ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదును నిశిత పరిశీలన చేసి న్యాయం చేయాలి. అక్రమార్కులకు శిక్ష పడటం ఎంత ముఖ్యమో, బాధితులకు న్యాయం చేయడం అంతే ముఖ్యం. ప్రభుత్వం ఒక టాస్క్‌ తీసుకుందంటే దాన్ని విజయవంతం చేస్తుందన్న భరోసా ఇవ్వాలి. మీ నుంచి నేను కోరుకునేది అదే’’ అని అధికారులకు నిర్దేశించారు. ‘‘జగన్‌ పాలనలో అసైన్డ్‌ విధానంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. భూములను సులభంగా 22(ఏ)లో పెట్టడం, తొలగించడం, సులభంగా సర్వే నంబర్లు మార్చడంతో లెక్కలేనన్ని అక్రమాలు చేశారు. తహసీల్దార్‌ పాస్‌వర్డ్‌ అనేది ఎవరు పడితే వారు వాడారు. అసైన్డ్‌ భూములు నేతలు చేజిక్కించుకున్నారు. ఆ భూములు ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయి? ఆ ప్రాంతంలో భూముల రేట్లు ఎలా ఉన్నాయి? ప్రభుత్వానికి భూములు అమ్మడానికి ముందు అక్కడ ఎంత ధర ఉంది? ఆ తర్వాత ఏ ధరకు ప్రభుత్వానికి అమ్మారు? అన్న వివరాలు సేకరించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి. ’’ అని ఆదేశించారు. కాగా, సొంత బొమ్మలు వేసుకొని అహంకారపూరితంగా వ్యవహరించిన గత పాలకుల తప్పులను సరిదిద్దుతున్నామని ‘ఎక్స్‌’లో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కొత్త పాస్‌ పుస్తకాలు ఇవ్వబోతున్నాం. ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడి వారి ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటాం అని వివరించారు.

తప్పుచేస్తే జగన్‌పైనా చర్యలు: మంత్రులు

భూముల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చట్టప్రకారం మాజీ సీఎం జగన్‌పై నయినా చర్యలు తప్పవని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ స్పష్టం చేశారు. మదనపల్లె ఫైల్స్‌ విషయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నాయని, ఆయన తప్పులు నిర్ధారణ అయితే జైలుకు పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మదనపల్లె ఘటన కుట్రే: సిసోడియా

మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి నిప్పుపెట్టడం ముమ్మాటికి కుట్రేనని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి.సిసోడియా స్పష్టం చేశారు. అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదని, భూ అక్రమాలు బయటకు రాకుండా చేసిన కుట్రలో భాగమేనని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

Updated Date - Jul 30 , 2024 | 03:59 AM