Share News

99 లిక్కర్‌పై క్రేజ్‌

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:34 AM

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘క్వార్టర్‌ రూ.99 మద్యం’ వినియోగదారులతో పాటు మద్యం కంపెనీల్లోనూ క్రేజ్‌ పెంచింది.

99 లిక్కర్‌పై క్రేజ్‌

సరఫరాకు పెద్ద కంపెనీల ఆసక్తి

ఇప్పటికే ఏడు బ్రాండ్లకు అనుమతి

30 వేల కేసుల మద్యం ఉత్పత్తి

ప్రభుత్వ డిపోలకు చేరిన సరుకు

నెలాఖరుకు అందుబాటులోకి 2.4 లక్షల కేసులు

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘క్వార్టర్‌ రూ.99 మద్యం’ వినియోగదారులతో పాటు మద్యం కంపెనీల్లోనూ క్రేజ్‌ పెంచింది. తక్కువ ధరకు వస్తున్న లిక్కర్‌ బ్రాండ్ల అమ్మకాలు పెరుగుతాయని ఊహిస్తున్న కంపెనీలు తమ బ్రాండ్లను కూడా తక్కువ ధరకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆరా తీస్తున్నాయి. మీడియం కేటగిరీ మద్యం ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీలు ఈ విషయంపై ఎక్సైజ్‌ శాఖతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇప్పటికే నాలుగు కంపెనీలు ఏడు రకాల బ్రాండ్లను రూ.99 ఎమ్మార్పీపై సరఫరా చేసేందుకు అనుమతులు పొందాయి. దాదాపు 30 వేల కేసులను ఉత్పత్తి చేశాయి. అక్కడి నుంచి లైసెన్సీలు ఈ మద్యాన్ని తీసుకుంటున్నారు. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల కేసులు అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది. అమ్మకాల ట్రెండ్‌ ఆధారంగా తాము అదే ధరకు మద్యం సరఫరా చేస్తే ఎలా ఉంటుందనే దానిపై లిక్కర్‌ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. కొంతకాలం వేచిచూసి వినియోగదారుల స్పందన చూసి ముందుకురావాలని మరికొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. తక్కువ ధర ఉన్న మద్యంపై వ్యాపారులకు తక్కువ మార్జిన్‌ వస్తుంది. అదే ఎక్కువ ధర ఉన్న మద్యం విక్రయిస్తే ఎక్కువ మార్జిన్‌ వస్తుంది కాబట్టి, తక్కువ ధర మద్యాన్ని ఎక్కువగా తీసుకోకపోవచ్చనే వాదన వినిపిస్తోంది.

Updated Date - Oct 22 , 2024 | 04:34 AM