డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం
ABN , Publish Date - Dec 08 , 2024 | 11:27 PM
ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడమే (ఎలైట్ యాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎనఫోర్స్‌మెంట్) ఈగల్ ముందున్న లక్ష్యమని ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు.
459 మంది సిబ్బందితో ఈగల్ టీమ్
ఎనడీపీఎస్ చట్టాలపై అవగాహన సదస్సులు
తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలి
ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ
కర్నూలు క్రైం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):
ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడమే (ఎలైట్ యాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎనఫోర్స్‌మెంట్) ఈగల్ ముందున్న లక్ష్యమని ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. కప్పట్రాళ్ల పర్యటనలో భాగంగా కర్నూలు వచ్చిన ఆయనతో ఆంధ్రజ్యోతితో ఈగల్ టీం లక్ష్యాలను పంచుకున్నారు. ఏపీలో ముఖ్యంగా విద్యార్థులు మత్తుకు బానిస కాకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఆ దిశగా పాఠశాలల్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తున్నాయని అలాంటి సప్లయ్ చేసేవారితో పాటు తీసుకున్న వారు కూడా నేరస్థులేనని పేర్కొన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు.
ఫ ప్రశ్న: ఈగల్ టీమ్ ఎలా పని చేస్తుంది..?
ఫ ఈగల్ చీఫ్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈగల్ టీమ్ ఏర్పాటైంది. 459 మంది సిబ్బందితో ఈగల్ టీమ్ పని చేస్తుంది. అన్ని జిల్లాలో ఈగల్ టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఇద్దరు ఎస్పీలు, ఇద్దరు అడిషినల్ ఎస్పీలు, ఆరు మంది డీఎస్పీల ఆధ్వర్యంలో రాష్ట్ర హెడ్ క్వార్టర్‌లో ఈ టీమ్ ఉంటుంది. డేటా ఎనాలసిస్, టెక్నికల్ ఎనాలసిస్ అంశాలతో ప్రత్యేకంగా రూపొందించారు. ప్రతి జిల్లాకు ఒక టీం సిబ్బంది ఏర్పాటు చేస్తున్నాం. తీవ్రమైన కేసుల్లో ఈగల్ మెయిన టీమ్ కోఆర్డినేషన చేస్తుంది.
ఫ ప్రశ్న: ఇతర రాష్ట్రాలతో ఎలా సమన్వయం చేసుకుంటున్నారు.
ఫ ఈగల్ చీఫ్: ముఖ్యంగా గంజాయి ఎక్కువగా ఉండే ఒడిస్సా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో సమన్వయం చేసుకున్నాం. ఆయా రాష్ట్రాల్లో ఉన్న సరిహద్దులోని ఎస్పీలు నేరుగా కోఆర్డినేషన చేసుకుంటారు. కోరాపూర్, మల్కనగిరి, గంజామ్, రాయ్‌ఘడ్ జిల్లాల ఎస్పీలతో ఇప్పటికే చర్చించాం. మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, మన్యం జిల్లాల ఎస్పీలు కూడా సరిహద్దు రాష్ట్రాల ఎస్పీలతో ఒక టీమ్‌గా ఏర్పడ్డారు. ఇప్పటికే పంజాబ్ ఏఎనటీఎఫ్‌తో చర్చించాం. అక్కడ వారు అవలంబిస్తున్న విధానాలను స్టడీ చేశాం. ముఖ్యంగా ఎస్‌టీడీడీ (సోర్స్, ట్రాన్సపోర్టేషన, డెస్టినేషన, డిమాండ్)పై దృష్టి సారించాం. ఎక్కడైతే.. గంజాయి, డ్రగ్స్ సప్లయ్ తయారు చేస్తున్నారో అక్కడ తనిఖీలు చేస్తాం. ఆ తర్వాత ఏయే మార్గాల ద్వారా రవాణా జరుగుతుందో గుర్తించే ప్రణాళికలు రూపొందించుకుంటాం. ఆ తర్వాత మత్తు పదార్థాలు సరఫరా అయ్యే చివరి ప్రాంతాలు కూడా గుర్తించేందుకు మా టీములు రంగంలో దిగుతాయి.
ఫ ప్రశ్న: డ్రగ్స్ వాడే వారిపై ఎలాంటి చట్టాలు ఉన్నాయి..?
ఫ ఈగల్ చీఫ్: డ్రగ్స్ సప్లయ్ చేసినా, వాడినా ఇద్దరూ నేరస్థులే. ఎనడీపీఎస్ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడితే గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఇతర కేసుల్లో కేసు నిరూపించాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంటుంది. ఈ డ్రగ్స్ కేసులు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బందులు పడుతారు. కేసుల్లో బెయిల్ కూడా దొరకదు. డ్రగ్స్ తీసుకున్న వారిపై కూడా కేసులు నమోదవుతాయి. అలాగే అమ్మినవారు, కొన్నవారి పేర్లను సెంట్రల్ గవర్నమెంటు రూపొందించిన నిఽధాన పోర్టల్‌లో నమోదవుతాయి. భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఫ ప్రశ్న: ఎలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు..?
ఫ ఈగల్ చీఫ్: డ్రగ్స్ విద్యాసంస్థల్లోకి వెళ్లకూడదన్నది ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. అన్ని విద్యాసంస్థల్లో యాంటి డ్రగ్స్ కమిటీని నియమిస్తున్నాం. పది మంది విద్యార్థులు ఒక అధ్యాపకుడు ఇందులో ఉంటారు. అలాగే 43 వేల పాఠశాలల్లో 1.30 కోటి మంది విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టింది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న డీ-అడిక్షన సెంటర్లతో కోఆర్డినేషన చేసుకుంటున్నాం. వారితో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాం.
ఫ ప్రశ్న: తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు..
ఫ ఈగల్ చీఫ్: తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. వారానికి ఒకసారైన వారి పుస్తకాలు, బ్యాగులు తనిఖీలు చేయాలి. ఏదైనా అనుమానం వస్తే ప్రశ్నించాలి. మీ ఇంట్లోకి డ్రగ్స్ రాకూడదనే కృతనిశ్చయంతో ఉండాలి. పిల్లలు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు.. ఒంటరిగా ఉంటున్నారనే విషయాలను కూడా గమనించాలి.
ఫ ప్రశ్న: టోల్‌ఫ్రీ నెంబర్ చెప్పండి
ఫ ఈగల్ చీఫ్: ఈగల్ టోల్‌ఫ్రీ నెంబర్ 1972ను ఏర్పాటు చేశాం. ఎవరైనా బాధితులు తమ బాధను ఈ నెంబర్‌కు ఫోన చేసి సమాచారం ఇవ్వవచ్చు. అలాగే డ్రగ్స్ సరఫరా వంటి వివరాలు వెల్లడించవచ్చు. ఇటీవల ఓ తల్లి 1972కు ఫోన చేసి వారి కూతురు డ్రగ్స్‌కు అలవాటు పడిందని సమాచారం ఇవ్వడంతో ఆ అమ్మాయిని డీ-అడిక్షన సెంటర్‌కు తరలించేందుకు చర్యలు తీసుకున్నాం.