Share News

చిన్నారిని దిగమింగిన పైప్‌ లైన గుంత

ABN , Publish Date - Sep 11 , 2024 | 11:59 PM

సూర్యోదయాన తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లారు. పిల్లలను ఇంటి వద్దనే జేజినాయన వెంకటేశ్వర్లు సమక్షంలో వదిలారు.

   చిన్నారిని దిగమింగిన పైప్‌ లైన గుంత
కుమారుడు గౌతమ్‌ను ఎత్తుకున్ని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

అధికారులు తవ్వి వదిలేశారు

కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు, బంధువులు

రుద్రవరం, సెప్టెంబరు 11 : సూర్యోదయాన తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లారు. పిల్లలను ఇంటి వద్దనే జేజినాయన వెంకటేశ్వర్లు సమక్షంలో వదిలారు. పైపులైను కోసం తీసిన గుంతలో ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి పడిపోయాడు. ఈ విషాదం బుధవారం మధ్యాహ్నం ఆ ఐదేళ్ల చిన్నారి గౌతంకు మృత్యువుగా కబళించింది. ఈ సంఘటన రుద్రవరం మండలం చందలూరు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుబ్బయ్య, మహేశ్వరి దంపతులకు ఐదేళ్ల చిన్నారి గౌతం, మరో కుమార్తె ఉన్నారు. వీరు వ్యవసాయ కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. బుధవారం ఉదయం పొలం పనులకు వెళుతూ పిల్లలను జేజినాయన వెంకటేశ్వర్లు వద్ద వదిలి వెళ్లారు. ఈ మధ్య అధికారులు పైప్‌లైన కోసం తవ్విన గుంతలో బాలుడు గౌతం పడిపోయాడు. గౌతం ఎంత సేపటికి కనిపించకపోయేసరికి జేజినాన వెంకటేశ్వర్లు పైప్‌లైన గుంతలో వెతికాడు. ఇతరుల సాయంతో బాలుడ్ని అందులోంచి బైటికి తీశాడు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు సుబ్బయ్య, మహేశ్వరి హుటాహుటిన ఇంటికి వచ్చి చనిపోయిన కుమారుడ్ని చూసి విలపించారు. పొద్దున పొలం పనులకు వెళుతున్నప్పుడు కొడుకు టాటా చెప్పాడని, అంతలోనే విగత జీవి అయ్యాడని రోదించారు.

అధికారుల నిర్లక్ష్యం

సర్పంచ పుల్లమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ముందు అధికారులు పైపులైను కోసం గుంత తవ్వి వదిలివేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుంత నిండా నీరు చేరింది. పైపులైను ఏర్పాటు చేసి పూడ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు వాపోయారు. కాగా తాను విధుల్లో చేరకముందే ఈ గుంత తవ్వారని, ఉన్నతాధికారుల దృష్టికి తీసికెళ్లి పూడ్పిస్తామని చందలూరు పంచాయతీ కార్యదర్శి మౌనిక అన్నారు. ఇక్కడ గుంత తవ్వడానికి అనుమతి లేదని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ ప్రమోద్‌ అన్నారు. గ్రామ రెవెన్యూ అధికారి ఫకృద్దీన మృతదేహాన్ని పరిశీలించారు.

Updated Date - Sep 11 , 2024 | 11:59 PM