Share News

సొంతూరిలో జగన్‌కు షాక్‌

ABN , Publish Date - Jun 23 , 2024 | 05:26 AM

మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో తొలిసారి సొంత గడ్డకు వచ్చిన జగన్‌కు సొంత పార్టీ శ్రేణులు ఝలక్‌ ఇచ్చారు. బిల్లుల కోసం జగన్‌ను నిలదీసినంత పనిచేశారు. ‘బిల్లులు కాకపోతే మా ఆస్తులు అమ్మినా కూడా చేసిన అప్పులు తీరవు. మేము ఎలా బతకాలి? ఎన్నికలకు ముందు నుంచి

సొంతూరిలో జగన్‌కు షాక్‌

బిల్లులు అందలేదని క్యాడర్‌ గగ్గోలు

నాయకులు, కార్యకర్తల అసంతృప్తి

తోపులాటలో కిటికీ అద్దాలు ధ్వంసం

మాజీ సీఎంగా తొలిసారి కడప జిల్లాకు

కనిపించని వైసీపీ శ్రేణుల హడావుడి

కడప, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో తొలిసారి సొంత గడ్డకు వచ్చిన జగన్‌కు సొంత పార్టీ శ్రేణులు ఝలక్‌ ఇచ్చారు. బిల్లుల కోసం జగన్‌ను నిలదీసినంత పనిచేశారు. ‘బిల్లులు కాకపోతే మా ఆస్తులు అమ్మినా కూడా చేసిన అప్పులు తీరవు. మేము ఎలా బతకాలి? ఎన్నికలకు ముందు నుంచి కూడా బిల్లుల కోసం అధికారులపై ఎంత ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదు’.. అంటూ వాపోయారు. అందరూ సహనంతో ఉండాలని, మళ్లీ మంచి రోజులు వస్తాయని జగన్‌ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో జగన్‌ ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. మూడు రోజుల పర్యటనకు శనివారం ఆయన సొంత జిల్లాకు వచ్చారు. పులివెందులకు వెళ్లేసరికి అక్కడ జనం పెద్దగా లేరు. తర్వాత వైసీపీ నాయకులు భారీ స్థాయిలో జనసమీకరణ చేసినట్లు తెలుస్తోంది. జగన్‌ ప్రభుత్వంలో కాంట్రాక్టు పనులు చేసి, బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నవారంతా అక్కడకు వచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసేందుకు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీంతో పోలీసు సిబ్బంది వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. జగన్‌ కార్యాలయంలోకి వెళ్లిపోవడంతో ఆయనను కలిసేందుకు అందరూ అక్కడికి చేరుకున్నారు. వారు లోపలకు వెళ్లకుండా సిబ్బంది తలుపులు వేశారు. అందరూ ఒక్కసారిగా కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. కొందరు కిటీ అద్దాలను గట్టిగా కొట్టడంతో అద్దాలు పగిలినట్లు తెలిసింది. తేరుకున్న సిబ్బంది అందరినీ నిలువరింపజేశారు. జగన్‌ను కలిసేందుకు ఒకస్థాయి నాయకులను మాత్రమే పంపిస్తున్నారని కిందిస్థాయి నాయకులు మండిపడ్డారు. వెళ్లిన ప్రతి నాయకుడు బిల్లులు కాలేదని, ఇపుడు మా పరిస్థితి ఏమిటని సమస్యలు ఏకరువు పెట్టారు. మీడియాను ఆఫీసు బయటే ఆపేశారు.

దూరంగా క్యాడర్‌

కడప ఎయిర్‌పోర్టులో ఎంపీ అవినాశ్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప మేయర్‌ సురే్‌షబాబు, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషలు మాత్రమే స్వాగతం పలికారు. జగన్‌ వస్తున్నారని చెప్పి ఎయిర్‌పోర్టుకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే అంజాద్‌బాష, మేయర్‌ సురే్‌షబాబు క్యాడర్‌కు విజ్ఞప్తి చేసినా పెద్దగా హాజరు కాలేదు. వచ్చిన క్యాడర్‌తోనే సీఎం జగన్‌ అంటూ నినాదాలు చేయించుకుని మురిసిపోయారు. ఎయిర్‌పోర్టు నుంచి పులివెందులకు వెళ్లే రహదారిలో జగన్‌ కాన్వాయ్‌లోని ఇన్నోవా రామరాజుపల్లె వద్ద అగ్నిమాపక శాఖ వాహనాన్ని ఢీకొట్టింది. ఎవరికీ గాయాలు కాలేదు.

Updated Date - Jun 23 , 2024 | 08:07 AM