Share News

అమరావతి అభివృద్ధికి ముందడుగు!

ABN , Publish Date - Nov 11 , 2024 | 05:14 AM

నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి అభివృద్ధికి ముందడుగు పడింది.

అమరావతి అభివృద్ధికి ముందడుగు!

మౌలిక సదుపాయాల కల్పన సాకారం

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆమోదం

నిధులపై ఢిల్లీలో నేడు త్రైపాక్షిక చర్చ

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి అభివృద్ధికి ముందడుగు పడింది. రాజధాని నిర్మాణంలో కీలకమైన అమరావతి నగర సుస్థిరాభివృద్ధి, నిర్మాణాల కోసం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి తీసుకుంటున్న రూ.15,000 కోట్ల రుణ వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా రుణ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నిధుల ప్రతిపాదనపై సోమవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ సమక్షంలో రాష్ట్రానికి, బ్యాంకుల ప్రతినిధులకు మధ్య త్రైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు రాష్ట్రం నుంచి సీఆర్‌డీఏ కమిషనర్‌ కె. భాస్కర్‌, ఏడీసీఎల్‌ సీఎండీ లక్ష్మీ పార్థసారఽథి, ఆర్థిక శాఖ నుంచి డి. సురేంద్ర హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఈ రూ.15,000 కోట్ల రుణానికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు ఖరారుకానున్నాయి. రుణంపై మారటోరియం సమయం, కాలపరిమితి వంటి విషయాల్లో స్పష్టత రానుంది. ఈ నిధులలో 800 బిలియన్‌ డాలర్లను ప్రపంచబ్యాంకు, 800 బిలియన్‌ డాలర్లను ఏడీబీ సమకూర్చనున్నాయి. చర్చల అనంతరం విడతల వారీగా నిధులు రాష్ట్రానికి అందనున్నాయి. ఈ నిధుల నిర్వహణ కోసం ప్రత్యేక బడ్జెట్‌ హెడ్‌ ఏర్పాటు చేస్తారు. ఏపీసీఆర్‌డీఏ సమర్పించే బిల్లులకు ఈ హెడ్‌ ద్వారాను సీఎ్‌ఫఎంఎస్‌ నుంచి నిధులు చెల్లిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి నిధులు సమకూర్చుకునేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం అధికారం కల్పించింది.

ఏయే పనులు చేపడతారంటే..

ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి అందే నిధుల సాయంతో అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండే ప్రాజెక్టులను చేపడతారు. అదేవిధంగా ట్రంకు రోడ్ల నిర్మాణం, వరద నీటి నిర్వహణ పనులు చేపట్టనున్నారు. రిజర్వాయర్ల పునరుద్ధరణ, వరదను తట్టుకునే వ్యవస్థలు, రోడ్లు, పార్కుల నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను చేపడతారు. అలాగే, ప్రజలకు ఉపయోగపడే భవనాల నిర్మాణం, నిరంతరాయంగా సురక్షిత నీటి సరఫరా పనులను చేపట్టనున్నారు.

Updated Date - Nov 11 , 2024 | 05:14 AM