బాధ్యులపై చర్యలు తప్పవ్
ABN , Publish Date - Sep 21 , 2024 | 04:41 AM
తిరుమల లడ్డూ ప్రసాదంలో కొవ్వు, కల్తీ నెయ్యి కలిసిన ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలవడం ఏమిటి?
గత టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిమాండ్
దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అవసరమని వ్యాఖ్య
వచ్చే కేబినెట్‌లో ఈ అంశంపై చర్చిస్తానని వెల్లడి
అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదంలో కొవ్వు, కల్తీ నెయ్యి కలిసిన ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. లడ్డూ కల్తీ అయిందని తెలిసి దిగ్ర్భాంతికి గురైనట్లు ఆయన తెలిపారు. తిరుపతి లడ్డూపై పవన్ ఎక్స్‌లో పోస్టు చేయడంతో పాటు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. స్వామి వారి లడ్డూను భక్తులంతా మహాప్రసాదంగా భావిస్తారని, అలాంటి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు పరీక్షల్లో తేలడం దారుణమన్నారు. దీనిపై నాటి వైసీపీ ప్రభుత్వం కొనసాగిన టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందన్న పవన్, తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని నిలదీశారు. లడ్డూ ప్రసాదంపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని, ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని చాలా మంది ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రతిరోజూ 15000 కేజీల నెయ్యి ప్రసాదం తయారీకి ఉపయోగిస్తారని చెప్పారు. టీటీడీలో నిధుల దుర్వినియోగం, శ్రీవాణి నిధులు దుర్వినియోగంపై దృష్టిపెట్టామన్నారు. ప్రజలు ఇలాంటి వాటిని సహించరని తెలిపారు. దేశంలో దేవాలయాలకు పరిరక్షణకు, ఆలయాల సమస్యలను పర్యవేక్షించేందుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి రావాలని పిలుపునిచ్చారు. తాను వ్యక్తిగతంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుపై దృష్టిపెడతానన్నారు. రాష్ట్రంలో జరగబోయే తర్వాత కేబినేట్‌లో ఈ అంశంపై చర్చిస్తానన్నారు. సనాతన ధర్మ పరిక్షణ బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. దేశం వ్యాప్తంగా దేవాలయాల అపవిత్రత, ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ కట్టడి చేయాలంటే సనాతన ధర్మ పరిక్షణ బోర్డు రావాలని పవన్ ఆకాంక్షించారు.