జమ్మలమడుగులో కప్పం కడితేనే ‘అదానీ’కైనా అనుమతి
ABN , Publish Date - Nov 21 , 2024 | 04:33 AM
‘అదానీ కంపెనీ అయినా మాదే రూల్’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు చేసిన రగడ చర్చనీయాంశమైంది.
ఇక్కడ ఏం చేయాలన్నా మేమే.. బీజేపీ ఎమ్మెల్యే మనుషుల హల్‌చల్
కడప జిల్లాకు అదానీ ప్రాజెక్టు.. సబ్ కాంట్రాక్ట్ సీఎం రమేశ్ సంస్థకు
భగ్గుమన్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బ్యాచ్
(కడప-ఆంధ్రజ్యోతి)
‘అదానీ కంపెనీ అయినా మాదే రూల్’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు చేసిన రగడ చర్చనీయాంశమైంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురంలోని రాగికొండ సమీపంలోని దొంతికోనలో పంప్డ్ స్టోరేజీ విద్యుత్‌ప్లాంటు(హైడ్రోపవర్ ప్రాజెక్టు) నిర్మాణం పనులు చేపట్టిన అదానీ సంస్థ సిబ్బంది పై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు దాడికి పాల్పడ్డారు. అద్దాలు, వాహనాలను ధ్వంసం చేశారు. దొంతికోన వద్ద సర్వే నంబర్ 309/2, 310, 307, 308లలోని 470 ఎకరాల్లో 1800 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్‌స్టోరేజీ విద్యుత్ ప్లాంటును అదానీ కంపెనీ ఏర్పాటు చేయనుంది. దీనికి రూ.5 వేల కోట్లు వెచ్చించనుంది. ఈ విద్యుత్‌ప్లాంటు ఏర్పాటులో సబ్ కాంట్రాక్టు పనులను బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ చేపట్టింది. అయితే ఈ పనులు తమకే ఇవ్వాలని ఆదినారాయణరెడ్డి కుటుంబసభ్యులు పట్టుబట్టారు. దీంతో చాలా రోజులుగా నిర్మాణ పనులు మొదలుపెట్టలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం రిత్విక్ కన్‌స్ట్రక్షన్ సంస్థ పనులు మొదలుపెట్టింది. దీంతో ఎమ్మెల్యే సోదరుడు శివనారాయణరెడ్డి, బీజేపీ యువమోర్చా నేత రాజేశ్‌రెడ్డి సహా సుమారు 200 మంది ప్రాజెక్టు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ మొదలైన పనులను అడ్డుకుని దాడులకు తెగబడ్డారు. కాగా, వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే సుఽధీర్‌రెడ్డి కూడా యజమానులను బెదిరించారనే ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అదే పరిస్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు. జమ్మలమడుగును ఎమ్మెల్యే ఆది కుటుంబీకులు మండలాల వారీగా పంచుకున్నారని విమర్శలున్నాయి.
చంద్రబాబు హెచ్చరించినా..
జమ్మలమడుగులో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే డబ్బు డిమాండ్ చేస్తున్నారనేది సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్ భూపేశ్‌రెడ్డిని ఆయన పిలిచి పరిశ్రమల ఏర్పాటు కోసం తాను కష్టపడుతుంటే మీరు ఇలా చేస్తారా అంటూ తీవ్రంగా మందలించారని తెలిసింది. అయినా కూడా లెక్క చేయకుండా దాడులు చేయడం కలకలం రేపుతోంది. అయితే, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆందోళన చేశామని ఎమ్మె ల్యే ఆది వర్గీయులు చెబుతున్నారు. అయితే సబ్ కాంట్రాక్టు పనులు తాము చేపట్టడం జీర్ణించుకోలేకే దాడులకు తెగబడ్డారని ఎంపీ వర్గీయులు చెబుతున్నారు. కాగా, ఈ వ్యవహారంలో ఆదినారాయణరెడ్డి వర్గీయులు 200 మందిపై కేసునమోదు చేశామని కొండాపురం పోలీసులు తెలిపారు.