మళ్లీ చంద్రన్న కానుకలు
ABN , Publish Date - Aug 14 , 2024 | 04:18 AM
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది.
పేదలకు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ తోఫాలకు సన్నాహాలు
కొత్త రేషన్ కార్డుల జారీకి రైట్‌రైట్
పాత కార్డుల స్థానంలో కొత్తవీ పంపిణీ
సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు రేషన్ కార్డుదారులందరికీ మళ్లీ చంద్రన్న కానుకలను అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నిరుపేదలు పండుగ పూటా పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న కానుకలను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసిన సంగతి తెలిసిందే. కందిపప్పు, పంచదార, గోధుమలు ఇలా అన్నిటినీ తీసేశారు. బియ్యం పంపిణీకి మాత్రమే ప్రజా పంపిణీ వ్యవస్థను పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో పేదలను ఆదుకోవాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది.
ప్రభుత్వంపై ఏటా 538 కోట్ల భారం
బియ్యంతోపాటు సబ్సిడీపై పలు సరుకులు
ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్‌కార్డులు
వీటిలో 90 లక్షలకే కేంద్రం గుర్తింపు
ఆహార భద్రత చట్టం రాయితీ వాటికే
58 లక్షల కార్డుల భారం రాష్ట్రంపైనే
గంటల్లో కార్డులిస్తామని జగన్ బీరాలు
కేంద్రం నిర్ణయంతో 6 నెలలకు మార్పు
అదీ సక్రమంగా జరగలేదు
3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్
వీటన్నిటిపై విధాన నిర్ణయం అవసరం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది. ప్రతి నెలా బియ్యంతోపాటు సబ్సిడీ ధరలపై పంచదార, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని, ప్రజా పంపిణీ అవసరాలకు గాను ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోగా మద్దతు ధర ప్రకారం సొమ్ములు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పౌరసరఫరాల శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో రేషన్‌కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, చంద్రన్న రంజాన్ తోఫా పథకాలను పునరుద్ధరించేందుకు ఆ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఈ మూడు పండగలకు రేషన్‌కార్డుదారులందరికీ ఉచితంగా చంద్రన్న కానుకలు అందించడానికి ఏడాదికి రూ.538 కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.2,690 కోట్ల అదనపు భారం పడుతుందని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం (2014-19) ఉన్నప్పుడు ఏటా సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు చంద్రన్న కానుకలను అందించింది. చంద్రన్న సంక్రాంతి కానుక కింద అరకిలో కందిపప్పు, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, అరలీటరు పామాయిల్, కిలో గోధుమ పిండి, 100 మిల్లీ గ్రాముల నెయ్యితో కూడిన కిట్లను కార్డుదారులకు అందించారు. క్రిస్మస్ కానుక కింద కూడా అవే ఇచ్చారు. ఇక రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు 2 కిలోల చక్కెర, 5 కిలోల గోధుమపిండి, కిలో వర్మిసెల్లి, 100 మిల్లీగ్రాముల నెయ్యితో కూడిన తోఫా కిట్లను ఉచితంగా అందించారు. ఆ తర్వాత 2019 జూన్‌లో జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని నిర్దాక్షిణ్యంగా నిలిపివేసింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో రేషన్‌కార్డు దారులందరికీ మళ్లీ చంద్రన్న కానుకలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,48,43,671 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 12 లక్షలకుపైగా ముస్లిం కార్డుదారులున్నారు. ఇవి కాకుండా ప్రతినెలా రెగ్యులర్ కోటా కింద రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యంతో చక్కెర, కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాలను కూడా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
సరికొత్త రేషన్‌కార్డులు
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రేషన్‌కార్డుల రంగులు మారనున్నాయి. గత ప్రభుత్వ ప్రచార పిచ్చి పతాకస్థాయికి చేరి.. పేదలకిచ్చిన రేషన్‌కార్డులపై కూడా వైసీపీ రంగులు వేయడమే కాకుండా అప్పటి సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోలను ముద్రించింది. ఇప్పుడు పాత రేషన్‌కార్డుల స్థానంలో కొత్త కార్డులివ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లు పరిశీలనలో ఉన్నాయి.
కొత్తకార్డులపై విధానపరమైన నిర్ణయం
రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్‌కార్డులు ఉన్నా.. వీటిలో 90 లక్షల రేషన్‌కార్డులు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు కేంద్రం గుర్తించింది.. వాటికి మాత్రమే ఆహార భద్రత చట్టం కింద రాయితీ ఇస్తోంది. మిగిలిన 58 లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీల ఖర్చును రాష్ట్రప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులను ఆహార భద్రత చట్టం పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా మొరపెట్టుకుంటున్నా కేంద్రం అంగీకరించడం లేదు. పేదరికంతో సంబంధం లేకుండా నచ్చిన వారందరికీ కార్డులు ఇచ్చుకుంటూ పోవడం వల్ల రాష్ట్రంలో 90 శాతానికి పైగా ప్రజలు బీపీఎల్ జాబితాలోకి వచ్చేశారని, అంతమందికి రాయితీ ఇవ్వలేమని తేల్చేసింది. దీంతో రోజులు, గంటల వ్యవధిలో కొత్త కార్డులు మంజూరు చేస్తామని బీరాలు పలికిన జగన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రతి ఆర్నెల్లకోసారి అర్హులకు కొత్త కార్డులు మంజూరు చేస్తామంటూ మాట మార్చింది. పోనీ వాటినైనా సక్రమంగా మంజూరు చేసిందా అంటే అదీ లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్‌కార్డులు ఉండగా.. గడచిన ఐదేళ్లలో 1.48 కోట్లకు పెరిగాయి. అంటే గత ఐదేళ్లలో కొత్తగా ఇచ్చిన కార్డులు కేవలం 1.10 లక్షలే. కొత్త కార్డుల కోసం వచ్చిన దాదాపు 78 వేల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టేసింది. ఇంకా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం మొత్తం 3.36 లక్షల దరఖాస్తులు దాదాపు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్ దరఖాస్తులతోపాటు కొత్తగా పెళ్లయిన దంపతులకు, అన్ని అర్హతలూ ఉన్న కుటుంబాలకు కొత్త కార్డులను మంజూరు చేసే అంశంపై కొత్త ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవలసి ఉంది.
6 నెలలుగా రేషన్ తీసుకోనివారి కార్డులు కట్!
కాలానుగుణ సమీక్షల ద్వారా వచ్చిన సార్టింగ్ డేటా ప్రకారం జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 90 లక్షల కార్డుల్లో 1,36,420 కుటుంబాలు ఆరు నెలలకు పైగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదు. ఆ కార్డులన్నింటినీ తొలగిస్తే.. వాటి స్థానంలో రాష్ట్ర కార్డులను భర్తీ చేయవచ్చు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.90 కోట్ల వరకు ఆదా అవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మరికొన్ని ప్రతిపాదనలు కూడా చర్చకు వస్తున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వార్షికాదాయాన్ని ప్రాతిపదికగా చేసుకుని రెండు రకాల రేషన్ కార్డులు ఇచ్చింది. బీపీఎల్ పరిఽధిలోకి వచ్చే పేదలకు తెల్ల కార్డు, ఏపీఎల్ కిందకు వచ్చే మధ్యతరగతి వారికి గులాబీ కార్డు ఇచ్చింది. తెల్ల కార్డుదారులకు ఇచ్చే రేషన్ సరుకులపై సబ్సిడీని ప్రభుత్వం భరించగా.. గులాబీ కార్డు ఉన్నవారికి ఫైన్ క్వాలిటీ బియ్యం, కందిపప్పు, చెక్కర, గోధుమలు వంటి సరుకులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందించింది. తర్వాత గులాబీ కార్డులను తొలగించి అందరికీ ఒకే రేషన్‌కార్డు విధానాన్ని అమలులోకి తెచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, వంటి పథకాలకు ఈ రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకోవడంతో.. కోటీశ్వరులైన ధనవంతులు కూడా ఏదో విధంగా రేషన్ కార్డులను సంపాదిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతోంది. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడాన్ని నిలుపుదల చేస్తే వాటికి ఉన్న డిమాండ్ గణనీయంగా తగ్గిపోతుందని పౌరసరఫరాల శాఖ వర్గాలే చెబుతున్నాయి. లేదంటే గతంలో మాదిరిగా కార్డుల విభజన చేసి.. మళ్లీ తెల్ల కార్డులు, గులాబీ కార్డులను అమల్లోకి తెచ్చినా దాదాపు సగం భారం తగ్గుతుందని అంటున్నాయి.