వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం
ABN , Publish Date - Aug 27 , 2024 | 04:21 AM
గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలు, సంస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. వాటన్నింటినీ గాడిలో పెట్టేందుకు కొంత సమయం పడుతుంది’
మున్సిపల్, పట్టణాభివృద్ధి సంస్థల ఖజానాలను ఖాళీ చేసిన జగన్
దారికి తెచ్చేందుకు సమయం పడుతుంది
టీడీఆర్ బాండ్లపై విచారణ జరుగుతోంది
ఇకపై అన్ని అనుమతులూ ఆన్‌లైన్‌లోనే..
13న మరో 75 క్యాంటీన్లు: మంత్రి నారాయణ
తిరుపతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ‘గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలు, సంస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. వాటన్నింటినీ గాడిలో పెట్టేందుకు కొంత సమయం పడుతుంది’ అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. సోమవారం తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)లో మున్సిపల్ కార్పొరేషన్, తుడా అధికారులతో సమీక్షా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వానికి ప్రణాళికంటూ ఏమీలేదు. ఎట్టపడితే అట్ల నిధులు దుర్వినియోగం చేయడమే. అంతా జిగ్‌జాగ్ పాలన. రాష్ట్రంలోని మున్సిపల్, పట్టణాభివృద్ధి సంస్థల ఖజానాలన్నీ ఖాళీ చేసిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రతి ఆరు నెలలకోసారి ఇస్తుంది. దానికి రాష్ట్ర నిధులు మ్యాచింగ్ అవసరంలేదు. 2023-24 తొలి ఆరు నెలలు (మార్చి నుంచి సెప్టెంబరు వరకు) రూ.454 కోట్లు మున్సిపాల్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దానిని వైసీపీ ప్రభుత్వం ఇతరవాటికి మళ్లించేసింది. అవి సక్రమంగా ఇచ్చివుంటే కేంద్రం మళ్లీ ఇచ్చివుండేది. రాష్ట్రవ్యాప్తంగా టీడీఆర్ బాండ్లను నెలాఖరు వరకు ఆపమన్నాం. కమిటీ వేసి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. టీడీఆర్ బాండ్లలో కూడా కుంభకోణం చేయవచ్చని ఎవరికీ తెలియదు.
రూ.వేల కోట్లు టీడీఆర్ బాండ్ల జారీ వలన ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగింది. త్వరలో ఆన్‌లైన్ విధానం తీసుకురాబోతున్నాం. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే నిమిషాల్లో అనుమతులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించనున్నాం. నెలలో పూర్తిగా అందుబాటులోకి రానుంది. మున్సిపల్ సాఫ్ట్‌వేర్ ద్వారానే అనుమతులు వస్తాయి. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పవద్దన్న చంద్రబాబు సూచనల మేరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి నారాయణ వెల్లడించారు. ఆయనతో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారాయణ అక్కడా మీడియాతో మాట్లాడారు. వచ్చేనెల 13న మరో 75 క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు. అక్టోబరు నెలలో మిగిలిన అన్న క్యాంటీన్లు కూడా మొదలవుతాయని మంత్రి వివరించారు.