Vidadala Rajini: రజినీ మరిది.. మామూలోడు కాదు!
ABN , Publish Date - Dec 22 , 2024 | 03:21 AM
మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని వైసీపీ నాయకురాలు, అప్పటి మంత్రి విడదల రజిని, ఆమె కుటుంబ సభ్యులు దౌర్జన్యకాండ సాగించారు.
క్రషర్ యజమానిని బెదిరించడంలో మాజీ మంత్రి మరిది గోపీది కీలక పాత్ర
వదిన చెప్పింది.. ఆయన అమలు చేశాడు
రూ.2.20 కోట్ల వ్యవహారంలో కొత్త కోణం
విజిలెన్స్ దర్యాప్తులో వెలుగుచూసిన వైనం
గుంటూరు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని వైసీపీ నాయకురాలు, అప్పటి మంత్రి విడదల రజిని, ఆమె కుటుంబ సభ్యులు దౌర్జన్యకాండ సాగించారు. పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు కాజేసిన వ్యవహారంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి రజిని, అప్పటి విజిలెన్స్ ఏఎ్‌సపీ జాషువా, రజిని పీఏల పాత్రను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. తాజాగా.. మరో ముఖ్య పేరును తెరపైకి తెచ్చారు. క్రషర్ కంపెనీ యజమాని నంబూరి శ్రీనివాసరావు తదితరులను బెదిరించిన వ్యవహారంలో రజినీ మరిది విడదల గోపి కూడా ప్రముఖ పాత్ర పోషించినట్లు విచారణ నివేదికలో వెల్లడించారు. ఈ వ్యవహారంలో క్రషర్ యజమానిని తొలుత రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. దీంతో ఆయన అప్పటి వైసీపీ ముఖ్యనేతల వద్దకు వెళ్లి అంత ఇవ్వలేనని వేడుకున్నారు. అయినా ఎవరూ కనికరించలేదు. ఈ సంగతి తెలుసుకున్న రజినీ బృందం మరింత వేధించింది. రూ.5 కోట్ల కోసం మొదట రజినీ పీఏనే బెదిరించినట్లు తెలిసింది. ఆతర్వాత ఆమె మరిది గోపి రంగంలోకి దిగారు. అయినా బాధితులు వినకపోవడంతో విజిలెన్స్ ఏఎ్‌సపీ జాషువాతో నకిలీ దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేశారు. జాషువా రంగంలోకి దిగిన తర్వాతే బాధితులు ఎంతో కొంత ఇచ్చి రాజీ చేసుకోవాలన్న ఆలోచనలోకి వచ్చారు. ఈ వ్యవహారంలో అప్పట్లో విజిలెన్స్‌లో పనిచేసిన డీఎ్‌సపీ, సీఐ కూడా కీలకమైన పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. రజినీ మరిదిపై కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కోరినట్లు తెలిసింది.
రేపో మాపో రజినీపై ఏసీబీ కేసు
వైసీపీ హయాంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజినీపై రేపో మాపో ఏసీబీ కేసు నమోదు చేయనుంది. శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నంబూరి శ్రీనివాసరావు తదితరులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు రజినీ రూ.2 కోట్లు, ఏఎ్‌సపీ జాషువా రూ.10 లక్షలు, రజినీ పీఏ రూ.10 లక్షలు తీసుకున్నారన్న ఆధారాలను కూడా సేకరించారు. మంత్రి పదవిలో ఉండి రజినీ ముడుపులు స్వీకరించడం అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుంది కాబట్టి విజిలెన్స్ అధికారులు ఏసీబీ కేసుకు సిఫారసు చేశారు. ప్రభుత్వం ఆమెపై ఏసీబీ కేసు నమోదు చేేసందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసు బాధ్యతను సీనియర్ అధికారికి అప్పగించాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది.
అప్రూవర్లుగా అధికారులు!
క్రషర్ యజమానులను బెదిరించి డబ్బులు దండుకున్న కేసులో పలువురు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఒకరిద్దరు అప్రూవర్లుగా మారారన్న ప్రచా రం జరుగుతోంది. ‘‘రజినీ చెబితేనే అలా చేశాం’’ అని వీరు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో మాజీ మంత్రికి మరింత ఉచ్చు బిగుస్తుందని ఓ అధికారి చెప్పారు.