Share News

జాతీయ డ్రోన్‌ కేపిటల్‌గా అమరావతి!

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:29 AM

మానవ రహిత కృత్రిమ సాంకేతిక లోహ విహంగాల (డ్రోన్‌) జాతీయ రాజధానిగా అమరావతిని నిలపాలన్న లక్ష్యంతో రాష్ట్ర డ్రోన్‌ కార్పొరేషన్‌ కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

జాతీయ డ్రోన్‌ కేపిటల్‌గా అమరావతి!

1000 కోట్ల పెట్టుబడులు.. 6,000 కోట్ల రాబడి

12,500 మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యం

నేడు, రేపు అమరావతి డ్రోన్‌-2024 సదస్సు

వివిధ రంగాల్లో వినియోగంపై ఆవిష్కరణలు

జాతీయ, అంతర్జాతీయ నిపుణుల రాక

నేడు కృష్ణా తీరంలో 5,500 డ్రోన్‌లతో షో

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మానవ రహిత కృత్రిమ సాంకేతిక లోహ విహంగాల (డ్రోన్‌) జాతీయ రాజధానిగా అమరావతిని నిలపాలన్న లక్ష్యంతో రాష్ట్ర డ్రోన్‌ కార్పొరేషన్‌ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మంగళ, బుధవారాల్లో గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ‘అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌- 2024’ పేరిట జాతీయ స్థాయిలో మేధోమఽథనం చేపడుతోంది. 2029 నాటికి రూ.1,000 కోట్ల పెట్టుబడులు, రూ.6,000 కోట్ల రాబడి, 12,500 మందికి డ్రోన్‌ యాజమాన్య నిర్వహణలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పాలసీని రూపొందించేందుకు డ్రోన్‌ వినియోగదారుల ఆలోచనలను పంచుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు ముఖ్య అతిథిగా రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో డ్రోన్‌ యాజమాన్య నిర్వహణపై కార్యాచరణ ప్రణాళికలను ఆవిష్కరించనున్నారు. నూతన ఆవిష్కరణలతో డ్రోన్‌ కేపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా అమరావతిని ప్రకటిస్తూ ప్రత్యేక తీర్మానం చేయనున్నారు. ఈ సదస్సులో డ్రోన్‌ల తయారీ, వినియోగంలో అత్యాధునిక సాంకేతిక, విప్లవాత్మకమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో కూడిన సేవలతో పాటు వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, విపత్తుల నిర్వహణ, రవాణా, ఆరోగ్యం, పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో డ్రోన్‌ల వినియోగంపై కొత్త ఆవిష్కరణలపై సమీక్షించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులు 400 మంది ఈ సదస్సులో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్‌ పాలసీ-2024 తీసుకువచ్చేందుకు అవసరమైన సలహాలు, సూచనలు నిపుణుల నుంచి స్వీకరిస్తారు. 40 మందికిపైగా ఎగ్జిబిటర్లు సదస్సులో భాగస్వాములవుతారు. వివిధ రంగాలు, విభాగాల్లో వినియోగించేందుకు అనువైన డ్రోన్‌లను ప్రదర్శిస్తారు.

డ్రోన్‌ల వినియోగం ద్వారా పంటలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. పురుగు మందులు చల్లడం, ఎరువులు వేయడం వంటి సేవలనూ డ్రోన్‌ కార్పొరేషన్‌ అందుబాటులోకి తెస్తుంది. విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలిచేలా ప్రణళికలు సిద్ధం చేసింది.

విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పన

జాతీయ డ్రోన్‌ రాజధానిగా అమరావతిని నిలిపేందుకు ఈ సదస్సులో విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఇన్నోవేషన్‌-ఎకనామిక్‌ గ్రోత్‌, కెపాసిటీ బిల్డింగ్‌, గ్లోబల్‌ కొలాబిరేషన్‌ ఇండస్ట్రియల్‌ పార్ట్‌నర్‌షిప్‌ అనే 3 అంశాలను అమలుచేస్తారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు, సాంకేతిక సంస్థలతో డ్రోన్‌ కార్పొరేషన్‌ భాగస్వామ్యం అవుతుంది. వర్సిటీల్లో ఏఐ డ్రోన్‌ కోర్సులు నిర్వహిస్తారు. ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ జాతీయ స్థాయిలో ఒక మోడల్‌గా నిలిచేలా కార్యాచరణ అమలు చేస్తారు.

01.jpg


పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు

డ్రోన్‌ సదస్సులో 303 కంపెనీలు, 43 కేంద్ర ప్రభుత్వ శాఖలు పాల్గొంటున్నాయి. విదేశీ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ఈ సదస్సు ద్వారా దేశీయ డ్రోన్‌ తయారీ రంగంలోని సంస్థలను ఒకే చోటకు చేరుస్తారు. యువత ఉపాధి అవకాశాలనూ పెంచుతారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులను ప్రవేశ పెట్టారు. వీటిలో ఏఐ డ్రోన్‌ సిలబ్‌సనూ చేరుస్తారు. అమరావతిని డ్రోన్‌ సిటీగా గుర్తింపు తెచ్చేలా అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడులను ఆకర్షిస్తారు. డ్రోన్‌ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు పన్ను రాయితీ సబ్సిడీ, ప్రోత్సాహకాలను ఇస్తారు.

నేడు డ్రోన్‌ల హాక్‌థాన్‌

రెండురోజుల సదస్సులో మంగళవారం సాయంత్రం కృష్ణా నదీ తీరాన పున్నమిఘాట్‌ వద్ద 5,500 డ్రోన్‌లతో జాతీయ స్థాయి హాక్‌థాన్‌ నిర్వహిస్తారు. ప్రథమ స్థానంలో నిలిచిన డ్రోన్‌ నిర్వాహకుడికి బహుమతిగా రూ.24 లక్షలు డ్రోన్‌ కార్పొరేషన్‌ అందిస్తుంది. బుధవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

నెల రోజుల్లో డ్రోన్‌ పాలసీ

నెల రోజుల్లో డ్రోన్‌ పాలసీ తీసుకువస్తామని రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేశ్‌ కుమార్‌ ప్రకటించారు. డ్రోన్‌ సదస్సు నిర్వహణ సందర్భంగా ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ సీఎండీ దినేశ్‌కుమార్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 10:30కు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ సదస్సును ప్రారంభిస్తారని చెప్పారు. సదస్సులో నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌షిప్‌పై ఎంఓయూ కుదుర్చుకుంటామని వెల్లడించారు. తిరుపతి ఐఐటీతో డ్రోన్‌ సిస్టమ్‌ కోసం స్ట్రాటజీ ఫ్రేమ్‌వర్క్‌పై ఒప్పందం చేసుకుంటున్నామన్నారు. డ్రోన్‌ వినియోగానికి సంబంధించి 24 రంగాలు ఉన్నాయని సురేశ్‌కుమార్‌ చెప్పారు.

Updated Date - Oct 22 , 2024 | 04:29 AM