Share News

Amaravati : అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి!

ABN , Publish Date - Jun 19 , 2024 | 03:08 AM

రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ)గా సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌కు నోట్‌ ఫైల్‌ వెళ్లింది.

Amaravati : అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి!

  • గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపిన సీఎస్‌

  • ఆయన ఆమోదించగానే ఉత్తర్వులు జారీ

  • ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ రాజీనామా ఆమోదం

  • ఏఏజీ పొన్నవోలు, పీపీ నాగిరెడ్డివి కూడా

అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ)గా సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌కు నోట్‌ ఫైల్‌ వెళ్లింది. దీంతో ఆయన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు ప్రతిపాదనలు పంపారు. గవర్నర్‌ ఆమోదించిన వెంటనే ఏజీగా దమ్మాలపాటి నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దమ్మాలపాటి 2014 జూన్‌ 30 నుంచి 2016 మే వరకు అదనపు అడ్వకేట్‌ జనరల్‌(ఏఏజీ)గా సేవలు అందించారు. 2014 జూన్‌ నుంచి ఏజీగా వ్యవహరించిన సీనియర్‌ న్యాయవాది పి.వేణుగోపాల్‌ తన పదవికి రాజీనామా చేయడంతో 2016 మే 28న దమ్మాలపాటిని ప్రభుత్వం ఏజీగా నియమించింది. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు ఆయన సేవలు అందించారు. ఈ అనుభవమే ప్రస్తుతం ఆయన రెండోసారి ఏజీగా నియమితులయ్యేందుకు దోహదపడింది. అధికారిక ఉత్తర్వులు వెలువడిన అనంతరం గురువారం ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

వైసీపీ సర్కారుపై పోరాటంలో కీలకపాత్ర

2019లో జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దమ్మాలపాటిపై క్రిమినల్‌ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. వాటన్నిటినీ ఆయన సమర్థంగా ఎదుర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి విపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం 2023 సెప్టెంబరు 9 నుంచి వరుస కేసులు నమోదు చేసింది. ఆయన్ను అరెస్టు చేసి జైలులో ఉంచిన సందర్భంలో ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జరిపిన న్యాయపోరాటంలో దమ్మాలపాటి కీలకపాత్ర పోషించారు. అలాగే కక్షసాధింపుల్లో భాగంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం పలువురు టీడీపీ నేతలు, పలు మీడియా సంస్థలపై తప్పుడు కేసులు పెట్టి వేధించగా.. వారి తరఫున గట్టిగా వాదనలు వినిపించి తప్పుడు కేసులను తిప్పికొట్టారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా రాజధానియేతర ప్రాంతవాసులకు వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఈ వ్యవహారంలో దాఖలైన వ్యాజ్యాల్లో రైతుల తరఫున సమర్థంగా వాదనలు వినిపించారు.

ఏఏజీగా పలు కీలక కేసుల్లో..

దమ్మాలపాటి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు ఏఏజీగా వ్యవహరించినప్పుడు కూడా.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ కేసులు, పట్టిసీమ ప్రాజెక్టు కేసుల్లో సమర్థంగా వాదనలు వినిపించారు. చిత్తూరు జిల్లాలో హీరోమోటోకార్ప్‌నకు కేటాయించిన భూముల వివాదంలో వాదనలు వినిపించి ప్రాజెక్టు నెలకొల్పడంలో కీలకంగా వ్యవహరించారు. రాజధాని అమరావతి ఏర్పాటు కోసం చేపట్టిన భూసమీకరణ పథకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లోనూ కీలక వాదనలు వినిపించి ప్రాజెక్టుకు ఉన్న అవాంతరాలను అధిగమించారు.

రెండ్రోజుల క్రితమే నిర్ణయం

వాస్తవానికి రెండ్రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు దమ్మాలపాటిని పిలిచి ఏజీగా బాధ్యతలు చేపట్టాలని సూచించారు. అయితే గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ విజయవాడలో లేకపోవడంతో.. వైసీపీ ప్రభుత్వంలో అడ్వకేట్‌ జనరల్‌గా వ్యవహరించిన ఎస్‌.శ్రీరామ్‌, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై.నాగిరెడ్డి రాజీనామాలు ఆమోదం పొందడంలో జాప్యం చోటుచేసుకుంది. దీంతో దమ్మాలపాటి నియామకం కొంత ఆలస్యమైంది. రాష్ట్రప్రభుత్వం మంగళవారం వారి రాజీనామాలు ఆమోదించింది. అనంతరం కొత్త ఏజీ నియామకానికి చర్యలు చేపట్టింది.

నేపథ్యం..

దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్వగ్రామం ఉమ్మడి కృష్ణా జిల్లా కంచికచర్ల. ఆయన తండ్రి దమ్మాలపాటి నాగేశ్వరరావు, విజయలక్ష్మి. పూర్తిగా వ్యవసాయ నేపథ్యం. కంచికచర్లలో పాఠశాల విద్యను పూర్తి చేసిన శ్రీనివాస్‌.. విజయవాడ పి.బి సిద్ధార్థ కళాశాలలో డిగ్రీ పట్టా పొందారు. విజయవాడలోని వెలగపూడి దుర్గాంబ న్యాయ కళాశాల నుంచి 1991లో న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. అదే ఏడాది బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఆర్‌ అశోక్‌ వద్ద రాజ్యాంగం, సివిల్‌, క్రిమినల్‌, పన్నులకు సంబంధించిన కేసులు వాదించడంలో నైపుణ్యం సాధించారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు పలు ప్రభుత్వరంగ సంస్థలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు. అలాగే అనేక కార్పోరేట్‌ సంస్థలకు న్యాయసలహాదారుగా సేవలు అందించారు.

Updated Date - Jun 19 , 2024 | 03:08 AM