Share News

మళ్లీ పట్టాలపైకి అమరావతి ఔటర్‌ ప్రాజెక్టు

ABN , Publish Date - Jun 21 , 2024 | 03:19 AM

అమరావతి రాజధాని ప్రాంతంలోని 87 గ్రామాల ప్రజలకు శుభవార్త. అమరావతి ఔటర్‌ రింగ్‌ (ఏఓఆర్‌)రోడ్డు ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కనుంది.

మళ్లీ పట్టాలపైకి అమరావతి ఔటర్‌ ప్రాజెక్టు

రంగం సిద్ధం చేస్తోన్న ఆర్‌అండ్‌బీ

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అమరావతి రాజధాని ప్రాంతంలోని 87 గ్రామాల ప్రజలకు శుభవార్త. అమరావతి ఔటర్‌ రింగ్‌ (ఏఓఆర్‌)రోడ్డు ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కనుంది. 189 కి.మీ. పరిధిలో నాలుగు వరసల్లో నిర్మించాలనుకున్న ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ ప్రతిపాదనలను రోడ్లు భవనాల శాఖ సిద్ధం చేస్తోంది. ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారవర్గాలు ఈ విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించాయి. త్వరలో సీఎం చంద్రబాబు వద్ద సమావేశం జరగనుందని, ఔటర్‌ ప్రాజెక్టుపై ప్రతిపాదనలు సమర్పిస్తామని సీనియర్‌ అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. 189 కి.మీ. పొడడైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 87 గ్రామాలను అనుసంధానించేలా, 150 మీటర్ల వెడల్పుతో, నాలుగు వరసల్లో రహదారి నిర్మించేలా గతంలోనే ఆర్‌అండ్‌బీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే ఔటర్‌ను కొనసాగించేలా ప్రతిపాదిస్తామని అధికారవర్గాలు తెలిపాయు. అమరావతిగా రాజధానికి ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని 2015లోనే చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్వీ అసోసియేట్స్‌తో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) రూపొందించారు.

3,400 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని, ఇందుకు రూ.4 వేల కోట్లు ఖర్చుకానుందని అంచనా వేశారు. భూ సేకరణ, నిర్మాణం కోసం పూర్తిగా రూ.17,500 కోట్లు ఖర్చవుతుందని లెక్కలు వేశారు. నిధులు ఇచ్చేందుకు కేంద్రం కూడా అంగీకరించింది. భారతమాల ప్రాజెక్టు కింద ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్రం నిధులు కేటాయించింది. అయితే, జగన్‌ సర్కారు వచ్చాక అమరావతి రాజధానితోపాటు, ఆ పేరిట ఉన్న ఇతర కీలకమైన మౌలికరంగ ప్రాజెక్టులను నిలిపివేసింది. అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేతోపాటు, అమరావతి ఔటర్‌రింగ్‌రోడ్డును కూడా అడ్డుకున్నారు. కేంద్రం నిధులు ఇచ్చేందుకు పలుమార్లు సంసిద్ధతను వ్యక్తం చేసినా జగన్‌ సర్కారు అడ్డుకుంది. ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చింది. రాజధాని నిర్మాణ పనులు జోరందుకున్నాయి. దీంట్లో భాగంగా ఔటర్‌రింగ్‌ రోడ్డు ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించాలని ఆర్‌అండ్‌బీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా భూ సేకరణతోపాటు, అంచనాలూ భారీగా పెరగనున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రహదారి నిర్మాణం చేయాలనుకుంటే భూసేకరణకు, సివిల్‌ వర్క్‌లకు ఎంత ఖర్చుకానుందో అంచనాయనున్నారు. మరోసారి డీపీఆర్‌ రూపొందించనున్నారు.

Updated Date - Jun 21 , 2024 | 07:15 AM