Amaravati : 15100కు ఫోన్ చేస్తే ఉచిత న్యాయ సహాయం
ABN , Publish Date - Aug 21 , 2024 | 05:34 AM
రాష్ట్రవ్యాప్తంగా ఉచిత న్యాయ సహాయం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 15100ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (ఏపీఎ్‌సఎల్‌ఎ్‌సఏ) ప్రకటించింది.
సెప్టెంబరు 14న జాతీయ లోక్ అదాలత్: న్యాయసేవాధికార సంస్థ
అమరావతి (ఆంధ్రజ్యోతి), తుళ్లూరు, ఆగస్టు 20: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత న్యాయ సహాయం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 15100ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (ఏపీఎ్‌సఎల్‌ఎ్‌సఏ) ప్రకటించింది.
మహిళలతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, కార్మికులు, సంవత్సర ఆదాయం మూడు లక్షలలోపు ఉన్నవారు దీనికి అర్హులని, వారు ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపింది. అమరావతి సచివాలయం వద్ద ఉన్న రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో మంగళవారం సభ్య కార్యదర్శి ఎం బబిత ఈ వివరాలు వెల్లడించారు.
బాధితులు ఫోన్ చేస్తే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహకారంతో జైళ్లలో ఉన్న 93 మంది ఖైదీలకు ఏపీఎ్‌సఎల్‌ఎ్‌సఏ నేతృత్వంలో వృత్తి నైపుణ్య శిక్షణ అందించామని చెప్పారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, ఏపీఎ్‌సఎల్‌ఎ్‌సఏ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ జి.నరేందర్ ఆదేశాల మేరకు వచ్చే నెల 14న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. సమావేశంలో ఏపీఎ్‌సఎల్‌ఎ్‌సఏ మెంబర్ సెక్రటరీ బబితతో పాటు ఉపకార్యదర్శి డాక్టర్ అమర రంగేశ్వరరావు, సహాయ కార్యదర్శి యన్ జేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.