Share News

AMMA DAIRY : అమ్మమ్మా!

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:07 AM

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఏర్పాటు చేసిన అమ్మ డెయిరీ బకాయిలు రూ. రెండు కోట్లకు చేరాయి. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పాడి రైతుల నుంచి ఏజెంట్లు పాలు సేకరించి అమ్మ డెయిరీకి సరఫరా చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి ఏజెంట్లకు ఒక్కొక్కరికి అమ్మ డెయిరీ రూ.లక్షల్లో బాకీ పడుతూ వస్తోంది. ఏజెంట్లు మాత్రం అప్పులు చేసి గ్రామాల్లో రైతులకు బిల్లులు ...

AMMA DAIRY : అమ్మమ్మా!
Amma Dairy near Alamur

పేరుకుపోయిన అమ్మ డెయిరీ బకాయిలు

దాదాపు రూ.రెండు కోట్లు నిలిచిపోయిన వైనం

డెయిరీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న ఏజెంట్లు

డబ్బులు వసాయో రావోనని ఆందోళన

తోపు టోపీపై భగ్గుమంటున్న వైనం

రాప్తాడు: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఏర్పాటు చేసిన అమ్మ డెయిరీ బకాయిలు రూ. రెండు కోట్లకు చేరాయి. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పాడి రైతుల నుంచి ఏజెంట్లు పాలు సేకరించి అమ్మ డెయిరీకి సరఫరా చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి ఏజెంట్లకు ఒక్కొక్కరికి అమ్మ డెయిరీ రూ.లక్షల్లో బాకీ పడుతూ వస్తోంది. ఏజెంట్లు మాత్రం అప్పులు చేసి గ్రామాల్లో రైతులకు బిల్లులు సకాలంలో అందచేశారు. ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో అమ్మ డెయిరీ అతి త్వరలోనే మూత పడనుందని సమాచారం. డెయిరీ మేనేజర్లు పాలు పంపవద్దని ఇప్పటికే ఏజెంట్లకు చెబుతున్నారు. అయితే పాత బకాయిలు వసూలు చేయడం ఏజెంట్లకు సవాల్‌గా మారింది. ఏజెంట్లు ఎక్కువగా వైసీపీ మద్దతుదారులే ఉండటంతో


బకాయిలు వస్తాయో రావో అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదిరింపులు.. బెదిరింపులతో ప్రారంభం

వైసీపీ పాలనలో అప్పటి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి అనంతపురం రూరల్‌ మండలం ఆలమూరు సమీపంలో 2023 జూన 14న అప్పటి జిల్లా ఇనచార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి ఉష శ్రీచరణ్‌, జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి అమ్మ డెయిరీని ప్రారంభించారు. 10 వేల మంది డ్వాక్రా మహిళల యాజమాన్యంతో డెయిరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ పది వేల మంది మహిళల ఆద్వర్యంలోనే అమ్మ డెయిరీ నిర్వహించి అందులో వచ్చిన లాభాన్ని ఏడాదికొకసారి వారికే పంచుతామన్నారు. రోజుకు లక్ష లీటర్లు పాలు సేకరించి కాలక్రమేణా రోజుకు 10 లక్షల లీటర్ల పాలు సేకరిస్తామని డెయిరీ ప్రారంభించినప్పుడు బహిరంగ సభలో ప్రకా్‌షరెడ్డి తెలిపారు. ప్రారంభించిన మొదట్లో రోజుకు రూ. 5 వేల లీటర్లు డెయిరీకి వచ్చేవి. అప్పడు వైసీపీ అధికారంలో ఉండటంతో గ్రామాల్లో ఆపార్టీ నాయకులు ప్రైవేటు డెయిరీ ఏజెంట్లను కొంత మందిని బెదిరించి పాలు అమ్మ డెయిరీకి పంపాలని హుకుం జారీ చేశారు. దీంతో కొందరు ఏజెంట్లు కొన్ని పాలను అమ్మ డెయిరీకి పంపారు. కొన్నాళ్లకు అమ్మ డెయిరీకి రోజులకు 10 వేల లీటర్ల పాలు వచ్చేవి. డెయిరీ సభ్యులు పాలను ప్యాకెట్లుగా చేసి దుకాణాలకు విక్రయించేవారు. అయితే క్రమంగా డెయిరీ నష్టాల బాట పట్టింది. దీంతో ఏజెంట్లకు సకాలంలో బిల్లులు చెల్లించలేకపోయారు. అయితే గ్రామాల్లో రైతుల ఒత్తిడి తట్టుకోలేక ఏజెంట్లు అప్పులు చేసి రైతులకు పాల బిల్లులు చెల్లించారు.

ఒక్కో మహిళ నుంచి రూ. 10 వేలు వసూలు

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళా సహకార డెయిరీ ఏర్పాటు చేస్తామని రాప్తాడు నియోజకవర్గంలో వేల మంది మహిళల నుంచి ఒక్కొక్కరితో రూ. 10 వేలు చొప్పున ప్రకా్‌షరెడ్డి వసూలు చేయించారు. ఇలా రూ. కోట్లలో వసూలు చేశారు. ఆ మొత్తాన్ని అప్పట్లో ప్రకా్‌షరెడ్డి సోదరులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళల నుంచి వసూలు చేసిన మొత్తం ఏమైందని అప్పట్లో ప్రతిపక్ష నాయకులు గట్టిగా నిలదీయడంతో మూడేళ్ల తరువాత ఆ డబ్బును వెనక్కు ఇచ్చేశారు.


మేము గెలిచి ఉంటే మీరు బిల్లులు అడిగేవారా?

ఏజెంట్లు తమకు రావాల్సిన బకాయిల కోసం తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డికి ఫోన చేయగా అందుబాటులోకి రాలేదు. డెయిరీ దగ్గరికి వెలితే మేనేజర్ల నుంచి సరైన సమాధానం రాలేదు. కొన్నాళ్లు డెయిరీ చుట్టూ ఏజెంట్లు తిరిగారు. ఇటీవల దాదాపు 10 మంది ఏజెంట్లు డెయిరీ దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి ప్రకా్‌షరెడ్డి స్వగ్రామం తోపుదుర్తి వెళ్లారు. ఆ సమయంలో ప్రకా్‌షరెడ్డి వాళ్ల నాన్న తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి ఇంట్లో ఉన్నారు. మా బిల్లులు రూ. లక్షల్లో బాకాయిలు ఉన్నాయి. వెంటనే ఇవ్వండి అని అడిగారు. ఎన్నికల్లో గెలిచి ఉంటే మీరు మమ్మల్ని బిల్లులు అడిగేవారా అని ఏజెంట్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా బిల్లులు వసూలైనప్పుడు మీ బిల్లులు ఇస్తాం

బకాయి బిల్లుల కోసం ఏజెంట్లు తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి వద్దకు వెళ్లారు. డెయిరీ మేనేజర్‌ను పిలిపించి ఎవరెవరికి ఎంత బకాయి ఉన్నాం అని మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. డెయిరీకి రావాల్సిన పాల సేల్స్‌ డబ్బులు వచ్చాక మీ బిల్లులు ఇస్తాం అని ఏజెంట్లకు తెలిపారు. అమ్మ డెయిరీకి పాల ప్యాకెట్ల సేల్స్‌ నుంచి రూ. 20 లక్షలు రావాల్సి ఉంది. ఏజెంట్లకు రూ. 2 కోట్లు బకాయిలు ఉన్నాయి. మిగతా మొత్తం ఎక్కడి నుంచి ఇస్తారన్నదే ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ నేపథ్యంలోనే తమకు రావాల్సిన బకాయిలు వస్తాయో రావో అని ఏజెంట్లు భయాందోళన చెందుతున్నారు. ఈక్రమంలోనే ప్రకా్‌షరెడ్డి ఇంత మోసం చేస్తాడా అని భగ్గుమంటున్నారు.

- ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఓ ఏజెంట్‌కు రూ.18.50 లక్షలు, మరో ఏజెంట్‌కు రూ.20 లక్షలు, తలుపూరుకు చెందిన ఓ ఏజెంట్‌కు రూ.5.30 లక్షలు, వడ్డుపల్లికి చెందిన ఓ ఏజెంట్‌కు రూ.3.70 లక్షలు బకాయిలు రావాల్సి ఉంది.

- రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన ఓ ఏజెంట్‌కు రూ. 18 లక్షలు, మరో ఏజెంట్‌కు రూ. 9లక్షలు, యర్రగుంటకు చెందిన ఓ ఏజెంట్‌కు రూ. 5లక్షలు పైగా రావాల్సి ఉంది.

- అనంతపురం రూరల్‌ మండలం మన్నీలకు చెందిన ఓ ఏజెంట్‌కు రూ. 9 లక్షలు, పూలకుంటకు చెందిన ఓ ఏజెంట్‌కు రూ. 4లక్షలు రావాల్సి ఉంది.

- కనగానపల్లి మండల తగరకుంటకు చెందిన ఓ ఏజెంట్‌కు రూ. 17 లక్షలు రావాలి ఉంది. ఇలా జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లకు దాదాపు రూ. 2 కోట్లు రావాల్సి ఉంది. బకాయిల కోసం ఏజెంట్లు డెయిరీ చుట్టూ తిరుగుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 02 , 2024 | 12:07 AM