HOUSING : నిజం తేలేనా?
ABN , Publish Date - Jun 23 , 2024 | 12:11 AM
గత ప్రభుత్వ పాలనలో జిల్లా గృహ నిర్మాణశాఖలో భారీగా అవినీతి జరిగిందనే ప్రచారం జోరందుకుంది. ఇల్లు మంజూరు నుంచి ఇసుక, సిమెంట్ తదితర సామగ్రి సరఫరాతో పాటు బిల్లులు మంజూరులో సైతం పెద్దఎత్తున అవినీతి జరిగిందనే చర్చ ఆ శాఖలో సాగుతోంది. ఈ వ్యవహారంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు ఆశాఖ పీడీ, ఇద్దరు డీఈఈలు(వీరిలో ఒకరు ఈఈ ఇనచార్జిగా, మరొకరు ఏఈగా పనిచేశారు), వీరితో పాటు రాప్తాడుకు చెందిన మరో ఏఈ పై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొన్ని నెలలు కింద ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ప్రస్తుత రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జిల్లా ...
హౌసింగ్‌లో భారీగా అవినీతి..!
మాజీ ఎమ్మెల్యే, పీడీ, ఇద్దరు డీఈఈలపై ఆరోపణలు
అవినీతిపై గతంలోనే పరిటాల సునీత ఫిర్యాదు
అధికారం అండతో నివేదికను తొక్కిపెట్టిన తోపు
తాజాగా తెరపైకి అప్పటి ఫిర్యాదు
అక్రమార్కుల్లో ఆందోళన
సెలవులో పీడీ.. విచారణ పేరుతో మరో అధికారికి బాధ్యత అప్పగింత
అనంతపురం సిటీ, జూన 22:
గత ప్రభుత్వ పాలనలో జిల్లా గృహ నిర్మాణశాఖలో భారీగా అవినీతి జరిగిందనే ప్రచారం జోరందుకుంది. ఇల్లు మంజూరు నుంచి ఇసుక, సిమెంట్ తదితర సామగ్రి సరఫరాతో పాటు బిల్లులు మంజూరులో సైతం పెద్దఎత్తున అవినీతి జరిగిందనే చర్చ ఆ శాఖలో సాగుతోంది. ఈ వ్యవహారంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు ఆశాఖ పీడీ, ఇద్దరు డీఈఈలు(వీరిలో ఒకరు ఈఈ ఇనచార్జిగా, మరొకరు ఏఈగా పనిచేశారు), వీరితో పాటు రాప్తాడుకు చెందిన మరో ఏఈ పై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొన్ని నెలలు కింద ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ప్రస్తుత రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేయగా.. అవినీతి జరిగినట్లు ఓ ఈఈ స్థాయి అధికారిణి కూడా గుర్తించారు. అయితే నివేదిక పైకి చేరకుండా కొందరు
అధికారులు(తోపు అండతో) అడ్డుపడి బుట్ట దాఖలు చేసినట్లు సమాచారం. తాజాగా టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో పరిటాల సునీత చేసిన అప్పటి ఫిర్యాదు మరోమారు వెలుగులోకి వచ్చింది. పరిటాల సునీత ఆశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి అవినీతిపై ఆరా తీయడం తో తోపు నుంచి.. పై స్థాయి అవినీతి అధికారుల్లో అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో పీడీ సెలవులో వెళ్లడంతో పాటు ఆ ఫిర్యాదుపై విచారణ చేయడా నికి (అప్పుడు చేసిన ఈఈ కాకుండా) అనుకూలమైన మరో డీఈఈతో పాటు మరికొందరు ఉద్యోగులను కమిటీగా నియమించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రూ. కోట్లలో అవినీతి
జగనన్న ఇళ్ల నిర్మాణం పేరుతో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి చేసిన అవినీతి అంతా..ఇంత కాదనే విమర్శలున్నాయి. గత ఐదేళ్లుగా ఆయన ఆధ్వర్యంలో నడిచే సంస్థ చేసిన నిర్మాణం కంటే బిల్లులు రూపంలో దోచిందే ఎక్కువ అన్నట్టుగా ఉంది. ఇందుకు ఆశాఖలో పనిచేస్తున్న ఒక ఈఈ(డీఈ) కీలకంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ఈయన గృహనిర్మాణ శాఖకు ఏ పీడీ వచ్చిన తోపు అండదండలతో వారికి దగ్గర అయ్యేవాడు. ఈనేపథ్యంలోనే పీడీతో పాటు మరో డీఈఈ, అనుకూలమైన ఏఈఈలను అడ్డం పెట్టుకుని ఎక్కడికక్కడ అందినకాడికి తోపుదుర్తికి దోచిపెట్టారనే విమర్శలున్నాయి. పెద్దస్థాయిలో ఈ దందా సాగుతుండటంతో మిగిలిన అధికారులు, ఉద్యోగులు ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. ఒకనొక సందర్భంలో ఇనచార్జి ఈఈకి బదిలీ వచ్చినా తోపు అండతో జిల్లాకు బదిలీ అయిన ఈఈని రానివ్వకుండా.. ఆపేసి తన ఇనచార్జి ఈఈ ఉద్యోగాన్ని నిలబెట్టుకున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల సమయంలో ఆ ఉద్యోగాన్ని వదులుకుని మరోప్రాంతానికి డీఈఈగా వెళ్లిపోయారు. కానీ ఆ అధికారి మాత్రం ఇప్పటికి పాత పంథాలోనే వ్యవహరిస్తున్నారని తెలిసింది.
పరిటాల సునీత ఫిర్యాదు చేసినా స్పందన అంతే..
వైసీపీ అధికారంలో ఉండగా.. జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో తోపునకు చెందిన రాక్రీట్ సంస్థ భారీ ఎత్తున దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆశాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు కూడా ఆ సంస్థకు వంత పాడుతూ అవినీతికి ఆజ్యం పోశారనే విమర్శలున్నాయి. ఈనేపథ్యంలో రాప్తాడు నియోజకవర్గం పరిధిలో జగనన్న ఇళ్ల పేరుతో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని ఏడాది కిందట రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత లిఖిత పూర్వకంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ అప్పటి పీడీ కేశవనాయుడును విచారణకు ఆదేశించారు. ఆయన కూడా ఓ మహిళా ఈఈని విచారణ చేసి నివేదిక ఇవ్వమని చెప్పారు. ఈ విచారణ సాగుతుండగానే.. పీడీ బదిలీ కావడంతో డీఆర్‌డీఏ పీడీకి హౌసింగ్ ఇనచార్జిగా బాధ్యతలు వచ్చాయి. ఆయితే విచారణలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు మహిళా ఈఈ గుర్తించి ఇనచార్జి పీడీకి నివేదిక అందజేసినట్లు సమాచారం. అయితే వైసీపీ అధికారంలో ఉండటం, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే తోపు అండగా ఉండటంతో ఆ నివేదిక జిల్లా కలెక్టర్‌కు పంపకుండా ఆపేసినట్లు సమాచారం. దీంతో అవినీతికి పాల్పడిన అధికారులకు కొంత ఊరట కలిగినట్లైంది.
కూటమి రాకతో వెలుగులోకి ఫిర్యాదు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమీ అధికారంలోకి రావడం.. రాప్తాడు ఎమ్మెల్యేగా పరిటాల సునీత విజయం సాధించడంతో తోపుతో పాటు అవినీతి అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఎమ్మెల్యే పరిటాల సునీత ఇటీవల ఆశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి జరిగిన అవకతవకలు, అప్పట్లో అందజేసిన ఫిర్యాదుపై నివేదికను అందజేయాలని ఆదేశించింది. అయితే ఈ సమీక్షకు సెలవులో వెళ్లిన ఇనచార్జి పీడీ హాజరుకాకపోవడం గమనార్హం.
సెలవులో పీడీ.. మరొకరికి బాధ్యతల అప్పగింత
అవినీతిలో భాగస్వాములైనందుకు తనకు కూడా శిక్ష పడుతుందనో.. లేక.. నిజంగానే.. కాలికి గాయం కావడంతోనో ఇంతవరకు ఆశాఖ ఇనచార్జి పీడీగా పనిచేసిన ఆయన ఉన్నఫలంగా రెండు రోజుల కిందట సెలవుపై వెళ్లారు. దీంతో చేసిన అవినీతి అక్రమాలు పక్కదారి పట్టించాలనే పెద్దఎత్తున పన్నాగాలు పన్నుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే క్రమంలో విచారణ కూడా తూతూ మంత్రంగా చేసి కలెక్టర్‌ను బురడికొట్టించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతి, అక్రమాలు నూతన కమిటీతో వెలుగులోకి వస్తాయా..? లేక.. గతంలో అవినీతి ఆక్రమాలు జరిగాయనీ.. అప్పట్లో ఓ ఈఈ నివేదిక ఇచ్చినా.. అధికారం అడ్డుపెట్టుకుని బుట్టదాఖలు చేసినట్లై.. ఈ నివేదికను వెలుగులోకి రాకుండా చేస్తారా.. ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....