Free Sand : రేపటి నుంచి ఉచిత ఇసుక
ABN , Publish Date - Jul 07 , 2024 | 12:03 AM
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ఉచితంగా ఇసుకను సరఫరా చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసిందని కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఇసుక విధానంపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఒక మెట్రిక్ టన్ను ఇసుక ధర రూ.195 అని తెలిపారు. ఇందులో రీచ నుంచి ఇసుకను డిపో వరకూ తరలించడం, లోడింగ్ చార్జీ, రాయల్టీ చార్జీలు కలిపి ఉంటాయని తెలిపారు. ఒక రోజుకి ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇస్తామని తెలిపారు. ఆధార్...
మెట్రిక్ టన్ను ధర రూ.195
రోజుకి ఒక్కొక్కరికి 20 మెట్రిక్ టన్నులు
ఆధార్.. సెల్ నంబర్, చిరునామా ఇవ్వాలి
మార్గదర్శకాలు విడుదల చేసిన కలెక్టర్ వినోద్ కుమార్
అనంతపురం టౌన, జూలై 6: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ఉచితంగా ఇసుకను సరఫరా చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసిందని కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఇసుక విధానంపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఒక మెట్రిక్ టన్ను ఇసుక ధర రూ.195 అని తెలిపారు. ఇందులో రీచ నుంచి ఇసుకను డిపో వరకూ తరలించడం, లోడింగ్ చార్జీ, రాయల్టీ చార్జీలు కలిపి ఉంటాయని తెలిపారు. ఒక రోజుకి ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇస్తామని తెలిపారు. ఆధార్ కార్డు, మొబైల్ నంబరు, ఇసుక ఎక్కడికి చేర్చాలో తెలిపే చిరునామా తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక పంపిణీ జరుగుతుందని అన్నారు.
ఏర్పాట్లు చేయండి..
ఉచిత ఇసుక పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాయదుర్గం మండలం జుంజరంపల్లి డిపోలో 58,160 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని తెలిపారు. ఏజెన్సీ ద్వారా టేకోవర్ చేయాలని సూచించారు. కణేకల్లు మండలం రచ్చుమర్రి వద్ద సీజ్ చేసిన ఇసుక 13,278
మెట్రిక్ టన్నులు ఉందని, భద్రంగా చూసుకోవాలని ఆదేశించారు. పోలీసులు, వీఆర్‌ఓలను షిఫ్టులవారిగా భద్రతా విధుల్లో ఉంచాలని సూచించారు. జుంజరంపల్లి వద్ద సోమవారం ఇసుక పంపిణీని ప్రారంభిస్తామని తెలిపారు. ఉచిత ఇసుక విధానం వివరాలు ప్రజలకు తెలిసేలా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పోస్టర్లు ప్రదర్శించాలని ఆదేశించారు. అన్ని వివరాలను జిల్లా వెబ్‌సైట్‌లో పొందుపరచాలని అన్నారు. కలెక్టరు, డీడీ మైన్స పేరిట ఉమ్మడిగా బ్యాంకు ఖాతా తెరవాలని, ఆ తరువాత క్యూ ఆర్ కోడ్‌ను ఇసుక డిపోల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడ స్కాన చేస్తే డబ్బులు జాయింట్ అకౌంట్‌లో జమ అవుతాయని తెలిపారు. ఇసుక పంపిణీతో సంబంధం ఉన్న అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
నిబంధనలను అమలు చేయండి: సీఎస్
ఉచిత ఇసుక విధానాన్ని నిబంధనల మేరకు జిల్లాలో అమలు చేయాలని కలెక్టరు, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్‌కుమార్ ఆదేశించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై శనివారం ఆయన వీడియో కాన్పరెన్స నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..