SSA OFFICE : ఉందామా.. వెళదామా..!
ABN , Publish Date - Jun 19 , 2024 | 12:30 AM
‘ఉందామా..? వెళ్దామా..? ఉంటే ఇబ్బంది పడుతామేమో..! ప్రాజెక్టు నుంచి స్కూళ్లకు వెళితేనే మంచిదేమో..!’ ఇదీ కొందరు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగుల పరిస్థితి. అనంతపురం సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఉండే సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారుల కొన్నాళ్లుగా డోలాయమాన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమకు ఉన్న పరిచయాలతో ...
సమగ్రశిక్ష ప్రాజెక్టులోకి అడ్డదారుల్లో ప్రవేశం
వైసీపీ హయాంలో ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సులు
అర్హత లేకున్నా ఎంట్రీ ఇచ్చిన గురుపుంగవులు
ఎన్నికల్లో ‘వైసీపీ రుణం’ తీర్చుకునేలా ప్రచారం
పభుత్వం మారడంతో తిరుగు టపాకు ప్రయత్నాలు
రీప్యాట్రేషనకు ముగ్గురు టీచర్ల లేఖలు
కలెక్టర్‌కు చేరిన దొడ్డిదారి ఎంట్రీల జాబితా..?
అనంతపురం విద్య, జూన 18: ‘ఉందామా..? వెళ్దామా..? ఉంటే ఇబ్బంది పడుతామేమో..! ప్రాజెక్టు నుంచి స్కూళ్లకు వెళితేనే మంచిదేమో..!’ ఇదీ కొందరు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగుల పరిస్థితి. అనంతపురం సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఉండే సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారుల కొన్నాళ్లుగా డోలాయమాన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమకు ఉన్న పరిచయాలతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నియోజకవర్గ నాయకులతో పైరవీలు చేసుకున్నారు. అప్పటి అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. అర్హతలు లేకున్నా
ప్రాజెక్టు కార్యాలయంలో పాగా వేశారు. కొందరు సెక్టోరియల్, మరికొందరు అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టుల్లో తిష్ట వేశారు. జిల్లా సరిహద్దు స్కూళ్లలో పనిచేయాల్సిన కొందరు, పొరుగు జిల్లా నుంచి కొందరు కలెక్టర్, జేసీ, డీఈఓపై ఎత్తిడి తెచ్చి ప్రాజెక్టులోకి ప్రవేశించారు. తమకు కావాల్సిన పోస్టులను దక్కించుకున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో కొందరు ఇక్కడి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొందరు ప్యాకప్ అంటుంటే.. మరికొందరు వెళ్దామా.. వద్దా.. అని సందిగ్ధంలో ఉన్నారు. ప్రాజెక్టు నుంచి వెళితే మంచి ప్లేస్ వస్తుందో రాదో అని కొట్టుమిట్టాడుతున్నారు. అప్పట్లో కొందరు అధికారులకు లక్షలకు లక్షలు సమర్పించారు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.
వైసీపీ నేతలతో పైరవీలు
జిల్లా సమగ్రశిక్ష ప్రాజెక్టు కార్యాలయంలో గతంలో పలు పోస్టులు ఖాళీగా ఉండేవి. ముఖ్యంగా ఏఎంఓ, అసిస్టెంట్ సీఎంఓ, అసిస్టెంట్ అలెస్కో, జీసీడీఓ, ఏఎ్‌సఓ పోస్టులు ఖాళీగా ఉండేవి. వైసీపీ ప్రభుత్వంలో జిల్లా సరిహద్దు స్కూళ్లలో ఉన్న టీచర్లు అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేలను పట్టుకుని, సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారులపై, జాయింట్ కలెక్టర్‌పై ఒత్తిడి తెప్పించి, అధికారులను ఒప్పించారు. విడపనకల్లు మండలంలో పనిచేసే ఓ టీచర్ ఒక పోస్టును సంపాయించుకున్నారు. వైఎస్సార్‌టీఏ నాయకుడు,
బెళుగుప్ప మండలంలో పనిచేసే ఓ టీచర్ స్థానిక ఎమ్మెల్యే, ఇతర నాయకులను పట్టుకుని ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. రాయదుర్గం నియోజకవర్గంలోని సుదూర ప్రాంత స్కూల్‌లో పనిచేసే మరో టీచర్ వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అండతో ప్రాజెక్టులోని కీలక పోస్టును కైవసం చేసుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా నుంచి సైతం ఓ టీచర్ ప్రాజెక్టులోని కీలక ఉన్నతాధికారిని ప్రసన్నం చేసుకుని చేరిపోయారు. ఎలాంటి అనుభవం లేకున్నా మరో టీచర్ డి.హీరేహాళ్ మండలం నుంచి అప్పటి డీఈఓ ఆశీస్సులతో చోటు సంపాదించాడు. ఇలా చాలా మంది అడ్డదారుల్లో ప్రాజెక్టులో చేరిపోయారు.
రీప్యాట్రేషనకు లెటర్లు...
ప్రాజెక్టులో పనిచేస్తున్న టీచర్లలో ఇప్పటికే ముగ్గురు రీప్యాట్రేషనకు లెటర్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఇద్దరు అసిస్టెంట్ ఏఎంఓలు, జీసీడీఓ ఇప్పటికే లెటర్లు ఇచ్చారు. వీరిలో కొందరు మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. మరికొందరి సర్వీసు ఇంకా ఉంది. అయినా తమ పాత స్థానాలకు వెళతామని
లెటర్లు ఇచ్చారు. వీరి సంగతి అలా ఉంచితే, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నాయకుల సిఫార్సులతో దొడ్డిదారిలో వచ్చిన సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులే ఇప్పుడు డైలమాలో ఉన్నారు. ఉందామా...? వెళ్దామా...? అని ఎటూ తేల్చుకోలేక సంకట స్థితిలో ఉన్నారు. ఇప్పటికే వీరి జాతకాలను ప్రాజెక్టు ఉన్నతాధికారులు కలెక్టర్ వద్ద ఉంచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కలెక్టర్ కోర్టుకు చేరిన బంతులు ఎక్కడ పడతాయో వేచి చూడాల్సిందే.
వైసీపీకి పావులు..
ప్రాజెక్టులోకి వచ్చిన కొందరు అధికారులు వైసీపీకి పావులుగా మారారు. సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులుగా సమగ్రశిక్ష ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చిన అధికారులు ఎన్నికల వేళ వైసీపీ తరఫున బాగానే ప్రచారం చేశారు. కొందరు డాబాలకు వెళ్లి విందు రాజకీయాల్లో పాల్గొన్నారు. మరికొందరు మళ్లీ వచ్చేది మన జగన ప్రభుత్వమే అంటూ తమదైన శైలిలో ప్రచారం చేశారు. ప్రాజెక్టులోకి వచ్చేందుకు ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ లెటర్ ఇచ్చారన్న సానుభూతితో, అధికారులకు ఫోన్లు చేశారన్న మమకారంతో సరెండర్ అయ్యారు. ఎన్నికల్లో వారి గెలుపు కోసం తమవంతు పోరాటం చేశారు. అందరి లెక్కలు తప్పాయి. తుఫాను వేగంలో టీడీపీ కూటమి ప్రభుత్వం దూసుకొచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో అప్పుడు పైరవీలు చేసి అధికారులు రివర్స్ గేర్ వేస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవ.. అప్పట్లో పనిచేసిన చోటుకు వెళ్లిపోదాం అనుకుంటున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....