Share News

AP ELECTIONS : బయటకు రావద్దు ప్లీజ్‌..!

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:09 AM

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నాలుగో తేదీ ఎవరూ అనవసరంగా బయటకు రాకూడదని జిల్లా కలెక్టరు డాక్టర్‌ వినోద్‌కుమార్‌, జిల్లా ఎస్పీ గౌతమీశాలి హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో శనివారం వారు సంయుక్తంగా కౌంటింగ్‌ ఏర్పాట్లపై విలేకర్ల సమావేశం నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు జేఎనటీయూలో పూర్తి చేశామన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లు ఆరోజు ఉదయం ...

AP ELECTIONS : బయటకు రావద్దు ప్లీజ్‌..!

కౌంటింగ్‌ రోజు గొడవపడితే కఠిన చర్యలు

కలెక్టరు, ఎస్పీ హెచ్చరిక

అనంతపురం టౌన, జూన 1: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నాలుగో తేదీ ఎవరూ అనవసరంగా బయటకు రాకూడదని జిల్లా కలెక్టరు డాక్టర్‌ వినోద్‌కుమార్‌, జిల్లా ఎస్పీ గౌతమీశాలి హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో శనివారం వారు సంయుక్తంగా కౌంటింగ్‌ ఏర్పాట్లపై విలేకర్ల సమావేశం నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు జేఎనటీయూలో పూర్తి చేశామన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లు ఆరోజు ఉదయం 6గంటల నుంచి 7గంటలలోపు కేంద్రంలోకి రావాల్సి ఉంటుందన్నారు. ఆతర్వాత వస్తే అనుమతించమన్నారు. ఏజెంట్లు నిబంధనల మేరకు వ్యవహరించాలని, కేంద్రంలో గొడవలకు దిగితే బయటకు పంపిస్తామన్నారు. అందుకే క్రమశిక్షణతో మెలిగేవాళ్లనే ఏజెంట్లగా కౌంటింగ్‌కు పంపించాలని


రాజకీయపార్టీలకు సూచించారు. జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీలకు కలిపి 113మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 2236 పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈవీఎంలు, పోస్టల్‌బ్యాలెట్స్‌ కౌంటింగ్‌కు అవసరమైన గదులు, అధికారులు, సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకు కౌంటింగ్‌ పరిశీలకులు వస్తున్నారని వారి పర్యవేక్షణలో ఎవరెవరు ఏపనిచేయాలో కేటాయిస్తామని తెలిపారు.

పోస్టల్‌బ్యాలెట్‌ ఫలితాలు ఆఖరున..

పోస్టల్‌బ్యాలెట్‌ కౌంటింగ్‌ ఉదయం 8గంటల నుంచి కొనసాగించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఈవీఎంల కౌంటింగ్‌ కొనసాగిస్తామన్నారు. ఈవీఎంల కౌంటింగ్‌ రౌండ్‌ ముగిసిన తర్వాత అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను ఎప్పటికపుడు తెలియజేస్తామన్నారు. అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ పూర్తి అయినా కూడా చివరలో ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లకు కలిపిన తర్వాతే ప్రకటిస్తామని కలెక్టరు తెలిపారు.


గొడవలకు దిగితే తాటతీస్తాం: గౌతమీశాలి, ఎస్పీ

కౌంటింగ్‌రోజు ఎవరైనా గొడవలకు దిగితే తాటతీస్తామని జిల్లా ఎస్పీ గౌతమీశాలి హెచ్చరించారు. నగరంతో పాటు జిల్లా అంతటా 144సెక్షన అమలులో ఉంటుందన్నారు. నలుగురికన్నా ఎక్కువ మంది ఒకచోట ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా 315 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అక్కడ ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అత్యంత సమస్యాత్మక గ్రామాలలో డ్రోన కెమెరాలు ఎగరవేయడంతోపాటు 270 సీసీకెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎవరు ఏమిచేసినా దొరికి పోతారని ప్రతి ఒక్కరు బుద్ధిగా ఉండాలని అల్లర్లకు దిగి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ హితవు పలికారు. జేఎనటీయూ వద్ద ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పాటు చేసి బందోబస్తు కొనసాగిస్తున్నామన్నారు. జేఎనటీయులోకి ఎవరు రావాలన్నా ఐడీ కార్డు ఉంటేనే అనుమతి ఉంటుందన్నారు. అనంత జిల్లాలో ఈ జిల్లావారే ఉండాలని ఇతర జిల్లాల వ్యక్తులు కౌంటింగ్‌ ప్రాంతంలో గానీ, గొడవలు జరిగేప్రాంతంలోగానీ కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైండోవరు అయినవారు మళ్లీ గొడవలు చేస్తే మరింత కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టరు బొల్లినేని వినూత్న, డీఆర్‌ఓ రామక్రిష్ణారెడ్డి, ఫారెస్ట్‌ ఆఫీసర్‌ వినీతకుమార్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 02 , 2024 | 12:09 AM