Sale of layouts : రెడ్ మార్క్ దందా..!
ABN , Publish Date - Jun 06 , 2024 | 12:23 AM
టీడీపీ కూటమి భారీ విజయంతో వైసీపీలోని అక్రమార్కులో గుబులు మొదలైంది. అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు బయట పడితే తమ పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ జాబితాలో రాప్తాడు తాజా మాజీ ఎమ్మెల్యే, ఆయన సోదరులు, బినామీల పేర్లు వినిపిస్తున్నాయి. రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత విజయం సాధించడంతో తోపుదుర్తి సోదరులు, వారి బినామీలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. రాప్తాడు జగనన్నకాలనీలో రెడ్‌మార్క్ ఉండే స్థలాలను ...
రాప్తాడులో జగనన్న లే అవుట్ల అమ్మకం
ఒక్కో ప్లాట్‌ను రూ.5 లక్షల వరకూ..
ప్రైవేటు స్థలాలనూ కలిపి కాజేశారట
తోపుదుర్తి సోదరులు.. బినామీలపై ఆరోపణలు
అనంతపురం సిటీ, జూన 5: టీడీపీ కూటమి భారీ విజయంతో వైసీపీలోని అక్రమార్కులో గుబులు మొదలైంది. అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు బయట పడితే తమ పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ జాబితాలో రాప్తాడు తాజా మాజీ ఎమ్మెల్యే, ఆయన సోదరులు, బినామీల పేర్లు వినిపిస్తున్నాయి. రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత విజయం సాధించడంతో తోపుదుర్తి సోదరులు, వారి బినామీలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. రాప్తాడు జగనన్నకాలనీలో రెడ్‌మార్క్ ఉండే స్థలాలను ప్లాట్‌లుగా విభజించి అమ్మేయడమే దీనికి కారణమని అంటున్నారు. ఒక్కొక్క ప్లాట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించి సొమ్ముచేసుకున్నారనే ఆరోపణలు జోరందుకున్నారు. దీనికితోడు నగర శివారులోని టిడ్కో ఇళ్ల సమీపంలో తోపుదుర్తి సోదరులు తమ అనుకూల వర్గాలకు ప్లాట్‌లను ఇప్పించి, వాటిని సైతం విక్రయించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాప్తాడులోని మరో జగనన్న కాలనీ విషయంలోనూ రాజకీయం చేశారని, ఒక్క ప్లాట్ కూడా ప్రజలకు ఇవ్వకుండా లే అవుట్ స్థలం మొత్తాన్ని కాజేశారని ప్రచారం జరుగుతోంది.
రెడ్ మార్క్ ఉంటే అమ్మేయడమే..
లే అవుట్ వేసినప్పుడు నిబంధనల ప్రకారం ప్రార్థనా మందిరాలు, పార్కులు ఇతర అవసరాలకు కొంత స్థలాలను వదిలేయాలి. రాప్తాడు మండల పరిధిలోని పండమేర వంక సమీపంలో ఉన్న జగనన్న లే అవుట్‌లో ఇలా వదిలిన స్థలాలపై కన్నేశారు. గుట్టుచప్పుడు కాకుండా ప్లాట్‌లుగా విభజించి అమ్మేశారని సమాచారం. ఒక్కొక్క ప్లాట్ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. ఈ లే అవుట్‌లో 50 నుంచి 60 ప్లాట్‌లను విక్రయించారని, రూ.3 కోట్లకు వరకు సొమ్ము చేసుకున్నారని సమాచారం. తమకు అనుకూలంగా ఉండే ఓ వైస్ ఎంపీపీ, మరికొందరిని వర్గంగా ఏర్పాటు చేసి ఈ తతంగం నడిపించారని తెలిసింది. వచ్చిన రూ.3 కోట్లను పంచుకోవడంలో విభేదాలు వచ్చాయని, లోలోపల గొడవలు కూడా జరిగాయని సమాచారం. ఈ వ్యవహారం రెవెన్యూ, హౌసింగ్ అధికారుల దృష్టికి వెళ్లిందా.. లేదా అన్న చర్చ జరుగుతోంది. బినామీలు అమ్మిన ప్లాట్‌లకు ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని, నగదు తీసుకుని స్థలాలు చూపించారని, ఇళ్లు కట్టుకోవాలని సూచించారని కొన్నవారు అంటున్నారు. తోపుదుర్తి ఓడిపోవడంతో తమ పరిస్థితి ఏమిటని ప్లాట్‌లను కొనుగోలు చేసినవారు ఆందోళన చెందుతున్నారు.
మూడు ఎకరాలను కాజేశారా..?
తోపుదుర్తి సోదరుల్లో ఒకరు, మండల స్థాయి పదవిలో ఉండే ఇద్దరు కలిసి మూడు ఎకరాలను మింగేశారని సమాచారం. నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు పథకం కింద రెవెన్యూ, హౌసింగ్ అధికారులు జేఎనటీయూ సమీపంలోని 3 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఆయితే ఆ భూమి తమదని ఓ వ్యక్తి అప్పట్లో కోర్టుకు వెళ్లాడు. దీంతో ఆ లే అవుట్‌కు బ్రేక్ పడింది. ఆ స్థలాన్నే కాజేశారని అంటున్నారు. రెవెన్యూ అధికారులను వాడుకున్నారో, భూమి హక్కుదారును బెదిరించారో తెలియదని.. ఆ మూడు ఎకరాలను కాజేశారని కొందరు అంటున్నారు. అధికారులను అడిగితే తమకు ఏమీ తెలియదన్నట్లు మౌనం పాటిస్తున్నారు.
ప్రైవేటు భూములనూ వదల్లేదు..
జగనన్న లే అవుట్‌లోని రెడ్ మార్క్ స్థలాలతోపాటు.. లే అవుట్‌కు అనుకుని ఉన్న ప్రైవేటు భూములను సైతం ప్లాట్‌లలోకి కలిపి అమ్మేశారని ప్రచారం జరుగుతోంది. ఇలా అమ్మేసిన స్థలం అర ఎకరానికి పైగానే ఉందని సమాచారం. రెడ్ మార్క్ ప్లాట్‌లను కొనుగోలు చేసిన వారిలో చాలా మంది ఇప్పటికే ఇళ్లను నిర్మించారని తెలిసింది. స్థలానికి ఖాళీగా ఉంచితే సమస్య వస్తుందని చకచకా నిర్మాణాలు పూర్తి చేశారని అంటున్నారు. అనంతపురం రూరల్, రాప్తాడు, ఆత్మకూరు, సీకేపల్లి మండలాల పరిధిలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, విచారిస్తే బయట పడతాయని పలువురు అంటున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.