Inter-ministerial team : ఇదీ.. మా గోడు!
ABN , Publish Date - Jun 21 , 2024 | 12:29 AM
ఏ పంట పెట్టినా నష్టమే. వర్షాలే లేవు. పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదు. ప్రభుత్వ పథకాలు సరిగా అందడం లేదు. ఉపాధి పని దినాలు కూడా సరిపోవడం లేదు. నలుగురైదుగురు ఉన్న కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కేటాయించారు. ఆ తరువాత పనులు ఇవ్వడంలేదు. దూర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు వెతుక్కుంటున్నాం. పంటలు లేవు.. పశుగ్రాసం లేదు. ప్రభుత్వం ఇచ్చే దాణామృతంలో నాణ్యత లేదు. గడ్డి, దాణామృతాన్ని బయట కొనాల్సి వస్తోంది. పాల దిగుబడి గణనీయంగా తగ్గింది. తాగునీటికి బోర్లు వేస్తే ఉప్పునీరు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని ఆదుకోండి.....
వెళ్లి కేంద్రానికి చెప్పండి..!
సాయం చేయకుంటే సేద్యం చేయలేం
పంట సాగుచేస్తే పెట్టుబడీ రావడం లేదు
పశువులకు గడ్డిలేక పాల దిగుబడి తగ్గింది
ఉపాధి పనిదినాలు సరిపోక వలస వెళుతున్నాం
కేంద్ర బృందం ఎదుట అన్నదాతలు, కూలీల ఆవేదన
ఉరవకొండ, కణేకల్లు మండలాల్లో పర్యటించిన బృందం
ఏ పంట పెట్టినా నష్టమే. వర్షాలే లేవు. పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదు. ప్రభుత్వ పథకాలు సరిగా అందడం లేదు. ఉపాధి పని దినాలు కూడా సరిపోవడం లేదు. నలుగురైదుగురు ఉన్న కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కేటాయించారు. ఆ తరువాత పనులు ఇవ్వడంలేదు. దూర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు వెతుక్కుంటున్నాం. పంటలు లేవు.. పశుగ్రాసం లేదు. ప్రభుత్వం ఇచ్చే దాణామృతంలో నాణ్యత లేదు. గడ్డి, దాణామృతాన్ని బయట కొనాల్సి వస్తోంది. పాల దిగుబడి గణనీయంగా తగ్గింది. తాగునీటికి బోర్లు వేస్తే ఉప్పునీరు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని ఆదుకోండి..
ఇదీ.. జిల్లా రైతుల గోడు. కేంద్రం నుంచి వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ బృందం ఎదుట కష్టాలను ఏకరువు పెట్టారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ ఎంతటి సంక్షోభంలో ఉన్నాయో కళ్లకు కట్టారు. ప్రభుత్వ సాయం అందకపోతే వ్యవసాయం చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను జిల్లా అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. ఇక్కడి పరిస్థితులను కేంద్రానికి నివేదిస్తామని కరువు బృందం రైతులకు తెలిపింది.
ఉరవకొండ/కణేకల్లు, జూన 20: వర్షాభావం కారణంగా గత ఏడాది రబీ సీజనలో సాగు చేసిన ప్రధాన పంట పప్పుశనగ సహా అన్ని పంటలు దెబ్బతిన్నాయని, పూర్తిగా నష్టపోయామని కేంద్ర కరువు బృందానికి జిల్లా రైతులు తెలియజేశారు. ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల, కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామాల్లో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రితేష్ చౌహాన నేతృత్వంలోని పొన్నుస్వామి, సునీల్ దూబే బృందం గురువారం పర్యటించింది. పెద్ద కౌకుంట్లలో వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషనను పరిశీలించింది. రబీలో జరిగిన పంటనష్టాన్ని కళ్లకు కట్టే ఫొటోలను కేంద్ర బృందానికి జిల్లా అధికారులు చూపించారు. అనంతరం స్థానిక రైతులతో కేంద్ర బృందం మాట్లాడింది.
క్షేత్రస్థాయి పరిశీలన..
ఉరవకొండ మండలం నింబగల్లులోని సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్‌ను కేంద్ర బృందం పరిశీలించింది. వర్షాభావంలో నీటి లభ్యత లేకపోవడంతో మూడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లు ఎండిపోయాయని స్థానిక అధికారులు వారికి వివరించారు. అక్కడి నుంచి కణేకల్లు మండలం సొల్లాపురానికి చేరుకుని, పప్పుశనగ పంటనష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషనను కేంద్ర బృందం పరిశీలించింది. అనంతరం అక్కడి రైతులతో మాట్లాడింది. గత ఏడాది వర్షాభావంతో పప్పుశనగ పంట పూర్తిగా ఎండిపోయిందని రైతులు నాగభూషణం, బుచ్చిరెడ్డి, మల్లికార్జున కేంద్ర కరువు బృందం సభ్యుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పంటనష్ట పరిహారం అందించి ఆదుకోవాలని విన్నవించారు.
వ్యవసాయం చేయలేం..
రబీలో 1.50 ఎకరాలలో పప్పుశనగ పంట సాగు చేశాను. వర్షాభావం, తెగుళ్లతో పంట పూర్తిగా దెబ్బతింది. వర్షం వచ్చి ఉంటే ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. 20 కేజీల దిగుబడి కూడా రాలేదు. ఎకరానికి రూ.15 వేల దాకా పెట్టుబడి పెట్టాం. తీవ్రంగా నష్టపోయాము. మమ్మల్ని ఆదుకోకపోతే వ్యవసాయం చేయలేము. పప్పుశనగకు ఫసల్ బీమాను వర్తింపజేయాలి. మద్దతు ధరను పెంచాలి. పశుగ్రాసం లేక ఇబ్బంది పడుతున్నాం. ట్రాక్టర్ గడ్డిని రూ.10 వేలకు కొనుగోలు చేశాం. పశు పోషణ కూడా భారంగా మారింది.
- రామాంజనేయులు, కౌకుంట్ల
కేంద్రానికి చెప్పండి..
కరువు పరిస్థితుల కారణంగా తాగునీరు, పశుగ్రాసానికి ఇబ్బందులు పడుతున్నాం. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని ఆదుకోవాలి. పశుగ్రాసం దొరక్క పాడి దాగుబడి తగ్గుతోంది. రెండు కేజీల వరిగడ్డి రూ.30కు కొంటున్నాము. నాణ్యత లేని దాణామృతం ఇస్తున్నారు. దీంతో పశువులు తినడం లేదు.
- కృష్ణారెడ్డి, కౌకుంట్ల
రూ.50 వేలు నష్టపోయా..
నాకు 3.65 ఎకరాల పొలం ఉంది. అందులో పప్పుశనగ సాగు చేశాను. ఎకరానికి రూ.20 వేల వరకూ పెట్టుబడి ఖర్చు వచ్చింది. వర్షాలు లేనికారణంగా దిగుబడి కేవలం 50 కేజీలు వచ్చింది. వాటిని విక్రయిస్తే రూ.2500 చేతికొచ్చింది. వ్యవసాయం చేసినందుకు ఒక్క రబీ సీజనలోనే రూ.50 వేలు నష్టపోయాను. దాన్ని ఎలా పూడ్చుకోవాలి..?
- నాగభూషణం, సొల్లాపురం
పని దినాలను పెంచాలి..
మా ఇంట్లో నలుగురం ఉపాధి పనులకు వెళుతున్నాం. మా జాబ్‌కార్డుకు కేటాయించిన వంద రోజుల పని దినాలు త్వరగా పూర్తయ్యాయి. ఇంకా పనులు చేయాలని ఉన్నా వంద రోజులు ముగియడంతో పిలవడం లేదు. దీంతో పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. మాలాంటి కుటుంబాలకు పని దినాలు పెంచాలి.
- సత్తార్, సొల్లాపురం
పాడి రైతులను ఆదుకోవాలి..
పశుగ్రాసం దొరక్క పాల దిగుబడి తగ్గుతోంది. పాలను తక్కువ ధరకే ప్రైవేట్ డైరీలకు విక్రయిస్తున్నాం. దాణా నాణ్యత లేక పశువులు తినడం లేదు. గతంలో మొక్క జొన్నతో దాణా తయారు చేసేవారు. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. దీంతో మార్కెట్‌లో దాణా కొనాల్సి వస్తోంది. పశుగ్రాసం కొరతను తీర్చాలి. గడ్డి విత్తనాలను సబ్సిడీతో ఇవ్వాలి. మాకు ప్రభుత్వ సాయం అందడం లేదు.
-ఆంజనేయులు, కౌకుంట్ల
తాగునీరు ఇవ్వండి..
మా ప్రాంతమంతా నల్లరేగడి భూములే ఉన్నాయి. బోర్లు వేస్తే కేవలం ఉప్పునీరు వస్తోంది. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించండి.
- మల్లికార్జున, సొల్లాపురం
నివేదికలు తయారు చేస్తాం..
కరువు బృందం పర్యటిస్తున్న ప్రాంతంలో రైతులు మా దృష్టికి తీసుకొస్తున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నివేదికలు తయారు చేస్తున్నాం. రైతులు చెబుతున్న అంశాలను నమోదు చేసుకుని.. కరువు బృందానికి వివరించి, పరిష్కార మార్గలను కూడా చెబుతున్నాం.
- కేతనగార్గ్, జాయింట్ కలెక్టర్
ఎమ్మెల్యేల తరఫున వినతిపత్రాలు
కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామానికి వచ్చిన కరువు బృందానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తరఫున టీడీపీ నాయకులు కళేకుర్తి సుదర్శన, శరభనగౌడ్, వెంకటేచౌదరి వినతిపత్రం అందజేశారు. జిల్లా రైతులు ఏటా కరువుకాటకాలతో అల్లాడిపోతున్నారని, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని కోరారు. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఈ జిల్లాలో రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని అన్నారు. ఇక్కడి ప్రజలను ఆదుకునేందుకు విరివిగా నిధులు మంజూరు చేయించాలని కోరారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తరఫున ఆయన కుమారుడు యశ్వంత నియోజకవర్గ సమస్యలను కరువు బృందానికి వివరించారు.
ఇదేం తీరు..?
కేంద్ర బృందం పర్యటనపై గందరగోళం
అర్ధరాత్రి షెడ్యూల్ మార్చిన అధికారులు
అనంతపురం అర్బన, జూన 20: కేంద్ర కరువు బృందం పర్యటన విషయంలో జిల్లా అధికారుల తీరు గందరగోళానికి దారితీసింది. విడపనకల్లు మండలం మాళాపురం, వజ్రకరూరు మండలం గూళ్యపాల్యం గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటిస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అక్కడి అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ తర్వాత బుధవారం అర్ధరాత్రి ఉన్నట్లుండి షెడ్యూల్‌కు మార్చేశారు. ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల, కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామాల్లో పర్యటించేలా మార్పులు చేశారు. ఈ విషయాన్ని గురువారం తెల్లవారుజామున ఆయా మండలాల అధికారులకు ఫోన చేసి తెలియజేశారు. కొందరికి వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం ఇచ్చారు. షెడ్యూల్ మారడంతో ఉరవకొండ, కణేకల్లు మండలాల అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. కేంద్ర బృందం వచ్చేలోగా రైతులతో ముఖాముఖి, పంటనష్టం ఫొటో ఎగ్జిబిషన ఏర్పాటు చేసేందుకు తంటాలు పడ్డారు. కేంద్ర కరువు బృందం జిల్లా పర్యటన నేపథ్యంలో వారం రోజులుగా జిల్లా ఉన్నతాధికారులు సమాలోచనలు జరిపారు. తీరా వారు వచ్చాక గందరగోళం సృష్టించారు. షెడ్యూల్ మారిన విషయాన్ని మీడియాకు కూడా సకాలంలో తెలియజేయలేదు. సమాచార శాఖ వాట్సాప్ గ్రూప్‌లో గురువారం ఉదయం 10 గంటలకు నింపాదిగా విషయాన్ని తెలియజేశారు. అధికారుల తీరుపై రైతు సంఘాల నాయకులు, రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....