AP News: ఎమ్మెల్యే, బామర్ది మాఫియా రాజ్యం.. కడపలో ముంబైని తలపించేలా అరాచకాలు
ABN , Publish Date - Mar 05 , 2024 | 04:33 AM
కడప జిల్లాలోని ఆ నియోజకవర్గ కేంద్రం.. రాష్ట్రంలోనే ఓ బ్రాండ్. బిజినె్‌సకు అడ్డా. గోల్డ్ మార్కెట్ నుంచి వస్త్ర, కిరాణా వస్తువుల వరకూ ఇక్కడి నుంచి సీమ జిల్లాలకే కాదు..
ఎమ్మెల్యే, బామ్మర్ది గారి మాఫియా రాజ్యం
కడప జిల్లాలోని ఆ నియోజకవర్గ కేంద్రానికి.. గోల్డ్ బిజినెస్‌లో రెండో ముంబైగా పేరు. అలాగే ముంబైలో ఉండే కొన్ని అవలక్షణాలు ఇక్కడకు పాకాయి. స్థానిక ఎమ్మెల్యే తన బామ్మర్దిని అడ్డం పెట్టుకుని ముంబై తరహాలో మాఫియాకు తెరలేపారనే ప్రచారం ఉంది. సదరు నాయకుడు తన అక్రమ సంపాదనకు ఏ వనరునూ వదులుకోరు. పైకి మాత్రం మైకు దొరికితే చాలు ‘నా పేదలు.. పేదల కోసమే’ అంటూ ఎనలేని ప్రేమ ఒలకబోస్తారు.
పేకాటే జీవితంగా...
సదరు నేత జీవితం పేకాటతోనే మొదలైందని, జూదం ఆడిస్తూ దాన్నే జీవనోపాధిగా మార్చుకున్నారని చెబుతారు. తొలినాళ్లలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ తరహాలో ఖాకీ దుస్తులు వేసుకుని రోడ్లపై తిరిగే వాహనాలను ఆపి బెదిరించి డబ్బులు వసూలు చేసేవారనే విమర్శ కూడా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించినపుడు సొంతిల్లు కూడా ఉండేది కాదు. ఇప్పుడు రూ.150 కోట్లకు పైగా పోగేశారు.
అడ్డొస్తే దాడులు, హత్య
అక్రమాలకు అడ్డొస్తే పోలీసులపైనా దాడులు తప్పవు. ఎస్‌ఐ, సీఐపైనే దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి. అక్రమాలు ప్రశ్నించిన టీడీపీ బీసీ నేత పట్టపగలే అత్యంత దారుణ హత్యకు గురయ్యారు.
కడప జిల్లాలో ముంబైని తలపించేలా అరాచకాలు
బెట్టింగ్‌లు, జూదం, కబ్జాలు, దాడులు
ఇసుక, భూ ఆక్రమణలు, సెటిల్మెంట్లు
ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తున్న వైనం
వ్యతిరేకంగా వార్తలు రాస్తే బూతులు
ఎస్సై, సీఐపై దాడి చేసినా దిక్కులేదు
ప్రశ్నించారని టీడీపీ బీసీ నేత హత్య
(కడప-ఆంధ్రజ్యోతి)
కడప జిల్లాలోని ఆ నియోజకవర్గ కేంద్రం.. రాష్ట్రంలోనే ఓ బ్రాండ్. బిజినె్‌సకు అడ్డా. గోల్డ్ మార్కెట్ నుంచి వస్త్ర, కిరాణా వస్తువుల వరకూ ఇక్కడి నుంచి సీమ జిల్లాలకే కాదు.. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వెళుతుంటాయి. అయితే నియోజకవర్గంలో ముంబై తరహాలో మాఫియా రాజ్యమేలుతోంది. బెట్టింగ్‌లు, జూదం, కబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, భూ ఆక్రమణలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, దాడులు, దందాలు.. అన్నీ ఇన్నీ కావు. వాటిని కట్టడి చేయాల్సిన వారే ప్రోత్సహిస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అరాచకాలు మరింత ఎక్కువయ్యాయని చెబుతారు. ‘నేనే రాజు, నేనే మంత్రి’ అన్నట్లుగా నియోజకవర్గాన్ని శాసించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాేస మీడియాను తిట్టడమే పనిగా పెట్టుకుంటారు. టీడీపీ ఇన్‌చార్జిపై తప్పుడు కేసు పెట్టి రెండు మార్లు జైల్లో పెట్టారు. ఎమ్మెల్యే గురించి స్థానికంగా పుంఖానుపుంఖాలుగా చెబుతారు. ఆయన బయటికి మాత్రం నీతి, నిజాయితీ, ధర్మం అంటూ పెద్ద పెద్ద కటింగ్‌లు ఇస్తారు. ఆ ఉపన్యాసాలు చూసి పేదల పాలిట పెన్నిది అన్నట్లుగా కవరేజ్ చేస్తారు. తొలినాళ్లలో జూదం, బలవంతపు వసూళ్లు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు. 1996-97లో కాంగ్రెస్ కార్యకర్తగా మాజీ ఎమ్మెల్యే వద్ద చేరారు. కౌన్సిలర్‌గా ఉన్న తన మేనమామ అకాల మరణంతో ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2005లో తనకు మునిసిపల్ చైర్మన్ టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తితో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. 2008లో టీడీపీలో చేరారు. జగన్ పార్టీ పెట్టాక ఆయన వెంట నడిచారు. 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తన విశ్వరూపం చూపించారు. అడ్డగోలుగా అక్రమ సంపాదనకు తెరలేపారు.
అడ్డగోలుగా ఆక్రమణలు
ఎమ్మెల్యే సోదరుడు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. ఎమ్మెల్యే, ఆయన బామ్మర్ది, సోదరుడు చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. 2019 తరువాత బీసీలు, ఆర్య వైశ్యులకు చెందిన కోట్లాది రూపాయల విలువ చేేస భూములు లాక్కుని కోట్లు గడించారనే ప్రచారం ఉంది. వాగులు, వంకలు, కాల్వలు, కుంటలు, దేవుడిమాన్యం, చుక్కల భూములు ఇలా అన్నింటినీ ఆక్రమించి చుట్టూ వెంచర్లు వేసి జనాలకు అంటగట్టారని అంటారు. ఓ లింక్ కెనాల్‌కు సంబంధించి సుమారు రూ.5 కోట్ల విలువ చేసే 2.5 ఎకరాలను ఆక్రమించేసి తన కుటుంబీకులకు చెందిన వెంచర్లు కలిపేసి అమ్ముకున్నట్లు చెబుతారు. చర్చి భూములకు చెందిన 5 ఎకరాలు స్వాహా చేసినట్లు ప్రచారం ఉంది. ఎమ్మెల్యే ఇటీవల నిర్మించుకున్న ఇంటికి ఎదురుగా ఉన్న 4 ఎకరాల ఆలయ భూములను ఆక్రమించుకుని రోడ్డు వేయించుకున్నారు.
బెట్టింగ్, జూదం, ఇసుక
క్రికెట్ బెట్టింగ్‌కు ముంబై అడ్డా అయితే ఇప్పుడు నియోజకవర్గం కేరా్‌ఫగా మారిందంటారు. ఎమ్మెల్యే తన బావమరిది ఆధ్వర్యంలో టీ-20, వన్డే, ఐపీఎల్ మ్యాచ్‌లకు బెట్టింగ్‌లు నిర్వహిస్తారని చెబుతారు. ఈ వ్యవహారంపై యువగళం పాదయాత్రలో లోకేశ్ విమర్శలు చేశారు. రికార్డింగ్ మ్యాచ్‌కు కూడా ఎమ్మెల్యే బెట్టింగ్ కట్టారని, ఆయన పేరు బెట్టింగ్ రెడ్డి అంటూ ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఇక మట్కా, జూదం ఇతరత్రా కార్యక్రమాలన్నీ సదరు నేత అడ్డాలోనే నిర్వహించారనే టాక్ ఉంది. ఇక పెన్నానది నుంచి ఇసుకను అడ్డగోలుగా తన అనుచరుల ద్వారా తరలించి కోట్లాది రూపాయలను కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.200 కోట్ల ఇసుక బొక్కేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న ఎస్‌ఐపై రాళ్ల దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక జగనన్న కాలనీల పేరుతో ేసకరించిన భూములు ఎమ్మెల్యేకు కల్పతరువుగా మారాయి. నివాసయోగ్యానికి పనికిరాని చౌడు భూములను ఎకరాకు రూ.40 లక్షల చొప్పున ప్రభుత్వానికి అమ్మి కమీషన్ల రూపంలో కొట్టేశారని ప్రచారం ఉంది. మరో ప్రాంతంలో ఎకరా రూ.30 లక్షలతో 30 ఎకరాలు కొనుగోలు చేసి జగనన్న కాలనీలకు అమ్మేశారు. అగ్రిమెంట్ల ద్వారానే రూ.20 కోట్లు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. విలువైన చుక్కల భూములను రాత్రికి రాత్రి సెట్ చేశారంటారు.
టీడీపీ బీసీ నేత దారుణహత్య
నియోజకవర్గానికి చెందిన చేనేత కులస్తుడు, టీడీపీ అధికార ప్రతినిధిని అత్యంత దారుణంగా హత్య చేశారు. జగనన్న కాలనీల లేఅవుట్ల కోసం ేసకరించిన 400 ఎకరాల్లో స్కాం జరిగిందని, అలాగే ఎమ్మెల్యే ఇసుక దందాపై విచారణ జరిపించాలంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పట్టపగలే అత్యంత దారుణ హత్యకు గురయ్యారు. ఎమ్మెల్యే అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రచారం ఉంది. సదరు నాయకుడు ఎన్నో దౌర్జన్యాలకు పాల్పడ్డారు. జూదంపై కన్నెర్రజేసిన ఓ సీఐపై ఆయన దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా విద్యాసంస్థలు నిర్వహించిన ఓ వ్యక్తికి, వేరేవారికి లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. వారి నుంచి కాపాడాలని విద్యాసంస్థల అధినేత ఎమ్మెల్యే వద్దకు వెళ్లగా... ‘మీ ఆస్తులు నా పేరు మీద రాయండి.. అవి ఎక్కడికీ పోవు’ అంటూ అభయమిచ్చి వాటిని కొట్టేసినట్లు ప్రచారం ఉంది. ఓ గోడౌన్ యజమాని ఆర్థిక నష్టాలతో ఆత్మహత్య చేసుకోగా.. ఆయనకు డబ్బు ఇచ్చిన బాధిత రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఆ యజమాని ఆస్తులను రాయించుకున్నట్లు ప్రచారం ఉంది. విద్యుత్ సబ్‌స్టేషన్‌లలో ఆపరేటరు, ఇతరత్రా పోస్టుల కోసం కొందరి నుంచి రూ.8-10 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఓ కౌన్సిలర్ భర్త ఆక్రమించిన స్థలానికి అనుకూలంగా ఉండేందుకు పెద్దఎత్తున అమ్యామ్యాలు తీసుకున్నట్లు ప్రచారం ఉంది. మరో బీసీ కుల సంఘం నాయకుడికి సంబంధించి మున్సిపాలిటీలో వివాదాన్ని సెటిల్ చేేసందుకు పెద్దఎత్తున డబ్బు తీసుకున్నట్లు చెబుతారు. ఓ మహిళా విద్యాసంస్థ యాజమాన్యం తన భూములు విక్రయించిన దానిలో రూ.3 కోట్లు కమీషన్ తీసుకున్నట్లు ప్రచారం ఉంది. మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో రోడ్ల విస్తరణలో భూములు పోకుండా ఉండేందుకు భారీగా కొట్టేసినట్లు ఆరోపణలున్నాయి.