Share News

రాజధాని పనులు చకచకా!

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:04 AM

నవ్యాధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల శాశ్వత భవనాల పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

రాజధాని పనులు చకచకా!

మొదలైన శాశ్వత సచివాలయ పనులు

భారీ మోటర్లతో నీటిని తోడుతున్న అధికారులు

ఐదేళ్లపాటు నీటిలో నానబెట్టిన జగన్‌ ప్రభుత్వం

గుంటూరు, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): నవ్యాధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల శాశ్వత భవనాల పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి నిధులు విడుదల కావడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి. 2019 ఎన్నికలకు ముందు ఆగిపోయిన రాష్ట్ర సచివాలయం శాశ్వత భవన సముదాయ నిర్మాణ పనులు తిరిగి మొదలు పెట్టేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా, అది పూర్తయ్యేలోగా నిలిచి ఉన్న నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయ భవనాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని భావించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం 40 నుంచి 50 అంతస్తులు ఉండేలా 5 భవనాల (టవర్ల) సముదాయాన్ని నిర్మించాలని భావించింది. సీఎం చంద్రబాబు 2018 డిసెంబరు 27న నిర్మాణ పనులను ప్రారంభించారు. అత్యంత ఎత్తయిన ఐదు టవర్లతో డయా (రెండు వరుసల) గ్రిడ్‌ విధానంలో వాటిని నిర్మించేందుకు పనులు మొదలుపెట్టారు. అసెంబ్లీ భవన ప్రాంగణంలో 69.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాటి నిర్మాణానికి రూ.4,890 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. మళ్లీ ఆరేళ్ల తర్వాత సరిగ్గా అదే సమయానికి ఇప్పుడు ముందస్తు పనులు మొదలు పెడుతుండటం విశేషం.


ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ రికార్డు: భారీ భవనాలకు కీలకమైన పునాదుల నిర్మాణాన్ని కీలకంగా తీసుకున్న ప్రభుత్వం అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. నిర్మాణ సంస్థ అయిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(ఎన్‌సీసీ) మూడు రోజుల్లో, అంటే 72 గంటల్లో 10,816 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, దాన్ని 66 గంటల్లోనే పూర్తిచేశారు. ఒక కార్యాలయం కోసం దేశంలో నిర్మించిన అతిపెద్ద రాఫ్ట్‌గా సచివాలయ పునాదులు రికార్డులకెక్కాయి. డిసెంబరు 29న మొదలైన ర్యాఫ్ట్‌ నిర్మాణం 66 గంటలు నిర్విరామంగా సాగి డిసెంబరు 31కి పూర్తయింది. 13 అడుగుల లోతులో వేసిన ఈ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు ప్రపంచ ప్రఖ్యాత ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్‌ సంస్థ ప్రణాళిక రూపొందించింది. షాపూర్జీ- పర్లోంజి సంస్థ ఆ రికార్డును సాధించింది. అంతటి నిర్మాణాన్ని గత వైసీపీ ప్రభుత్వం నీటిపాలు చేసింది. జగన్‌ నిర్వాకంతో నీటిపాలైన సచివాలయ భవన సముదాయ పునాదుల పటిష్ఠతపై తాజాగా కూటమి ప్రభుత్వం అధ్యయనం చేయించింది. ఐఐటీ హైదరాబాద్‌ బృందం ఈ ఏడాది ఆగస్టులో నీటి లోపల ఉన్న పునాదులను పరిశీలించి. పునాదులకు ఎటువంటి ఢోకా లేదని, తదుపరి నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని నివేదికలో పేర్కొంది. దీంతో సచివాలయ టవర్ల పునాదులను మింగేసిన నీటిని తొలగించే పనులను అధికారులు బుధవారం ప్రారంభించారు. మూడు ట్రాక్టర్ల ఇంజన్లతో భారీ మోటర్లను అనుసంధానించి నీటిని తోడుతున్నారు. ఆ నీటిని పాలవాగులో కలుపుతున్నారు. అక్కడినుంచి కృష్ణానదిలోకి వదిలేస్తారు.

Updated Date - Dec 26 , 2024 | 05:04 AM