AP Cabinet: అలా వచ్చి.. ఇలా వాలిపోతున్నారు!
ABN , Publish Date - Jul 11 , 2024 | 04:04 AM
‘గత జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసినవారిని పేషీల్లోకి తీసుకోవద్దు’ అని కొత్త మంత్రులతో జరిగిన తొలి భేటీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. ‘గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు ఉంటే అంత ప్రయారిటీ’ ఇస్తామని ఎన్నికల సందర్భంలో అప్పటి విపక్ష నేత లోకేశ్ వ్యాఖ్యానించారు. కానీ, వారి మాటలకు భిన్నంగా కొందరు కొత్త మంత్రుల పేషీల్లోకి..
మంత్రుల పేషీల్లోకి వైసీపీ వీరభక్తులు
పీఎ్‌సలు, ఓఎస్డ్డీలుగా కీలకశాఖల్లో పాగా
‘గనుల దొంగ’కు ఏకంగా పట్టాభిషేకం
మైనింగ్ మంత్రి ఓఎస్డీగా రాజాబాబు
నియామకానికి కదులుతున్న పావులు
గనులశాఖలో పనులు చక్కబెట్టుకునేందుకు
తెర వెనుక కాకినాడకు చెందిన నేత చక్రం
విషయం తెలిసి అప్రమత్తమైన ప్రభుత్వం
ఆ నేత వ్యవహారంపై మొదలైన విచారణ!
రామతీర్థం ఘటనలో బాబును అరెస్టుచేసిన అనిల్
హోంమంత్రి అనిత పేషీలో ఓఎస్డీగా చేరిన వైనం
జగన్ భక్తుడిగా ఉద్యోగ సంఘం నడిపిన వెంకట్రామిరెడ్డి
ఆయన అనుచరుల్లో కొందరికి చాన్స్ ఇచ్చిన మంత్రులు
అదే బాటలో గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు
ఉలిక్కిపడ్డ సర్కారు.. వారందరిపైనా ఇంటెలిజెన్స్ నివేదికకు ఆదేశం
అయితే, ఆ నివేదికనూ ప్రభావితం చేస్తున్న కొందరు ఘనులు
భూతానికి భయపడి ఎవరూ రావడంలేదనీ, భయం వద్దు.. దాన్ని భూస్థాపితం చేస్తానని తాను చెబుతున్నానని చంద్రబాబు పదేపదే పేర్కొంటున్నారు. కానీ, ఆ భూతం ఏకంగా పేషీల్లోకి చొరబడి, కీలక ఫైళ్లు తిరగేసే పరిస్థితి వస్తే..!? ఇంతకీ వాళ్లంతా ఎలా వస్తున్నారు? లోపం ఎక్కడుంది? ఇదంతా వ్యవస్థల విధ్వంస ఫలితమేనా?
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘గత జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసినవారిని పేషీల్లోకి తీసుకోవద్దు’ అని కొత్త మంత్రులతో జరిగిన తొలి భేటీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. ‘గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు ఉంటే అంత ప్రయారిటీ’ ఇస్తామని ఎన్నికల సందర్భంలో అప్పటి విపక్ష నేత లోకేశ్ వ్యాఖ్యానించారు. కానీ, వారి మాటలకు భిన్నంగా కొందరు కొత్త మంత్రుల పేషీల్లోకి వైసీపీ పీఎ్‌సలు, ఓఎస్డీలు వాలిపోతున్నారు. గత ఐదేళ్లూ వైసీపీ హయాంలో జరిగిన అన్ని అరాచకాలూ, అక్రమాలూ, దౌర్జన్యాల్లో భాగస్వామ్యం ఉన్న అధికారులే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలోనూ మంత్రుల వద్ద పాగా వేస్తున్న తీరు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందులోనూ.. అత్యంత వివాదాస్పద అధికారిగా వైసీపీ హయాంలో పనిచేసిన రిటైర్డు ఐఏఎస్ రాజాబాబు ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేషీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు విస్మయపరుస్తున్నాయి. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో వేధింపులు, కేసులకు గురైనవారిని అవే కారణాలతో ప్రభుత్వం పక్కన పెడుతుండటం గమనార్హం.
చెక్ పెట్టాల్సిన వారికే చాన్స్!
మంత్రికి పీఎస్ అంటే మంత్రితో సమానం. పీఎస్ ఫైలు చూసి బ్రీఫ్ చేసినమేరకు మంత్రి నిర్ణయం తీసుకుంటారు. అలాంటి ముఖ్యమైన పోస్టులో నియామకం అనేది ఒక పెద్ద ప్రక్రియ. సాధారణంగా ఈ నియామకాల వెనుక కింగ్ మాస్టరు ఒకరు ఉండి.. ఎవరిని నియమించుకోవాలనేది మంత్రులకు వారే నిర్దేశిస్తుంటారు. కానీ, ఇప్పుడు గత ప్రభుత్వానికి పూర్తి విరుద్ధమైన సర్కారు రాష్ట్రంలో ఉంది. జగన్ ఆనవాళ్లు ఏవీ ప్రభుత్వ పాలనలో ఉండరాదనే దిశగా గట్టి అడుగులు పడుతున్నాయి. అయినా.. వైసీపీ వీరభక్తులు కొందరు పేషీల్లోకి వచ్చేస్తుండటం ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి మంత్రుల్లో చాలామంది కొత్తవారు. ఈ విషయాల్లో వారికి అవగాహన లేదు. ఎమ్మెల్యేలు, సహ మంత్రులు సూచించినవారిని తీసేసుకుంటున్నారు. కానీ, గతంలో పాలించినప్పుడు చంద్రబాబు పీఎ్‌సలు, ఓఎస్డీల నియామకంలో జాగ్రత్తలు తీసుకునేవారు. వెరిఫికేషన్ లేకుండా నేరుగా పేషీల్లోకి ఎవరినీ అనుమతించేవారు కాదు. కానీ, ఎందువల్లో ఈసారి పీఎ్‌సలను మంత్రులు నేరుగా పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో నలుగురైదుగురు మంత్రుల వద్దకు వైసీపీ వీరభక్తులు చేరిపోయారని తెలిసింది. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వం ఉలిక్కిపడింది. దీనిపై ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది. అయితే, ఈ ప్రక్రియను కూడా కొందరు ఘనాపాటీలు ప్రభావితం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మంత్రికి మంచిపేరు వచ్చినా, చెడ్డ గుర్తింపు వచ్చినా అది పీఎ్‌సలు, ఓఎస్డీల వల్లే జరుగుతుంది. అందువల్ల ఉన్నంతలో సమర్థులను, నిజాయితీపరులను మాత్రమే పేషీల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. దీనికి భిన్నంగా కొన్న శాఖల్లో పరిణామాలు ఉండటం పట్ల ఆందోళన చెందుతున్నాయి.
గతమంతా గలీజే...
రాజాబాబు గత ప్రభుత్వంలో గనుల శాఖలో జేడీ కేడర్‌లో పనిచేశారు. ఈ అధికారి గత ఐదేళ్లూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. గనుల గజదొంగ అంటూ అప్పట్లో ఈయనపై టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. మాంగనీస్ టెండర్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను దారిమళ్లించి దోచుకున్న కేసులో తీవ్ర ఆరోపణలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఈ పాటికే రిటైర్ అయిన ఆ అధికారిని నిధుల దోపిడీ కేసులో ఇబ్రహీంపట్నం పోలీసులు ఎప్పుడు అరె్‌స్టచేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. అలాంటి వ్యక్తిని గనుల శాఖ మంత్రి ఓఎ్‌సడీగా నియమించే ఫైలు మంగళవారం ముందుకు కదిలింది. వాస్తవానికి, రాజాబాబు దందాలపై గత రెండున్నర నెలలకాలంలో ‘ఆంధ్రజ్యోతి’లో వార్తలు వచ్చారు. అవి ఇప్పుడు సోషల్‌మీడియాలో, అధికారపార్టీ వాట్స్‌పగ్రూ్‌పల్లో విపరీతంగా సర్క్యూలేట్ అవుతున్నాయి. ఇలాంటి వ్యక్తిని ఓఎస్డీగా ఎలా నియమించుకుంటారంటూ అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గనుల శాఖలో ఇటీవలి వరకు జాయింట్ డైరెక్టర్ హోదాలో ఆయన పనిచేశారు. ఆయన హయాంలోనే మాంగనీస్ టెండర్ల సందర్భంగా కాంట్రాక్టర్లు సమర్పించిన సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము కోట్లాది రూపాయలు దారిమళ్లాయి. వాటిని గుంటూరులోని ఓ ప్రైవేటు ఇసుక కాంట్రాక్టర్ ఖాతాకు తరలించి ఆ తర్వాత విత్‌డ్రాచేశారు. ఆ సొమ్ముతో మంగళగిరిలో భారీగా బంగారం, ఇతర ఆభరణాలు కొన్నారు. కార్లు కొనుగోలు చే శారు. విషయం బయటకు పొక్కగానే చిన్న ఉద్యోగులను బలి చేశారు. ముగ్గురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై మోపి వారిపై ఇబ్రహీంపట్నంలో కేసుపెట్టి అరెస్ట్ చేయించారు. అయితే, ఉన్నతాధికారుల ఆమోదంతోనే ఆ నిధులు దారిమళ్లినట్లుగా ‘ఆంధ్రజ్యోతి’ గతనెల 11వ తేదీన ‘‘ గనుల శాఖలో తోడేళ్ల దందా’’ శీర్షికన వార్తను వెలుగులోకి తీసుకొచ్చింది ఆ తర్వాత గనుల ఫైళ్లను మాయం చేశారని మరో వార్తను ప్రచురించింది. నిధుల దారిమళ్లింపు కేసులో నాటి జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న రాజాబాబు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఎందుకంటే, నిధుల విడుదలకు ఆయన డాంగిల్‌ను వాడారు. ఆ తర్వాత వేలిముద్ర వేశారు. ఆ తర్వాతే గనుల డైరెక్టర్ వేలిముద్ర వేసి డాంగిల్ వాడినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై శాఖపరమైన విచారణకు ఆదేశించగా, అంతా తెలిసిన అధికారులే కావడంతో విచారణాధికారి చేతులెత్తేశారు. విచారణ నివే దిక ఇవ్వకుండానే వదిలేశారు. ఈ విషయాన్ని కూడా ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కేసును ఇబ్రహీంపట్నం పోలీసులు విచారిస్తున్నారు. రాజాబాబు పాత్రపై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఈ నేపఽథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం ఉంది. సరిగ్గా ఇదే సమయంలో కాకినాడకు చెందిన ఓ నేత... గనుల శాఖలో తన అవసరాల కోసం రాజాబాబును అక్కడ నియమించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలియగానే ఆ నేత విషయమై కూడా విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం.
వైసీపీ ఉద్యోగ నేత హడావుడి
సచివాలయంలో వైసీపీ ఆంతరంగికుడిగా, వైసీపీ వీరవిధేయ నేతగా పేరు తెచ్చుకున్న సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సన్నిహితులే అన్నిచోట్లా వాలిపోతున్నారు. వీరిలో కొందరికి ఇంటెలిజెన్స్ నివేదిక కూడా అనుకూలంగా రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరికొందరికి ఇంటెలిజెన్స్ నివేదిక అనుకూలించకపోయినా కొనసాగిస్తున్నారు. మరోవైపు గత ఐదేళ్లు టీడీపీ కోసం నిలబడిన వారిపై కేసులున్నాయంటూ పక్కన పెడుతుండటం గమనార్హం. ఎన్ని కేసులుంటే (రాజకీయ కక్ష సాధింపులతో పెట్టిన కేసులు) అంత ప్రయారిటీ అని మంత్రి లోకేశ్ గతంలో చెప్పినప్పటికీ అవేవీ ఆచరణలో కనపడడం లేదు. కక్షసాధింపులో భాగంగా పెట్టిన కేసులు ఇప్పుడు ప్రతిబంధకాలయ్యాయి. వివాదాస్పద పోస్టింగుల్లో ఎక్కువగా మంత్రులు అనిత, గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు, లోకేశ్, కొల్లు రవీంద్ర పేర్లు వినిపిస్తున్నాయి.
బాబుపై కేసుపెట్టిన పోలీసుకు హోంలో చోటు..
రామతీర్థం ఆలయానికి వెళ్లిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసులు పెట్టిన డీఎస్పీ పులిపాటి అనిల్ ఇప్పుడు హోంమంత్రి అనిత షేషీలో ఓఎస్డీగా చేరారు. అంతకుముందు రెండేళ్లపాటు అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ వద్ద ఆయన ఓఎస్డీగా చేశారు. అలాగే, అనిత పేషీలో సచివాలయ ఉద్యోగుల సంఘంలో పనిచేసిన వివాదాస్పద ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డి కుడిభుజం సాయికుమార్ అడిషనల్ పీఎ్‌సగా చేరారు. వైసీపీ వీరభక్తులంతా హోం పేషీలో చేరికతో కీలకమైన సమాచారం బయటకు పోదని గ్యారంటీ ఏముంది? పైగా సాయికుమార్‌కు ఇంటెలిజెన్స్ నుంచి క్లియరెన్స్ రావడం విచిత్రంగా ఉంది.
నెగెటివ్ రిపోర్టు అందినా లోకేశ్ పేషీలో...
విద్యాశాఖ మంత్రి లోకేశ్ పేషీలో ఓఎస్డీగా చేరిన ఆకుల వెంకటరమణపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ అధికారికి ఇంటెలిజెన్స్ నుంచి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అయినప్పటికీ లోకేశ్ పేషీలో కొనసాగుతున్నారు.
వైసీపీ అధికారికి గొట్టిపాటి చాన్స్
వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి వద్ద పీఏగా చేసిన రవీంద్ర ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి వద్దకు చేరారు. రవీంద్రను పీఏగా గొట్టిపాటి రవి నియమించుకున్నారు.
అప్పుడూ, ఇప్పుడూ పీఎస్ దర్జా....
వైసీపీ హయాంలో మంత్రిగా చేసిన చెల్లుబోయిన వేణుగోపాల్ వద్ద పీఎ్‌సగా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే ఉద్యోగి ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేషీలో అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఇక్కడా తానే పీఎస్ నంటూ అందరికీ చెప్పుకొంటున్నారు.