Share News

‘పొరుగు’ మద్యం.. అదే జోరు

ABN , Publish Date - Dec 26 , 2024 | 03:47 AM

కూటమి ప్రభుత్వం ప్రైవేటు మద్యం షాపుల పాలసీని ప్రవేశపెట్టాక పక్క రాష్ర్టాల మద్యానికి (నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌) పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని అంతా అనుకున్నారు.

‘పొరుగు’ మద్యం.. అదే జోరు

పక్క రాష్ట్రాల నుంచి వచ్చిపడుతున్న బాటిళ్లు

కొత్త పాలసీ వచ్చినా అడ్డుకట్ట పడలేదు

ఈ ఏడాది పట్టుబడింది 1.89 లక్షల లీటర్లు

గతేడాది పట్టుబడింది 71,365 లీటర్లే

ప్రభావం చూపుతున్న ధరలు, నాణ్యత

కొన్ని బ్రాండ్లపై ఇప్పటికీ అనుమానాలే

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వం ప్రైవేటు మద్యం షాపుల పాలసీని ప్రవేశపెట్టాక పక్క రాష్ర్టాల మద్యానికి (నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌) పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని అంతా అనుకున్నారు. ప్రభుత్వం కూడా తనకు ఆదాయం పెరుగుతుందని భావించింది. కానీ దానికి విరుద్ధంగా జరుగుతోంది. ఇప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లోకి భారీగా ఎన్‌డీపీఎల్‌ వచ్చిపడుతోంది. కొత్త ప్రైవేటు మద్యం పాలసీ వచ్చిన తర్వాత కూడా పలు జిల్లాల్లో ఎన్‌డీపీఎల్‌ భారీగా దొరుకుతోంది. ఈ నెలలో ఒక్క అనంతపురంలోనే 30 వేల సీసాల గోవా మద్యం పట్టుబడింది. అక్టోబరు నెలలో ఆదోనిలో కర్ణాటక మద్యం 14 కేసులు దొరికింది. అలాగే అటు చిత్తూరు జిల్లాకు తమిళనాడు మద్యం వస్తోంది. ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ పొరుగు మద్యం పూర్తిగా ఆగలేదు. ఇంకా ఏపీలో ధరలు కొంత ఎక్కువగానే ఉండటం కూడా ఎన్‌డీపీఎల్‌ రావడానికి ఓ కారణంగా చెబుతున్నారు. ఇటీవల హడావుడిగా ధరలు తగ్గించుకున్న బ్రాండ్లు.. నాణ్యతను కూడా తగ్గించాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.


ఈ ఏడాదిలో భారీగా ఎన్‌డీపీఎల్‌ సీజ్‌

ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు 1,89,686 లీటర్ల ఇతర రాష్ర్టాల మద్యాన్ని ఎక్సైజ్‌, పోలీసు శాఖలు సీజ్‌ చేశాయి. గతేడాది ఇదే సమయంలో 71,365 లీటర్ల మద్యం పట్టుబడింది. ఈ ఏడాది ఎన్‌డీపీఎల్‌ భారీగా పెరగడానికి సార్వత్రిక ఎన్నికలు కూడా ఓ కారణం. అయినప్పటికీ గతేడాది కంటే రెట్టింపు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ఇటీవల అనంతపురంలో దొరికిన సీసాలు కూడా కలిపితే ఈ ఏడాది పట్టుబడిన ఎన్‌డీపీఎల్‌ 2 లక్షల లీటర్లు దాటిపోతుంది. అలాగే ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లోకి పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం భారీగా వస్తోంది.

ఇంకా ఎందుకు వస్తోంది?: ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రావడానికి ప్రధాన కారణం మన రాష్ట్రంలో ధరలు అధికంగా ఉండటం. ఇక్కడి ధరలతో పోల్చినప్పుడు కొంత తక్కువకు వస్తుందంటే వినియోగదారులు ఎన్‌డీపీఎల్‌నే కొంటారు. అక్రమార్కులకు ఏపీలోని అధిక ధరలే కలిసివస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా ధరలు పెంచినప్పుడు ఎన్‌డీపీఎల్‌ ప్రవాహంలా వచ్చింది. అయితే ధరలు తగ్గాక కొంతమేర తగ్గింది. కానీ మంచి బ్రాండ్లు లేకపోవడంతో మళ్లీ భారీగా ఎన్‌డీపీఎల్‌ వచ్చిపడింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చినా మద్యం బ్రాండ్ల ధరలు అలాగే ఉన్నాయి. ఇటీవల ఓ పది బ్రాండ్లు ధరలు తగ్గించుకున్నాయి. మిగిలిన బ్రాండ్ల ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ధరల వ్యత్యాసం ఎన్‌డీపీఎల్‌ రావడానికి కారణమవుతోంది. ప్రభుత్వం క్వార్టర్‌ రూ. 99 మద్యం తెచ్చినా అది పూర్తిగా అందుబాటులో లేదు. డిమాండ్‌ భారీగా ఉండటంతో పరిమితంగానే సరఫరా చేస్తున్నారు. ఫలితంగా పక్క రాష్ర్టాల మద్యం వస్తోంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలైన గోవా, యానాంలలో సాధారణంగానే మద్యం ధరలు తక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడినుంచి వచ్చే ఎన్‌డీపీఎల్‌కు అడ్డుకట్ట పడట్లేదు.


నాణ్యతపై అనుమానాలు

ప్రభుత్వం నాణ్యమైన మద్యం పేరుతో రూ. 99 బ్రాండ్లు తీసుకొచ్చింది. మొత్తం అమ్మకాల్లో వాటి వాటా 30 శాతంగా ఉంది. మిగిలిన 70 శాతం బ్రాండ్లలో కొన్ని బ్రాండ్లపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ధరలు తగ్గించుకున్న ఒకట్రెండు పాపులర్‌ మద్యం బ్రాండ్లు నాణ్యత విషయంలో రాజీ పడుతున్నాయనే వాదన వినియోగదారుల నుంచి వినిపిస్తోంది. ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం ప్రమాణాలు పాటిస్తున్నా, గతంలో ఉన్న స్థాయి నాణ్యత అక్కర్లేదనే భావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై ఎక్సైజ్‌ శాఖ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్సైజ్‌ శాఖ ప్రతి కంపెనీ తయారుచేసే మద్యాన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉందా? లేదా? అని తనిఖీ చేస్తుంది. ముఖ్యంగా స్ర్టెంథ్‌ ఉందా? లేదా? అని పరీక్షించి, అది ఉంటే అనుమతిస్తుంది. ఆ మేరకు ప్రమాణాలు ఉన్నప్పటికీ గతంలో ఇచ్చిన నాణ్యత విషయంలో కొంతమేర రాజీపడుతున్నారని సమాచారం. దీనివల్ల ఆల్కహాల్‌ శాతం అలాగే ఉన్నా రుచి, ఇతరత్రా అంశాల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తోందని వినియోగదారులు అంటున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 03:47 AM