Anita, Nimmala : జగన్ నిర్లక్ష్యంతోనే బుడమేరుకు వరద
ABN , Publish Date - Nov 21 , 2024 | 04:11 AM
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం పాపం, నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలొచ్చాయని హోంమంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం పాపం, నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలొచ్చాయని హోంమంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. బుధవారం శాసనమండలిలో వైసీపీ సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్, రుహుల్లా అడిగిన ప్రశ్నకు మంత్రులు సమాధానం చెప్పారు. గత ఐదేళ్లలో బుడమేరు డైవర్షన్ కెనాల్ పనులు పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఒకేసారి 15వేల క్యూసెక్కులు రావడంతో గండ్లుపడి వరదలు వచ్చాయని నిమ్మల పేర్కొన్నారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ...‘విపత్తును ఎదిరించి, అధిగమించగల దార్శనికత, అనుభవం కలిగిన నాయకుడు సీఎం చంద్రబాబు ఈ సమయంలో ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల అదృష్టం’ అంటూ హోంమంత్రి చెబుతున్న సమయంలో వైసీపీ ఎమెల్సీ రుహుల్లా ‘మాట్లాడండి... మాట్లాడండి’ అంటూ ఎగతాళిగా అన్నారు. లోకేశ్ జోక్యం చేసుకొని... ‘అధ్యక్షా... సభ కంట్రోల్ తప్పుతోంది. మంత్రులు మాట్లాడుతుంటే ఎగతాళి చేస్తూ సభ్యుడు మాట్లాడటమేంటి?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.