Share News

విశాఖ స్టీల్‌కు మరో రూ.2,500 కోట్లు

ABN , Publish Date - Sep 21 , 2024 | 04:21 AM

ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుకు మరో రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.

విశాఖ స్టీల్‌కు మరో రూ.2,500 కోట్లు

కేంద్ర ఉక్కు శాఖ ప్రకటన

2 బ్లాస్ట్‌ఫర్నేస్‌లను నడపండి

నవంబరు నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తికి ఆదేశాలు

విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుకు మరో రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే గురువారం రూ.500 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మొదట విడుదల చేసిన నిధులను కేవలం చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని షరతు పెట్టింది. ఆ నిధుల వినియోగం బాధ్యత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు అప్పగించింది. తాజాగా ప్రకటించిన రూ.2,500 కోట్ల వినియోగంలోనూ ఎస్‌బీఐ కీలకంగా వ్యవహరించాలని సూచించింది. ఈ నిధులు ఈ నెల 23వ తేదీ నాటికి అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చింది. స్టీల్‌ప్లాంటులో మూడు బ్లాస్ట్‌ ఫర్నేసులు ఉండగా ముడి పదార్థాల కొరత కారణంగా రెండింటిని మూసేసి, ప్రస్తుతం ఒక్క దాంట్లోనే ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు నిధులు అందుబాటులోకి వస్తున్నందున రెండు బ్లాస్ట్‌ ఫర్నేసులను పూర్తిస్థాయిలో నడపాలని ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అందుకు అవసరమైన ముడి పదార్థాలు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. అన్ని విభాగాల్లోనూ నిర్వహణ (మెయింటెనెన్స్‌) పనులు చేపట్టి అక్టోబరు చివరి నాటికి పూర్తిచేసి, నవంబరు నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తి చేయాలని కోరింది.

మానవ వనరుల వ్యయం తగ్గించే యత్నం

స్టీల్‌ ప్లాంటులో మూడు బ్లాస్ట్‌ ఫర్నేసులకు రెండింటినే నడపాలని నిర్ణయించినందున అధికంగా ఉన్న ఉద్యోగులను ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు డిప్యుటేషన్‌పై పంపాలని నిర్ణయించింది. ఆ మేరకు జీతాల భారం తగ్గించుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఎన్‌ఎండీసీకి చెందిన నగర్‌నార్‌ ప్లాంటుకు డిప్యుటేషన్‌పై వెళ్లడానికి ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని ఎగ్జిక్యూటివ్‌ స్థాయి అధికారులను మరోసారి పిలుపునిచ్చింది. దీనిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇక్కడి జీతాలు ఇస్తారా?, అక్కడి జీతాలు ఇస్తారా?, కుటుంబం సంగతి ఏమిటి?, ఆ తరువాత పరిస్థితి ఏమిటి? అని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Updated Date - Sep 21 , 2024 | 04:21 AM