Share News

మరో బరితెగింపు!

ABN , Publish Date - Mar 20 , 2024 | 04:06 AM

కోడ్‌ వచ్చిందా... నియమావళి పాటించాలా? ఇవేవీ జగన్‌ సర్కారుకు పట్టదు. ‘పాత తేదీ’లతో నియమాలకు పాతరేసే పని మొదలుపెట్టారు.

మరో బరితెగింపు!

ఎన్నికల ముంగిట భారీ పందేరం

జింపెక్స్‌కు మంగంపేటలో 100 ఎకరాలు!

2008లో ఈ సంస్థకు భూ కేటాయింపు

బెరైటీస్‌ ప్రాసెసింగ్‌ ప్లాంటుకు నిర్ణయం

సకాలంలో ఏర్పాటు చేయకుండా వాయిదాలు

చివరకు హైకోర్టుకు చేరిన ప్లాంట్‌ వివాదం

కోర్టులో కేసు వెనక్కి తీసుకుంటామని..

వేరే చోట 100 ఎకరాలు ఇవ్వాలన్న కంపెనీ

ఇవ్వడం కుదరదన్న రెవెన్యూ శాఖపై ఒత్తిళ్లు

రంగంలోకి దిగిన ‘కడప’ వసూల్‌రాజా

ఎన్నికల కోడ్‌ కూసినా భూ పందేరానికి రెడీ

‘ఎన్నికల కోడ్‌ మీకే కానీ, మాకు కాదు’.. ఇదే జగన్‌ పాలసీ. ఎన్నికల షెడ్యూల్‌ అమల్లోకి రావడానికి కొన్ని గంటల ముందు ఆయన తన అస్మదీయ, సొంత మనుషుల కంపెనీలకు కోట్ల విలువైన భూములు కట్టబెట్టారు. ఇప్పుడు కోడ్‌ అమల్లోకి వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. ‘పాత తేదీ’లతో పందేరం చేస్తున్నారు.'

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కోడ్‌ వచ్చిందా... నియమావళి పాటించాలా? ఇవేవీ జగన్‌ సర్కారుకు పట్టదు. ‘పాత తేదీ’లతో నియమాలకు పాతరేసే పని మొదలుపెట్టారు. రూ.వేల కోట్ల విలువైన బెరైటీస్‌ నిల్వలున్న మంగంపేట ఏరియాలో జింపెక్స్‌ కంపెనీకి వంద ఎకరాల పందేరానికి రంగం సిద్ధం చేశారు. ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతోంది. ‘కంపెనీకి అర్జంటుగా 100 ఎకరాలు ఇవ్వండి’ అంటూ గనుల శాఖలోని ఓ ముఖ్య అధికారితో లేఖలు రాయించారు. భూమి ఇవ్వడం కుదరదని రెవెన్యూశాఖ ఇప్పటికే ఒకసారి తేల్చిచెప్పింది. అయినా సరే, మరోసారి తమ విన్నపాన్ని పరిశీలించాలని, ఆ సంస్థకు భూమి ఇవ్వడం చాలా ముఖ్యమని సర్కారు పేర్కొంది. సందట్లో సడేమియాగా ముఖ్యనేత వద్ద పనిచేస్తున్న వసూల్‌ రాజా కూడా రంగంలోకి దిగిపోయారు. ముఖ్యనేత చెప్పారంటూ ఆయన రెవెన్యూపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. ఆ కంపెనీపై హద్దుల్లేని ప్రేమ చూపించడానికి చాలా కారణాలే ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం...

16 ఏళ్లయినా అతీగతీలేని ప్లాంటు

ఉమ్మడి కడప జిల్లా మంగంపేట బెరైటీస్‌ గనులకు ప్రసిద్ధి. ప్రపంచంలోనే అత్యధిక బెరైటీస్‌ నిల్వలున్న ప్రాంతంలో ఇది మూడో స్థానంలో ఉంది. దక్షిణాసియాలో దీనిదే తొలిస్థానం. 2008లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)తో ‘జింపెక్స్‌’ అనే ప్రైవేటు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. తవ్వితీసిన బెరైటీ్‌సను ప్రాసెస్‌ చేసే బెనిఫికేషన్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీంతో ఆ సంస్థకు అప్పట్లో జీవో 863 ప్రకారం కొర్లకుంటలో 100 ఎకరాలు కేటాయించారు. ఒప్పందం ప్రకారం రెండు సంవత్సరాల్లో ప్లాంటు ఏర్పాటు చేయాలి. ఇది ఆ సంస్థ సొంతమేమీ కాదు. ఎండీసీకి.. జింపెక్స్‌ జాయింట్‌ వెంచర్‌ సంస్థగా ఉండేలా ఒప్పందం ఉంది. ఈ భూ కేటాయింపును వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఫలితంగా రెండేళ్లలో పూర్తికావాల్సిన ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో తమకు మరి కొంత గడువు ఇవ్వాలని జింపెక్స్‌ కోరింది. ఈ మేరకు 2014 మే 17 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈలోగా పర్యావరణ అనుమతులు, ఇతర ప్రభుత్వ లాంఛనాలను పూర్తిచేసుకోవాలని ఆ కంపెనీకి స్పష్టం చేశారు. అయినా, ఆ సంస్థ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోయింది. దీంతో ఈ భూమిని ఏపీఎండీసీ తన అవసరాలకోసం ఉపయోగించుకుంది. బెరైటీస్‌ నిల్వలను ఆ భూమిలో డంపింగ్‌ చేస్తోంది. ఎండీసీ ఆ భూమిని వినియోగించడాన్ని సవాల్‌ చేస్తూ జింపెక్స్‌ 2017లో హైకోర్టును ఆశ్రయించింది. భూ వినియోగంపై స్టేట్‌సకో ఇస్తూ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు ఇప్పటికీ కోర్టు పరిధిలోనే ఉంది. ఇప్పటికే 16 సంవత్సరాల కాలం గడిచిపోయింది. రెండుసార్లు ఆ సంస్థకు గడువు ఇచ్చినా ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయింది. కీలకమైన బెనిఫికేషన్‌ ప్లాంటును ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఏపీఎండీసీకి జరిగిన నష్టం ఎక్కువగానే ఉంది.

100 ఎకరాల భూమికి టెండర్‌

16 ఏళ్ల వ్యవధిలో బెరైటీస్‌ బెనిఫికేషన్‌ ప్లాంటు ఏర్పాటు చేయలేకపోయిన జింపెక్స్‌ సంస్థ ఇప్పుడు ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. తమకు మంగంపేటలోనే మరోచోట 100 ఎకరాల భూమిని కేటాయిస్తే హైకోర్టులో కేసును వెనక్కి తీసుకుంటామని ప్రతిపాదించింది. ఏరకంగా చూసినా ఈ ప్రతిపాదనకు విలువ లేదు. అయినా సరే... జింపెక్స్‌ కోరినట్లు మంగంపేటలో 100 ఎకరాలు కేటాయించేలా హడావుడిగా గనుల శాఖ నుంచి రెవెన్యూకు ప్రతిపాదనలు పంపించారు. ఇదంతా ఎన్నికల కోడ్‌ వచ్చాకే కావడం గమనార్హం. అయితే, ఈసీని మాయ చేసేందుకు పాత తేదీలతోనే దీనిని చేపడుతున్నట్టు తెలిసింది.

రెవెన్యూ తిరస్కరణ

జింపెక్స్‌ కోరుతున్నట్లుగా మరోచోట 100 ఎకరాల భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనను రెవెన్యూశాఖ తిరస్కరించింది. దీనికి పలు కారణాలను పేర్కొంది. ‘‘2008లోనే భూమిని కేటాయించాం. ఒప్పందం ప్రకారం 2010లో ప్రాజెక్టు అమల్లోకి రావాల్సి ఉన్నా అది జరగలేదు. 2014లో మరో రెండేళ్లపాటు గడువు పొడిగించినా ప్లాంటు ఏర్పాటు చేయలేకపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకొని ఎండీసీకి అప్పగించింది. కాబట్టి, ఆ భూమి స్థానంలో మరో చోట 100 ఎకరాలు కేటాయించడం కుదరదు. అలాంటి కేటాయింపు నిబంధనలకు వ్యతిరేకం. ప్రైవేటు, ప్రభుత్వానికి మధ్య వందల ఎకరాల భూమిని మార్చుకోవడం, బదలాయించడం సాధ్యంకాదు. కాబట్టి జింపెక్స్‌ కోరినట్లుగా 100 ఎకరాల కేటాయింపు సాధ్యంకాదు’’ అని రెవెన్యూశాఖ స్పష్టం చేసింది. అయినా... పెద్దల్లు వదల్లేదు. జింపెక్స్‌కు ఎలాగైనా భూములు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఏదో ఒక క్లాజును చూపి భూమి ఇచ్చే మార్గం కనిపెట్టాలని సూచిస్తున్నారు. ఈ మేరకు గనుల శాఖ అధికారితో రెండో లేఖ రాయించారు. ఆ లేఖ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలంటూ ‘వసూల్‌ రాజా’ ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. నిజానికి వసూల్‌ రాజాది కూడా ఉమ్మడి కడప జిల్లానే. దీంతో ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడం గమనార్హం!

Updated Date - Mar 20 , 2024 | 04:06 AM