Minister Savitha: టీడీపీ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి
ABN , Publish Date - Jul 10 , 2024 | 04:06 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే.. అది తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలో విలేకర్ల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు.
అనంతపురం, జులై 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే.. అది తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలో విలేకర్ల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌తోపాటు ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ది లేదని గుర్తు చేశారు. ప్రస్తుతం మళ్లీ టీడీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం మొదలైందన్నారు. కరువు జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తామని తెలిపారు. అందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఇక 2014 -2019 మధ్య మాత్రమే రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మాణం జరిగిందని తెలిపారు. కానీ వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రెండే రెండు స్కూళ్లను తీసుకు వచ్చారని వివరించారు. గత అయిదేళ్లలో రాష్ట్రంలోని హాస్టల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. గత ప్రభుత్వం హాస్టల్స్‌కు మెయింటెనెన్స్‌తోపాటు డైట్ బిల్లులు సైతం చెల్లించలేదని గుర్తు చేశారు. వచ్చే ఏడాది స్కూల్స్, క్లాస్ రూమ్స్ పెంచనున్నట్లు తెలిపారు. హాస్టల్స్‌లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.
Also Read: Pooja Khedkar : ట్రైయినీ ఐఏఎస్‌పై బదిలీ వేటు..
ఇక వైయస్ జగన్.. నా బీసీలని చెప్పి వారిని మోసం చేయడం ద్వారా ఆయన బీసీల ద్రోహిగా మారారన్నారు. రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని... వారికి నిత్యం అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు తమకు సూచించారని మంత్రి సవిత వివరించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రభుత్వ వసతి గృహాలు అధ్వాన్నస్థితికి చేరుకున్నాయన్నారు.
అలాగే రాష్ట్రం అప్పుల ఊబిలో కురుకుపోయిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీర్వాదంతో.. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇసుక మాఫియా నడిచిందని విమర్శించారు. ఇసుక పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. చివరికి సమాధి నిర్మాణానికి సైతం ఇసుక దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. అయితే తమ ప్రభుత్వ ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ప్రతీ ఒక్కరికి ఇసుక అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు. బడుగు, బలహీన వర్గాల వారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సవిత స్పష్టం చేశారు.
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News