US Elections Result 2024: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు
ABN , Publish Date - Nov 06 , 2024 | 03:34 PM
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా అభినందనలు తెలిపారు. యూఎస్, భారత్ దేశాల మధ్య బంధం మరింత దృఢపడాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు ట్రంప్‌కు ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు అభినందనలు తెలుపుతున్నారు.
అమరావతి, నవంబర్ 06: అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డోనాల్డ్ ట్రాంప్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఆయన సారథ్యంలో అమెరికా మరింత పురోగతి సాధిస్తుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గతంలో అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ హయాంలో భారత్, అమెరికా దేశాల మధ్య భాగస్వామ్య బంధం మరింత దృఢ పడిందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
అలాగే అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ఇరు దేశాలు.. తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ రెండు దేశాలు సహకారాన్ని మరింత పెంపొందించుకుంటాయని తాను విశ్వసిస్తున్నానని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు తెలిపారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. నవంబర్ 05వ తేదీన జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య గట్టి పోటి నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే అమెరికా ఓటరు మాత్రం ట్రంప్‌కు పట్టం కట్టారు.
మరోవైపు 47వ దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు అభినందనలు తెలుపుతున్నారు. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటే ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని, ప్రెంచ్ దేశాధ్యక్షుడితోపాటు ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు అభినంధనలు తెలియజేశారు.
For AndhraPradesh News And Telugu News...