Share News

Andhra Pradesh : కక్ష కట్టి.. పొట్టగొట్టి

ABN , Publish Date - May 10 , 2024 | 05:32 AM

‘‘నా ఎస్సీలు... నా ఎస్టీలు.. నా బీసీలు... నా మైనారిటీలు’’ అంటూ తానొక్కడినే పేదల పక్షపాతినని, ఊరూరా ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టే సీఎం జగన్‌, ఆచరణలో వారి పట్ల కా ఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

Andhra Pradesh : కక్ష కట్టి.. పొట్టగొట్టి

‘కానుకలు’ ఎగ్గొట్టి ఏం సాధించావ్‌ జగన్‌?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘నా ఎస్సీలు... నా ఎస్టీలు.. నా బీసీలు... నా మైనారిటీలు’’ అంటూ తానొక్కడినే పేదల పక్షపాతినని, ఊరూరా ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టే సీఎం జగన్‌, ఆచరణలో వారి పట్ల కా ఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ వర్గాల్లోనే ఎక్కువగా ఉండే పేద ల విషయంలో పగ బట్టినట్టు వ్యవహరిస్తున్నారు. బీద, బడుగు వర్గాలకు భరోసాగా నిలుస్తున్న ప్రజా పం పిణీ వ్యవస్థను ఐదేళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేసిన తీరే ఇందుకు ఉదాహరణ. రేషన్‌ సరుకుల్లో ఒక్కొక్కటిగా ఎగ్గొట్టి పేదల పొట్ట కొట్టారు.

టీడీపీ హయాం లో రేషన్‌ కార్డుదారులందరికీ రూపాయికి కిలో బియ్యంతోపాటు 50 శాతం రాయితీపై 2 కిలోల చొప్పున కందిపప్పు, ఇంకా పంచదార, గోధుమలు, రాగు లు, జొన్నలు, శనగలు, ఉప్పు, వంటనూనె తదితర 9 రకాల నిత్యావసర సరుకులు, మహిళలకు శానిటరీ ప్యాడ్స్‌ను కూడా రేషన్‌ షాపుల్లో ఇచ్చేవారు.

సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకు ‘చంద్రన్న కానుక’ పేరుతో సుమారు రూ.500 విలువ చేసే ఆరేడు రకాల సరుకులతో ప్రత్యేక కిట్లను కార్డుదారులందరికీ ఉచితంగానే అందించారు. ఆయా పండుగలకు కార్డుదారులు ఊరేళ్లినా లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడే చంద్రన్న కానుకలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. దాంతో అత్యంత నిరుపేదలు కూడా చంద్రన్న కానుకల ద్వారా ఉచితంగా వచ్చే రేషన్‌ సరుకులతో పిండివంటలు చేసుకుని పండుగలను ఆనందంగా జరుపుకొనేవారు.

ఈ చంద్రన్న కానుకల పంపిణీతో ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.2,000 కోట్ల భారం పడేది. అయినప్పటికీ.. టీడీపీ ప్రభుత్వం అందించిన ఉచిత కానుకలతో రాష్ట్రంలో రూ.1.30 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేది. పండగల వేళ పేదలు పస్తులుండే పరిస్థితులుండేవి కాదు. కానీ జగన్‌ అధికారంలోకి వచ్చీరాగానే సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుకలను ఆపేశారు.


సరుకుల్లో కోతలు.. ధరలతో వాతలు

వైసీపీ అధికారంలోకి వచ్చాక రేషన్‌ కార్డుదారులకు ప్రతినెలా రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్‌ సరుకుల్లో కోతలు.. ధరలు పెంపుతో వాతలు తప్ప పేదలకు అదనంగా చేకూరిన మేలు ఏమీ లేదు. 2019 వరకు టీడీపీ ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేసిన 9 రకాల సరుకుల జాబితా నుంచి ఉప్పు, గోధుమపిండి, రాగులు, జొన్న లు, మహిళలకిచ్చే శానిటరీ నేప్‌కిన్స్‌ను తొలగించింది. దీనివల్ల కార్డుదారులు ప్రతిఏటా రూ.3 వేల కోట్లకు పైగా నష్టపోయారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది నుంచి రాగి, గోధుమపిండి, ఇటీవల సీమలో జొన్నల పంపిణీని తిరిగి ప్రారంభించింది. కందిపప్పు కోటాను 2 కిలోల నుంచి ఒక కిలోకు కుదించడంతోపాటు.. 50 శాతం సబ్సిడీని 25 శాతాని కి తగ్గించేసింది. ఫలితంగా రేషన్‌ కందిపప్పు ధర రూ.40 నుంచి ఇప్పుడు రూ.67కు పెరిగింది. టీడీపీ ప్రభుత్వం అరకిలో పంచదారను కార్డుదారులకు రూ.10కే అందించగా.. ఈ ప్రభుత్వం వచ్చాక అరకిలో పంచదార రేటును రూ.17 లకు పెంచేసింది. తద్వారా రేషన్‌కార్డుదారులపై రూ.625 కోట్ల ఆర్థిక భారాన్ని మోపింది. గత ఏడాది నుంచి కందిపప్పు సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. వినాయక చవితి, దసరా, రంజాన్‌, క్రిస్మస్‌, సంక్రాంతి.. ఇలా పండుగలకు కూడా కనీసం కందిపప్పును సరఫరా చేయలేదు. పంచదార మాత్రం అరకొరగా ఇస్తున్నారు.

వృథా ప్రయాస...

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు అందిస్తామంటూ రేషన్‌ డీలర్ల వ్యవస్థకు సమాంతరంగా ఎండీయూ వ్యవస్థను తీసుకువచ్చారు. కార్డుదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తామంటూ గొప్పలు చెప్పిన జగన్‌ తర్వాత మాట మార్చేశారు. రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీ కో సం ఏకంగా రూ.539 కోట్లతో 9,260 వాహనాలను కొనుగోలు చేశారు. ఇంతా చేస్తే ఇంటింటికీ వెళ్లాల్సిన రేషన్‌ వాహనాలను పట్టణాల్లో ఏదో ఒక వీధి చివరన, గ్రామాల్లో అయితే ఊరి పొలిమేర్లలోనూ నిలిపి బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక వేళ వరుసగా మూడు నెలలు సరుకులు తీసుకోకపోతే రేషన్‌కార్డులు రద్దు చేసేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం రూ.560 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి రేషన్‌ వాహనాలను కొనుగోలు చేయడం, ఆ వాహనాల్లో బియ్యం పంపిణీ చేసే ఎండీయూ ఆపరేట్లకు ప్రతి నెలా రూ. 21 వేలు చొప్పున జీతాలు చెల్లిస్తుండటం.. ‘పావలా కోడికి.. ముప్పావలా మసాలా’ అన్న చందంగా ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అవే చౌక బియ్యాన్ని గతంలో డీలర్ల ద్వారా సరఫరా చేసేటప్పుడు అయ్యే ఖర్చు నామమాత్రమే.


అప్పట్లో..

రేషన్‌ షాపుల్లో... రూపాయికి కిలో బియ్యం, 50 శాతం రాయితీపై రెండు కిలోల కందిపప్పు, ఇంకా అర కిలో చొప్పున పంచదార, గోధుమలు, రాగులు, జొన్నలు, శనగలు, ఉప్పు, వంటనూనె. మహిళలకు శానిటరీ ప్యాడ్స్‌ పంపిణీ చేసేవారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు వారి పండగల్లో ఇచ్చే ఆరు రకాల కానుకలు దీనికి అద నం. అరకిలో పంచదార రూ.10 కి, కిలో కందిపప్పు రూ. 40కు రాయితీపై ఇచ్చేవారు. ఇన్ని సరుకులు, ఎంతో రాయితీతో పేదలకు అందించినా చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రజా పంపిణీ వ్యవస్థపై రుణ భారం రూ. 16 వేల కోట్లు.

ఇప్పుడు..

జగన్‌ ‘ఇంటింటా రేషన్‌ పంపిణీ’ వాహనంలో.. టీడీపీ ఇచ్చిన తొమ్మిది రకాల సరుకుల జాబితా నుంచి ఉప్పు, గోధుమపిండి, రాగులు, జొన్నలు, మహిళలకిచ్చే శానిటరీ ప్యాడ్స్‌ ఎత్తేశారు. పంచదార రూ. 17, కందిపప్పు రూ.67కు అంటగడుతున్నారు. ఏడాదిగా ఆ ఇచ్చే కందిపప్పును కూడా ఆపేశారు.

సరుకులకు కోతలేసి, కానుకలు కూడా ఇవ్వకుండా పేదలను ఎంతగానో మోసం చేసినా., జగన్‌ ఐదేళ్ల పాలనలో ప్రజా పంపిణీ వ్యవస్థపై పడిన అప్పుల భారం రూ.30 వేల కోట్లు. పంపిణీకి ఆర్భాటంగా కొనుగోలుచేసిన బండ్లు ప్రజా పంపిణీ వ్యవస్థకు గుడిబండలుగా మారడమే ఈ భారానికి కారణం!

బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుల ఇంటి బడ్జెట్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో డబుల్‌ అయింది. రోజుకూలీలు, ఇతరత్రా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదల ఇళ్లల్లో రెండు పూటల పొయ్యి వెలగని పరిస్థితి! ఇలాంటి పరిస్థితుల్లో ఆ పేద కుటుంబాల వారికి నెలకు కిలో కందిపప్పు కూడా రాయితీపై అందటం లేదు. నిరుపేదలు జగన్‌ ఏలుబడిలో పండగలప్పుడు కూడా పప్పన్నం తినే భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు.

కార్పొరేషన్‌ దివాలా

ఏడాదికి దాదాపు రూ 3 వేల కోట్ల భారాన్ని పేదలపై జగన్‌ ప్రభుత్వం వేసింది. మిగిలిన నామమాత్రపు సబ్సిడీల భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించకుండా పౌరసరఫరాల సంస్థపైకి నెట్టేసింది. దీంతో సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రాయితీలు, కానుకలు ఇచ్చినా ఐదేళ్లలో కార్పొరేషన్‌ అప్పులు రూ. 16 వేల కోట్లు. జగన్‌ ప్రభుత్వం ఇన్ని కోతలు, కొర్రీలు పెట్టినా, దాదాపు రూ.30 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలే ఉన్నాయని కార్పొరేషన్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - May 10 , 2024 | 05:32 AM