బాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
ABN , Publish Date - Nov 30 , 2024 | 03:46 AM
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.
న్యూఢిల్లీ, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందని జగన్ సర్కారు కేసు నమోదు చేసింది. గతేడాది సెప్టెంబరు 9న సీఐడీ ఆయన్ను అరెస్టు చేసింది. 52రోజులు రాజమహేంద్రవరం జైలులో ఉన్న ఆయనకు హైకోర్టు గత నవంబరు 20న బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వర్చువల్‌గా హాజరయ్యారు. తాను ప్రస్తుతం ఢిల్లీలో లేనని, స్వయంగా హాజరై వాదనలు వినిపించాలని భావిస్తున్నట్లు చెప్పారు. విచారణను వాయిదా వేయాలని అభ్యర్థించారు. ప్రతిసారీ వాయిదా వేయడంలో అర్థం లేదని.. ఇదే చివరిసారిగా ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను జనవరి రెండోవారంలో చేపడతామని స్పష్టం చేసింది.