Share News

పల్నాడులో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది!

ABN , Publish Date - May 17 , 2024 | 04:16 AM

పోలింగ్‌ రోజు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లాలో జరిగిన ఘటనలు ప్రపంచం మొత్తం చూసిందని, ఆధారాలను ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించింది. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా

పల్నాడులో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది!

ప్రత్యేకంగా ఆధారాలు చూడక్కర్లేదు

హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఆందోళన

ఎక్కడా హింస జరక్కుండా చర్యలు తీసుకోండి

సీఈవో, డీజీపీ, కలెక్టర్‌, ఎస్పీలకు ఆదేశం

ప్రత్యేకంగా ఆధారాలు చూడక్కర్లేదు: హైకోర్టు

ఎక్కడా హింస జరక్కుండా చర్యలు తీసుకోండి

సీఈవో, డీజీపీ, కలెక్టర్‌, ఎస్పీలకు ఆదేశం

అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ రోజు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లాలో జరిగిన ఘటనలు ప్రపంచం మొత్తం చూసిందని, ఆధారాలను ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించింది. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, డీజీపీ, పల్నాడు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించింది. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంది. అదనపు బలగాలను మోహరించాలని పిటిషనర్‌ సమర్పించిన వినతిని పరిశీలించాలని ఈసీ, అధికారులను ఆదేశించింది. వ్యాజ్యా న్ని పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ వినుకొండకు చెందిన న్యాయవాది ఎన్‌.రామకోటేశ్వరరావు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. పల్నాడువ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని.. అదనపు బలగాలు మోహరించాలని పిటిషనర్‌ వినతి సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలూ లేవని.. అదనపు బలగాలు లేకపోవడంతో ఎస్పీ సైతం నిస్సహాయత వ్యక్తంచేశారని తెలిపారు. ఈసీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అదనపు బలగాలను మోహరించాలన్న పిటిషనర్‌ వినతి ఈసీ పరిశీలనలో ఉందన్నారు. అల్లర్ల కట్టడికి చర్యలు తీసుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. పల్నాడు జిల్లాలో అల్లర్లకు సంబంధించి డీజీపీ, ఎస్పీ నుంచి ఈసీ వివరణ కోరిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది నిర్మల్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. పల్నాడువ్యాప్తంగా ఇప్పటికే 144 సెక్షన్‌ విధించామని.. అదనపు బలగాలను మోహరించామని.. బాధ్యులపై ఇప్పటికే కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నాయని.. ఈ నేపథ్యంలో వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - May 17 , 2024 | 04:16 AM