AP High Court : ఎలిమెంటరీ స్థాయి ఉమ్మడి పరీక్ష రద్దు
ABN , Publish Date - Jun 30 , 2024 | 05:50 AM
రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించేందుకు వీలుగా గత జగన్ సర్కారు తీసుకువచ్చిన తరగతి గది ఆధారిత అంచనా పరీక్ష(సీబీఏ) విధానాన్ని హైకోర్టు కొట్టేసింది.
విద్యాహక్కు చట్టం నిబంధనలకు విరుద్ధం
తీర్పు వెల్లడి.. జగన్ విద్యావిధానాన్ని కొట్టేసిన హైకోర్టు
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించేందుకు వీలుగా గత జగన్ సర్కారు తీసుకువచ్చిన తరగతి గది ఆధారిత అంచనా పరీక్ష(సీబీఏ) విధానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ పరీక్ష కారణంగా విద్యార్థులు భయం, ఆందోళనకు గురవుతారని పేర్కొంది. సీబీఏ విధానంలో నిర్దిష్ఠ టైం టేబుల్ ప్రకటించడం, రాష్ట్రవాప్తంగా ఒకటే ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించడం వంటికి బోర్డు పరీక్షను పోలి ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయం విద్యాహక్కు చట్టంలోని సెక్షన్లు 29, 30కి విరుద్ధమని పేర్కొంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సీబీఏ విధానం, దాని అమలుకోసం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయిన సుజాత ఇటీవల తీర్పు ఇచ్చారు. సపోర్టింగ్ ద ఆంధ్రా స్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్ధులకు సీబీఏ విధానాన్ని తప్పనిసరి చేస్తూ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎ్ససీఈఆర్టీ) 2022, అక్టోబర్ 3న ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలన్నీ ఈ విధానంలో భాగస్వామ్యం కావాలని, పరీక్ష నిర్వహణకు నిర్దిష్ఠ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొంది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్, మరో విద్యాసంస్థ అదే ఏడాది హైకోర్టును ఆశ్రయించాయి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి ఇటీవల నిర్ణయాన్ని వెల్లడించారు.