Share News

పులివెందుల మెడికల్‌ కళాశాలలో 50 సీట్ల భర్తీకి అనుమతులు

ABN , Publish Date - Aug 06 , 2024 | 11:51 PM

పులివెందుల మెడికల్‌ కళాశాలకు ఎట్టకేలకు అనుమతులు మంజూరయ్యాయి. 50 ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి ఎన్‌ఎంసీ అనుమతిచ్చింది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యి ఇక్కడ రోగులకు సేవలు అందిస్తున్నారు.

పులివెందుల మెడికల్‌ కళాశాలలో 50 సీట్ల భర్తీకి అనుమతులు

పులివెందుల రూరల్‌, ఆగస్టు 6: పులివెందుల మెడికల్‌ కళాశాలకు ఎట్టకేలకు అనుమతులు మంజూరయ్యాయి. 50 ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి ఎన్‌ఎంసీ అనుమతిచ్చింది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యి ఇక్కడ రోగులకు సేవలు అందిస్తున్నారు. అయితే మెడికల్‌ కళాశాల భవన నిర్మాణాలు పూర్తికాకపోవడంతో కళాశాలకు అనుమతులు వస్తాయా రావా అనే సందిగ్ధం నెలకొని ఉండేది. ఎన్‌ఎంసీ బృందం వచ్చే సమయానికి ఆ ఆవరణలో ఉన్న మరో పూర్తయిన భవనాన్ని అధికారులు చూపించారు. ఎన్‌ఎంసీ బృందం ఎంబీబీఎ్‌సకు అవసరమైన గదులు, వసతులు, ల్యాబ్‌ తదితర సౌకర్యాలను తనిఖీ చేశారు. ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది ఎంతమంది ఉన్నారు అనే వాటిపై ఆరాతీశారు. అనంతరం 100 సీట్లను భర్తీ చేసేందుకు ఇక్కడి అధికారులు నివేదికలు పంపగా ఆ భవనానికి వంద సీట్లు అనుమతులు ఇవ్వలేమని ఎన్‌ఎంసీ బృందం చెప్పినట్లు తెలిసింది. దీనితో మళ్లీ అనుమతులకు నివేదికలు పంపగా ఉన్న సౌకర్యాలకు అనుగుణంగా 50 సీట్లు మాత్రమే భర్తీచేసేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ విషయంపై మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీదేవి మాట్లాడుతూ 50సీట్ల భర్తీకి అనుమతులు వచ్చాయన్నారు. మరో మూడు రోజుల్లో లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ (ఎల్‌ఓపీ) వస్తుందని, అనంతరం వెబ్‌సైట్‌లో మెడికల్‌ కళాశాల పేరు నమోదవుతుందన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఎంబీబీఎస్‌ సీట్లకు సంబంధించి వెబ్‌కౌన్సెలింగ్‌ మొదలవుతుందన్నారు. 50 సీట్లు భర్తీ అయితే అందుకు తగ్గ స్టాఫ్‌, సౌకర్యాలు ఉన్నాయన్నారు.

Updated Date - Aug 06 , 2024 | 11:51 PM